
గ్రేటర్ హైదరాబాద్
ఎఫ్-16 యుద్ధవిమాన రెక్కల ఆవిష్కరణలో మంత్రి కేటీఆర్
వైమానిక రంగంలో అద్భుత ప్రగతి
కార్యక్రమంలో పాల్గొన్న టీఎల్ఎంఏఎల్ డైరెక్టర్ బ్రౌన్, యూఎస్ కాన్సుల్ జనరల్ జొయల్ రీఫ్మాన్, లాక్‌హీడ్ మార్టిన్ ఉపాధ్యక్షురాలు ఐమీ బర్నెట్, మంత్రి కేటీఆర్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఎండీ, సీఈవో సుకరన్‌సింగ్, లాక్‌హీడ్ సీఈవో విలియమ్ బ్లెయిర్ (వెనుక యుద్ధ విమాన రెక్క నమూనా)
ఈనాడు, హైదరాబాద్: పూర్తిస్థాయి విమానాలు, హెలికాప్టర్ల తయారీకి తెలంగాణ కేంద్రంగా మారనుందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు అన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో వైమానిక కేబిన్లు, ఇంజిన్లు, రెక్కలు, ఇతర విడిభాగాలు తయారవుతుండగా.. త్వరలోనే పూర్తిస్థాయి లోహవిహంగాల ఉత్పత్తి జరగనుందని చెప్పారు. ‘ఫ్యూచర్ ఏరోస్పేస్’ నగరాల్లో హైదరాబాద్ ప్రపంచ ర్యాంకుల్లో అగ్రస్థానంలో ఉండటం తెలంగాణకే గర్వకారణమన్నారు. మంగళవారం ఆదిభట్లలోని టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్స్ లిమిటెడ్ (టీఎల్ఎంఏఎల్) రూపొందించిన ఎఫ్-16 యుద్ధవిమానాల రెక్కల (ఫైటర్ వింగ్స్) ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘తెలంగాణలో వైమానిక, రక్షణ పర్యావరణ వ్యవస్థల అభివృద్ధికి ఇది ప్రబల సాక్ష్యంగా, భారత్‌లో-రాష్ట్రంలో తయారీకి సూచికగా నిలుస్తోంది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ తదితర దేశాల్లోని ప్రముఖ సంస్థలు ఇక్కడ ఉత్పత్తి పరిశ్రమలతో పాటు ఇంజినీరింగ్, శిక్షణ, ఆవిష్కరణ కేంద్రాలను స్థాపించడం రాష్ట్రానికి గర్వకారణం. టాటా, లాక్‌హీడ్ మార్టిన్ భాగస్వామ్యంతో ఫైౖటర్ వింగ్స్‌ని హైదరాబాద్‌లో తయారు చేయడం శుభపరిణామం. 2018లో ఎఫ్-16 యుద్ధవిమానాల కోసం రెక్కల ప్రొటోటైప్ తయారు చేశారు. ఇప్పుడు పూర్తిస్థాయి ఉత్పత్తి చేస్తున్నారు. భారీ పరిశ్రమలకు తోడుగా వెయ్యికి పైగా చిన్న, మధ్యతరహా అనుబంధ పరిశ్రమలు హైదరాబాద్‌లో ఉన్నాయి. ఈ రంగం అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తుంది’’ అని కేటీఆర్ తెలిపారు. లాక్‌హీడ్ మార్టిన్‌తో తమ భాగస్వామ్యంలో ఇది మరో మైలురాయి అని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఎండీ, సీఈవో సుకరన్‌సింగ్ చెప్పారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విమాన రెక్కల విడిభాగాలను రూపొందిస్తున్నామని లాక్‌హీడ్ మార్టిన్ వ్యూహాత్మక వ్యాపార అభివృద్ధి విభాగం ఉపాధ్యక్షురాలు ఐమీ బర్నెట్ తెలిపారు. తెలంగాణతో అమెరికా సంబంధాలను వైమానిక సంస్థలు దృఢతరం చేస్తున్నాయని హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సుల్ జనరల్ జొయల్ రీఫ్మాన్ చెప్పారు. సమావేశంలో టీఎల్ఎంఏఎల్ డైరెక్టర్ బ్రౌన్, లాక్‌హీడ్ మార్టిన్ సీఈవో విలియమ్ బ్లెయిర్, సీఈవో కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి కేటీఆర్‌కు జ్ఞాపిక అందిస్తున్న ఐమీ బర్నెట్