
గ్రేటర్ హైదరాబాద్
నిర్వాహకుడిపై రైతుల దాడి
ఒబులాపూర్ కొనుగోలు కేంద్రం వద్ద ఆందోళనకు దిగిన రైతులతో మాట్లాడుతున్న అధికారులు
మల్లాపూర్, న్యూస్టుడే: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఒబులాపూర్ గ్రామంలో బండారి మానస ధాన్యం కొనుగోలు కేంద్రం బాధ్యతను చూస్తున్నారు. ఆమె భర్త శ్రీనివాస్ తూకం, రవాణా వ్యవహారాలు నిర్వహిస్తున్నారు. ఎలక్ట్రానిక్ కాంటాలో ధాన్యాన్ని తక్కువగా చూపేలా ఏర్పాట్లు చేసి సీజన్ ప్రారంభం నుంచి మోసానికి పాల్పడ్డాడు. బస్తాకు ఐదారు కేజీలు తేడా వచ్చేలా కాంటాను మార్చారు. ఇప్పటివరకు గ్రామంలోని 171 మంది రైతులకు చెందిన 5,023 క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. మంగళవారం మోసాన్ని గుర్తించిన రైతులు కేంద్రం నిర్వాహకుడిపై దాడి చేశారు. మల్లాపూర్ తహసీల్దార్ రవీందర్, ఐకేపీ ఏపీఎం రాజేష్, ఎస్సై రాజేందర్ అక్కడకు చేరుకుని తూకంలో తేడాను గుర్తించారు. నష్టపరిహారం చెల్లించాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. బస్తాకు రెండు కిలోల చొప్పున నష్ట పరిహారం చెల్లిస్తానని కేంద్రం నిర్వాహకుడు శ్రీనివాస్ రాసి ఇవ్వడంతో ఆందోళన విరమించారు. డీఆర్డీఏ పీడీ వినోద్, వీవోఏ మానసను అధికారులు సస్పెండ్ చేశారు.