
తెలంగాణ
ఎల్బ్రూస్ పర్వతంపై జాతీయ పతాకంతో అన్విత
భువనగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఎర్రంబల్లి గ్రామానికి చెందిన యువతి పడమటి అన్విత మంగళవారం ఉదయం రష్యాలో అతి ఎత్తయిన ఎల్బ్రూస్ పర్వతాన్ని అధిరోహించారు. దీని ఎత్తు 5,642 మీటర్లు(18,510 అడుగులు) ఉంటుంది. అన్విత ఈ నెల 4న పర్వతారోహణను ప్రారంభించారు. మరుసటి రోజు బేస్ క్యాంపునకు చేరుకున్నారు. అక్కడ 10 మీటర్ల పొడవున్న జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. మంగళవారం ఉదయం శిఖరాగ్రానికి చేరుకొన్నారు. అన్విత(23) భువనగిరి ఖిల్లా వద్ద గల రాక్ క్లైంబింగ్ స్కూల్లో శిక్షకురాలిగా పనిచేస్తున్నారు. గతంలో సిక్కింలోని రెనాక్, బీసీ రాయ్, ఆఫ్రికాలోని కిలిమంజారో, లద్దాఖ్‌లోని కడే పర్వతాలను ఆమె అధిరోహించారు. అన్విత తండ్రి పడమటి మధుసూదన్‌రెడ్డి రైతు కాగా, తల్లి చంద్రకళ భువనగిరిలో అంగన్వాడీ టీచర్. ‘మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో మంచు పర్వతాన్ని అధిరోహించడం ఎంతో కష్టమైంది, సాహసంతో కూడినది. గురువు శేఖర్‌బాబు శిక్షణ, గైడ్(షెర్పా) చెతూర్కుమార్ పర్యవేక్షణలో దీన్ని అధిరోహించినందుకు ఆనందంగా ఉంది’ అని అన్విత ‘న్యూస్‌టుడే’కు ఫోన్లో తెలిపారు. ఎల్బ్రూస్ పర్వతాన్ని అధిరోహించిన తొలి భారతీయురాలిని తానేనని.. త్వరలో లిమ్కా బుక్‌లో తన పేరు నమోదు కానుందని ఆమె చెప్పారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనేది తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.