
తెలంగాణ
మిల్లర్లపై ఫిర్యాదు
కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట వడ్ల బస్తాల లారీతో ప్రభుత్వ విప్ గోవర్ధన్, రైతులు
కామారెడ్డి కలెక్టరేట్, న్యూస్‌టుడే: అడిగినంత తరుగుకు అంగీకరించిన వారి ధాన్యాన్ని మాత్రమే మిల్లర్లు దించుకుంటున్నారన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మంగళవారం స్పందించారు. రైతులతో కలిసి ధాన్యం లారీని కలెక్టరేట్‌కు తీసుకొచ్చారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ను కలిసి విషయాన్ని వివరించారు. ‘కామారెడ్డి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన ఐదుగురు రైతులకు సంబంధించిన 700 బస్తాల ధాన్యాన్ని ఆరు రోజుల క్రితం తూకం వేసి దేవునిపల్లిలోని ఓ రైస్‌మిల్లుకు పంపించారు. నాసిరకంగా ఉన్నాయని అక్కడ దించుకోలేదు. రైతులు అధికారులకు సమాచారమిచ్చారు. అధికారులు కామారెడ్డి శివారులోని మరో మిల్లుకు పంపించారు. మూడు రోజుల అనంతరం వారూ తిప్పి పంపించారు. దీంతో రైతులు నన్ను కలిశారు’ అని ఎమ్మెల్యే వివరించారు. కలెక్టర్ జోక్యంతో పౌరసరఫరాలశాఖ అధికారులు స్పందించి సదరు మిల్లర్‌తో మాట్లాడటంతో ధాన్యం తీసుకున్నారు.