
ఆంధ్రప్రదేశ్
కూరగాయలు తరుగుతున్న విద్యార్థులు
లేపాక్షి, న్యూస్టుడే: అనంతపురం జిల్లా లేపాక్షి జ్యోతిబా ఫులే బీసీ గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యార్థులే వంట వండుకుని తినాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇక్కడ ఒప్పంద పద్ధతిన పని చేసే వంట, బోధనేతర సిబ్బందికి 4 నెలలుగా వేతనాలు అందలేదు. వారంతా మంగళవారం సమ్మెబాట పట్టారు. పాఠశాల, కళాశాలలో 1,140 మంది విద్యార్థులు, 75 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వంట సిబ్బంది సమ్మెకు దిగడంతో ఉపాధ్యాయులు విద్యార్థులతో కూరగాయలు తరిగించి, వంట చేయించారు. గురువులే దగ్గరుండి వంట పనులు చేయించడంపై టీన్ఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ ప్రతినిధులు ప్రిన్సిపల్ను నిలదీశారు. సమ్మెకు దిగినవారు బుధవారం నుంచి విధులకు హాజరయ్యేలా ఏజెన్సీ నిర్వాహకుడితో మాట్లాడినట్లు ప్రిన్సిపల్ వివరించారు.