
గ్రేటర్ హైదరాబాద్
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చందాపూర్‌కు చెందిన బొర్ర సౌందర్య ఇటీవలే జిల్లా ఆసుపత్రిలో సిజేరియన్ ద్వారా ప్రసవించారు. అనంతరం ఇంటికి చేరుకున్న ఆమెకు మంగళవారం కుట్లలోంచి రక్తస్రావం అవుతూ భరించలేని నొప్పి ప్రారంభమైంది. కుటుంబసభ్యులు హుటాహుటిన 108 అంబులెన్సులో జిల్లా ఆసుపత్రికి తరలించారు. నిల్చోలేని స్థితిలో ఉన్న ఆమె కోసం వీల్‌ఛైర్ కావాలని సిబ్బందికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. చివరకు నొప్పిని భరిస్తూనే ఆమె అంబులెన్సు దిగారు. ఉబికొచ్చే కన్నీళ్లు తుడుచుకుంటూ ఆసుపత్రిలోకి అడుగులు వేశారు. ఈ విషయంపై సిబ్బందిని ప్రశ్నించగా వీల్ఛైర్లు తీసుకెళ్లి ఎక్కడెక్కడో పెడుతుండటంతో కనిపించడం లేదని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు.
- న్యూస్‌టుడే, కామారెడ్డి అర్బన్