
ఆంధ్రప్రదేశ్
సీతారాం ఏచూరికి మాల మహానాడు వినతి
ఈనాడు, దిల్లీ: ఎస్సీ వర్గీకరణ అంశానికి సహకరించవద్దని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి మాల మహానాడు నేతలు విన్నవించారు. దిల్లీలోని సీపీఎం కేంద్ర కార్యాలయంలో ఏచూరిని మంగళవారం వారు కలిశారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఆధ్వర్యంలో జంతర్‌మంతర్‌లో రెండో రోజూ మంగళవారం దీక్షలు కొనసాగించారు. దీక్షా శిబిరాన్ని తిరుపతి ఎంపీ గురుమూర్తి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మాలమాదిగలు సోదరుల్లా కలిసి ఉండి రాజ్యాధికారం కోసం పోరాడాలని సూచించారు. మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య మాట్లాడుతూ వర్గీకరణ చేపడితే భాజపా ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. దీక్షలో నాయకులు తాళ్లపల్లి రవి, నన్నేటి పుష్పరాజ్, పిట్టల భాగ్యమ్మ, జాకబ్, గాజుల పున్నమ్మ తదితరులు పాల్గొన్నారు.