
వసుంధర
పీసీఓడీ, థైరాయిడ్వంటి, ఒత్తిడి వంటి సమస్యలు మామూలు అమ్మాయిలకే కాదు ప్రముఖులకూ ఉండొచ్చుగా? అయితే వాటిని వాళ్లు జయించిన తీరు స్ఫూర్తి నింపేదిగా ఉంటే! అందాల అవికా గోర్ ఆ మధ్య పీసీఓడీతో బాధపడుతూ బాగా బరువుపెరిగింది. దాన్నుంచి బయటపడి బరువుని ఎలా తగ్గించుకుందో చెప్పింది. సమీరారెడ్డి, మాసాబాగుప్తా, ఇలియానా వంటి వారూ... బరువు తగ్గాలనుకునే వారికి స్ఫూర్తిగా నిలుస్తారు...
వడాపావ్‌ని వదిలేశా! : అద్దంలో నన్ను నేను చూసుకుంటే గుండెపగిలినంత పనైంది. లావెక్కిన కాళ్లు, చేతులు. పెరిగిన పొట్ట. నాకు పీసీఓడీ, థైరాయిడ్ సమస్యలున్నాయి. పనిలో పడి నా శరీరాన్ని పట్టించుకోవడం మానేశాను. వర్కవుట్ల జోలికే వెళ్లేదాన్ని కాదు. పెరిగిన బరువుతో త్వరగా అలసిపోయేదాన్ని. నాకిష్టమైన డ్యాన్స్ చేయాలన్నా ఇబ్బందిగా ఉండేది. అలా నా ఆత్మవిశ్వాసం తగ్గుతూ వచ్చింది. అయ్యిందేదో అయ్యింది. ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచించా. మంచి ఆహారం, వర్కవుట్ల మీద దృష్టిపెట్టాను. నా బరువుకి జంక్‌ఫుడ్... ప్రతికూల ఆలోచనలే కారణం అని తెలుసు. అందుకే ఆ చిరుతిళ్లను, ప్రతికూల ఆలోచనలు వదిలించుకుని, నన్ను నేను ప్రోత్సహించుకుంటూ మంచి ఆహారం, ఆలోచనలపై దృష్టిపెట్టాను. ఆ ఆలోచనలే నేను 13 కిలోలు బరువు తగ్గడానికి కారణం అయ్యాయి
- అవికాగోర్
గ్రీన్ వ్యాయామాలతో: మన శరీరం ఎలా ఉన్నా దాన్ని ప్రేమించాలి. అప్పుడే అది మన మాట వింటుంది. నేను మధ్యలో బరువు పెరిగినా... తగ్గించుకోవడానికి నేను పాటించిన చిట్కా ఇదే. ఆరుబయట చేసే నడక, పరుగు వంటి గ్రీన్ ఎక్సర్సైజులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి ఒత్తిడి, కోపం, ఆందోళన వంటి వాటిని తగ్గించి బరువుని అదుపులో ఉంచుతాయి. ఇక ఆహారం అంటారా? రోజంతా తింటాను. కానీ కొంచెం కొంచెంగానే.
- ఇలియానా
మంచిఆలోచనే మందు: వ్యతిరేక ఆలోచనలని దూరం పెట్టి, మిమ్మల్ని మీరు ప్రేమించడం మొదలుపెట్టండి. మీ బరువుని అదుపులో ఉంచుకోవడం తేలిక అవుతుంది. నేను 92 కేజీల బరువు ఉండేదాన్ని. ఎవరైనా నన్ను ఫొటో తీస్తున్నారంటే ఇబ్బందిగా ఉండేది. మేకప్ లేకుండా ఫొటోకి ఒప్పుకొనే దాన్ని కాదు. సానుకూల ఆలోచనలు చేయడంతో పాటు పంచదారని తగ్గించాను, యోగాకి సమయం కేటాయించే దాన్ని... బ్యాడ్మింటన్ ఆడేదాన్ని. బాక్సింగ్ చేసేదాన్ని. ఇవే బరువుని బాగా నియంత్రించాయి.
- సమీరారెడ్డి
సూర్య నమస్కారాలతో: ఇష్టమైన జీన్స్ ప్యాంటు బిగుతుగా అయిపోయాకే మన అధికబరువు గురించి తెలుస్తుంది. ఇంటికి వెళ్తూ వెళ్తూ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ దగ్గర ఆగి పిజాలు, గార్నియర్చీజ్ని తీసుకెళ్లేదాన్ని. ఇదిగో ఈ అలవాటే నా బరువుని పెంచేసింది. పీసీఓడీ సమస్య ఎదురైంది. దాన్ని తగ్గించుకోవడానికి మందులని మాత్రమే కాకుండా వ్యాయామాలనీ నమ్ముకున్నా. వారంలో ఐదురోజులు వర్కవుట్లు తప్పని సరి. అమ్మ నీనాగుప్తాతో కలిసి వాకింగ్ మొదలుపెట్టాను. బ్రిస్క్వాక్ని నా జీవితంలో భాగం చేసుకున్నాను. రోజుకి 30 సూర్యనమస్కారాలు తప్పని సరిగా చేసేదాన్ని. నాకు ఆస్తమా కూడా ఉండటంతో... ప్రాణాయామంపైనా దృష్టి పెట్టాను. మీరు కూడా బరువు తగ్గాలనుకుంటే ఇంటికో, ఆఫీసుకో జిమ్ దగ్గరగా ఉండేటట్టు చూసుకోండి. నేను ఆ చిట్కానే పాటించి పది కేజీల బరువు తగ్గాను.
- మాసాబా గుప్తా, ఫ్యాషన్ డిజైనర్.