
వసుంధర
వ్యాపారం అంటే ఒకప్పుడు మగవాళ్లకు మాత్రమే... దాన్ని చెరిపేస్తూ వ్యాపార దిగ్గజాల రేసులో ఢీ అంటే ఢీ అన్నట్టుగా నిలుస్తున్నారు మహిళలు. అందులోనూ ఈ ఏడాది మహిళలు స్థాపించిన సంస్థలు మునుపెన్నడూ లేని విధంగా యూనికార్న్ క్లబ్బుల్లోకి చేరాయి. ఐపీవోల్లోనూ అద్భుతంగా రాణించాయి. ఎక్కడా తగ్గేదేలే అంటున్న వీళ్ల విజయాలు మహిళాలోకమంతటికీ స్ఫూర్తి కదూ...
అంకుర దశలో ఉండగానే ఏడున్నరవేల కోట్ల రూపాయల వ్యాపారం చేసిన వారిని వ్యాపార పరిభాషలో యూనికార్న్ ఆంత్రప్రెన్యూర్లంటారు. అలా ఈ ఏడాది యూనికార్న్ క్లబ్‌లోకి అడుగుపెట్టిన వారిలో ముందువరుసలో ఉన్నారు అంకితీ బోస్. జిలింగో మల్టీనేషనల్ స్టార్టప్‌ను ప్రారంభించి 20కి పైగా దేశాల్లో ఫ్యాషన్ ఉత్పత్తులని అమ్ముతూ రూ.900 కోట్లకుపైగా వ్యాపారం చేశారామె. తొలి యూనికార్న్ వ్యాపారవేత్తగా గుర్తింపు సాధించారు. ఎనిమిదేళ్ల క్రితం లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీయే చదువుకుంటూ ‘స్టైలిస్తా’ ఫ్యాషన్ బ్లాగ్‌ని ప్రారంభించారు ప్రియాంక గిల్. దాన్ని 5 లక్షలమందికి పైగా అనుసరించే వారు. ఆ ఉత్సాహంతోనే ‘పాప్గ్జో’ సౌందర్య ఉత్పత్తుల ప్లాట్‌ఫామ్‌ని ప్రారంభించారు. తన సంస్థలన్నీ కలిపి ‘గుడ్గ్లామ్’గా మార్చి దక్షిణా ఆసియాలోనే అతిపెద్ద సౌందర్య ఉత్పత్తుల సంస్థగా విస్తరించి యూనికార్న్ క్లబ్‌లోకి చేరారు ప్రియాంక.
చిన్న వ్యాపారులకు అండగా...
ఎక్కడ కొత్త ఆలోచన కనిపించినా... అక్కడ ఆగి దాన్నుంచి సంపదని సృష్టించడం ఎలా అని ఆలోచిస్తారు రుచీకల్రా. అదే ఆమె వ్యాపార సూత్రం కూడా. మధ్యతరగతి దిల్లీ అమ్మాయి రుచి. ఐఐటీ దిల్లీ నుంచి కెమికల్ ఇంజినీరింగ్ చేశాక హైదరాబాద్ ఐఎస్బీలో బిజినెస్ పాఠాలు నేర్చుకున్నారు. మెకిన్సే బహుళజాతి సంస్థలో తొమ్మిదేళ్ల ఉద్యోగ అనుభవంతో ‘ఆఫ్ బిజినెస్’ సంస్థను ప్రారంభించారు. ‘ఐఐటీ చదువు కన్నా... ఐఎస్బీలో యంగ్ లీడర్‌గా వివిధ వర్గాల వ్యాపారులతో మాట్లాడిన అనుభవమే నా జీవితాన్ని మార్చేసింది. దేశానికి చిన్నవ్యాపారులే వెన్నెముక. వాళ్లకు అండగా ఉండటమే నా వ్యాపారం’ అంటారామె. చిన్న వ్యాపారులకు రుణాల్ని ఇవ్వడం, కావల్సిన ముడిసరుకుని చేరవేయడమే తన వ్యాపారం. ఏడులక్షల మందికిపైగా వ్యాపారులకు సేవలు అందిస్తోందీ సంస్థ.
ఇద్దరు కవలలు పుట్టాక వాళ్లను చూసుకుంటూనే రుచీ దీపక్ ‘ఎకో ఇన్సూరెన్స్’ కంపెనీని ప్రారంభించి యూనికార్న్ క్లబ్లో చేరారు. దిల్లీ లేడీశ్రీరామ్ కాలేజీలో చదువు, లండన్‌లోని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇన్వెస్టెమెంట్స్ సంస్థలో పని చేసిన అనుభవం ఆమెది. ‘ప్రజల ఇబ్బందులేంటో తెలుసుకుంటే అక్కడే వ్యాపారం ఉంటుంది. ఇన్సూరెన్స్ అందరికీ అవసరం. కానీ బీమా తీసుకోవడం మాత్రం ఓ పట్టాన అయ్యే పని కాదు. మనకి ఒక పాలసీ కావాలంటే మరొకరి సాయం లేకుండా, చర్చించకుండా తీసుకోలేం. నిజం చెప్పాలంటే ఇదో బోరింగ్ వ్యవహారం. ఈ చిక్కులని తీర్చేందుకే ఎకోని మొదలుపెట్టా. ఫోన్లోనే బీమాని పొందేలా దీనిని రూపొందించాం’ అంటారు రుచి. 7 లక్షల వినియోగదారులున్న ఈ సంస్థ రూ.400 కోట్లకు పైగా ఫండింగ్‌ని అందుకుని యూనికార్న్ క్లబ్‌లోకి చేరింది.
వాళ్లతో పోటీ పడ్డారు...
ఈ ఏడాది వ్యాపార దిగ్గజాలను కూడా ఆశ్చర్యానికి గురిచేసిన సంస్థ నైకా. ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలతో ఐపీవోలో లిస్ట్ అయిన ఈ సంస్థకు ప్రాణం పోసిన వ్యక్తి ఫల్గుణి నాయర్. కొటక్ మహీంద్రాలో 19 ఏళ్లు పనిచేసిన ఫల్గుణి... సెకండ్ ఇన్నింగ్స్ ఇది. టెక్నాలజీపై పట్టు లేకున్నా మహిళల అవసరాలని దృష్టిలో పెట్టుకుని ధైర్యంగా నైకా ఈకామర్స్ సంస్థని ప్రారంభించారు. తొమ్మిదేళ్లలోనే అతి సంపన్న మహిళల జాబితాలో చేరారు. 1300 కోట్ల సంపదని సృష్టించిన ఫల్గుణి వ్యాపారంలో రాణించాలంటే ‘పెద్దగా ఆలోచించండి... చిన్నగా మొదలుపెట్టండి’ అంటారు.
ఈ బాటలోనే తమ వ్యాపారాలని విస్తరిస్తున్నారు బైజూస్ దివ్యగోకుల్‌నాథ్, మొబైల్ వాలెట్ మొబీవిక్ని ప్రారంభించిన ఉపాసనా టాకులు. ‘మీరు అర్థం చేసుకోలేనిదంటూ ఏదీలేదు.. అర్థం చేసుకునేలా చెబితే’ అనే సూత్రంతో విద్యార్థులకు, వాళ్ల తల్లిదండ్రులకు చేరువయ్యారు దివ్యగోకుల్‌నాథ్. ప్రపంచంలో ఉత్తమ ఎడ్యుటెక్లలో ఒకటిగా చెప్పుకొనే బైజూస్‌ని నడుపుతూ 1800 కోట్ల రూపాయల సంపదని సొంతం చేసుకున్నారు దివ్య. డిజిటల్ లావాదేవీల చెల్లింపు సంస్థ మొబీవిక్. పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే వంటివాటితో పోటీపడి తన సంస్థని పరుగులు పెట్టించారు ఉపాసనా. స్టాన్‌ఫోర్డ్‌లో ఎమ్మెస్ చేశారీమె. జలంధర్ ఎన్ఐటీలో ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ చదివిన ఉపాసనా టాకు.. మార్కెటింగ్‌లో అపార అనుభవాన్ని సంపాదించారు. అమెరికా వంటి దేశాల్లోని డిజిటల్ చెల్లింపులు ఆమెని బాగా ఆకట్టుకున్నాయి. పేపాల్‌లో చేసిన అనుభవంతో మొబీవిక్ని ప్రారంభించారు. మొబైల్ ఛార్జింగ్ కోసం ప్రారంభించిన ఈ యాప్ క్రమంగా మొబైల్ వాలెట్‌గా మారింది. తన చుట్టూ ఉన్న సేఫ్జోన్ని చెరిపేసుకున్న తర్వాతే తనకీ విజయం లభించిందంటారామె. వీరే కాదు రజనీబెక్టార్, షీరోస్ని ప్రారంభించిన సైరీచాహల్ వంటి వారూ అసాధారణ విజయాలతో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.