
జాతీయ- అంతర్జాతీయ
ఉద్యోగులకు యూఏఈ శుభవార్త
దుబాయ్: నూతన సంవత్సర కానుకగా తమ దేశంలోని ఉద్యోగులకు యూఏఈ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై వారు వారానికి నాలుగున్నర రోజులు పనిచేస్తే చాలని ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న ఐదు రోజుల పనిదినాలను కుదిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల ఉత్పాదకతను పెంచడంతో పాటు విధి నిర్వహణ, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత సాధించడానికి వీలుగా ఈ చర్యను చేపట్టినట్లు వెల్లడించింది. తద్వారా ఇలాంటి ఉద్యోగ అనుకూల నిర్ణయం తీసుకున్న తొలి దేశంగా నిలిచింది. జనవరి 1 నుంచి అమలులోకి వచ్చే నూతన షెడ్యూలు ప్రకారం.. సోమవారం నుంచి గురువారం వరకు రోజూ ఉదయం 7:30 నుంచి 3:30 వరకూ, శుక్రవారం ఉదయం 7:30 నుంచి 12:00 వరకూ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత రెండున్నర రోజులు సెలవులు ఆస్వాదించొచ్చు. అంతేకాదు.. శుక్రవారం ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడానికి, కోరుకున్న సమయాల్లో కార్యకలాపాలు నిర్వహించడానికి ప్రభుత్వం వెసులుబాటునిచ్చింది. ఆరోజు ప్రత్యేక ప్రార్థనలను మధ్యాహ్నం 1:15 తర్వాత నిర్వహించనున్నట్లు వెల్లడించింది.