
జాతీయ- అంతర్జాతీయ
బోస్టన్: కొవిడ్ టీకా వల్ల వచ్చే మయోకార్డైటిటస్ అనే అత్యంత అరుదైన దుష్ప్రభావాన్ని యువత చాలా మెరుగ్గా ఎదుర్కోగలదని తాజా అధ్యయనం తేల్చింది. ఈ రుగ్మత వల్ల గుండె కండరంలో ఇన్ఫ్లమేషన్ తలెత్తుతుంది. 21 ఏళ్ల వయసులోపు వారిలో దీని ప్రభావం నామమాత్రంగానే ఉంటుందని అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. వీరిలో చాలా స్వల్ప లక్షణాలే కనిపిస్తాయని, అవి చాలా త్వరగా తగ్గిపోతాయని వెల్లడైంది. మయోకార్డైటిస్ సమస్యవల్ల గుండె బలహీనపడొచ్చు. మయోకార్డైటిస్ సమస్య.. చాలా సందర్భాల్లో ఇన్ఫెక్షన్ లేదా వైరస్‌తో తలెత్తిన ఇన్ఫ్లమేషన్ వల్ల ఉత్పన్నం కావొచ్చు. టీకా తర్వాత ఎక్కువగా కౌమార, యువతలోనే ఇది కనిపించిందని పరిశోధకులు తెలిపారు. ఈ నేపథ్యంలో అమెరికా, కెనడాలో 139 మందిపై పరిశీలన జరిపారు. వీరి వయసు 12 నుంచి 20 ఏళ్ల మధ్య ఉంది. వీరిలో దాదాపు అందరికీ (97.8% మంది) ఎంఆర్ఎన్ఏ టీకా పొందాకే ఈ రుగ్మత వచ్చింది. 91.4% మందికి రెండో డోసు పొందాకే ఇది తలెత్తింది. ఎక్కువ మందిలో ఛాతి నొప్పి కనిపించింది. కొద్దిమందిలో జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. ప్రతి ఐదుగురు బాధితుల్లో ఒకరు ఆసుపత్రిలో చేరారు. ఎవరికీ ప్రాణాపాయం కలగలేదు.