
గ్రేటర్ హైదరాబాద్
మంత్రి నిరంజన్‌రెడ్డి డిమాండ్
యాసంగిలో పంటల మార్పిడి తప్పదని వ్యాఖ్య
పప్పులు, నూనె గింజలు సాగు చేయాలని సూచన
ఈనాడు, హైదరాబాద్: పంటలకు మద్దతు ధరపై కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంటు సమావేశాల్లోనే చట్టం చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రైతుల శ్రేయస్సు కోసం కేంద్రం తన ధోరణి మార్చుకోవాలన్నారు. కేంద్రం వరి ధాన్యం సేకరణపై చేతులెత్తేసినందున యాసంగిలో పంటల మార్పిడి పెద్ద ఎత్తున జరగాలని, రాష్ట్రంలో రైతన్నలు పప్పు, నూనె గింజలు అధికంగా సాగు చేయాలని సూచించారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో మార్కెటింగ్, ఉద్యానవనాల శాఖలు, మార్క్‌ఫెడ్, హాకాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ శ్రీగంధానికి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉందని, దాని సాగు వైపు రైతులను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. దాన్ని అమ్ముకునేందుకు అటవీశాఖ నిబంధనలు సరళతరం చేయాలన్నారు. పట్టణప్రాంతాల చుట్టూ కూరగాయల సాగుపై దృష్టి సారించాలన్నారు. యాసంగి పంటల కోసం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న ఎరువుల వివరాలపై పర్యవేక్షించాలన్నారు. కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసినందున గతంలోలా రాష్ట్ర వ్యవసాయ చట్టం, నిబంధనల ప్రకారం వ్యవసాయ మార్కెట్లను మరింత పటిష్ఠంచేసి మరిన్ని వసతులు సమకూర్చాలన్నారు. అధికారులు వివిధ రాష్ట్రాల మార్కెట్లను అధ్యయనం చేసి రైతులకు లాభం కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. వరంగల్, ఖమ్మంలలో మిరప ట్రేడింగ్ యూనిట్లు, కోహెడలో అంతర్జాతీయ స్థాయి వసతులతో మార్కెట్, కొల్లాపూర్‌లో మామిడి మార్కెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. హాకా పటిష్ఠం కావాలన్నారు. గోదాముల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని మంత్రి సూచించారు.