
వసుంధర
వ్యాపారసూత్రాల గురించి వాళ్లకేమీ పెద్దగా తెలియదు.. కానీ సబ్బుల తయారీ మొదలుపెట్టిన ఏడాదికే అరవైలక్షల రూపాయల వ్యాపారం చేసి శభాష్ అనిపించుకున్నారు. కొవిడ్ వంటి సవాళ్లు ఎదురైనా వెనుతిరగలేదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన గిరిజన మహిళల విజయం ఇది..
చదివింది అంతంత మాత్రమే. దాంతో కూలి పనులకీ పరిమితం అయ్యారు ఏటూరు నాగారంలోని గిరిజన మహిళలు. కానీ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ క్రిస్టినా ఆలోచన వాళ్ల జీవితాలని మలుపుతిప్పింది. ఈ మహిళలతో డిటర్జంట్ సబ్బుల తయారు చేయిస్తే బాగుంటుందని ఆవిడ ఆలోచించారు. చాలామంది మహిళలు ఇది అయ్యే పని కాదులే అని నిరాశ పడినా.. శివాపురం గ్రామానికి చెందిన 18 మంది ముందుకు వచ్చారు. వీళ్లందరికీ ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సహకార సంస్థ (జీసీసీ) హైదరాబాద్‌లోని జీడిమెట్లలో ఆర్నెల్లు శిక్షణ ఇప్పించింది. తర్వాత బ్యాంకు రుణంతో సబ్బుల తయారీ యూనిట్‌ని పెట్టమని సలహా ఇచ్చింది. శిక్షణ తీసుకున్నారు కానీ... రుణం దొరకలేదు. చేసేదిలేక ఐటీడీఏ అధికారుల దగ్గరకే వెళ్లి విషయం చెప్పారు. వాళ్ల పట్టుదలని గమనించిన జీసీసీ రూ. 28 లక్షల వరకు ఆర్థిక సాయం అందించింది. దాంతో 2019లో శివాపురంలోనే యూనిట్‌ని ప్రారంభించారు. శిక్షణ తీసుకున్న వాళ్లలో కొంతమంది వెనక్కి తగ్గారు. కారణం... భాగస్వామ్యం కింద కొంత సొమ్ము చెల్లించాల్సి రావడమే. ఓ తొమ్మిదిమంది మాత్రం ధైర్యం చేసి ‘శ్రీసమ్మక్క సారలమ్మ జేఎల్‌జీ గ్రూపు’ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ గ్రూపు అధ్యక్షురాలు ధనసరి సౌజన్య, కోరం లక్ష్మి కార్యదర్శి. అందరిలో వీళ్లే కాస్త చదువుకున్న వాళ్లు. పూనెం రమ, పూనెం రాములమ్మ, పూనెం సీత, చింత జ్యోతి, సిద్ధబోయిన శరత్, ధనసరి నర్సయ్యలు గ్రూపు సభ్యులు. వీళ్లంతా 2019 డిసెంబర్ నుంచీ ‘గిరి’ పేరుతో సబ్బుల తయారీ మొదలు పెట్టారు. రోజుకి పదివేల సబ్బులు చేసేవారు. అలా మొదటి దశలోనే 2.79 లక్షల సబ్బులను గిరిజన ఆశ్రమ పాఠశాలలకు సరఫరా చేశారు. ఒక్కో సబ్బు రూ. 9. మొదటి దఫాలోనే రూ. 25 లక్షలు సంపాదించి, దాంతో జీసీసీ రుణాన్ని తీర్చేశారు. అలాగే ప్రభుత్వం రాయితీని కూడా ఇవ్వడంతో ఆ సొమ్ముతో ముడి సరుకు కొనుక్కున్నారు.
ఒడుదొడుకులు అధిగమించి... ‘అంతా బాగుందనుకున్న సమయానికి కొవిడ్‌తో హాస్టళ్లు, పాఠశాలలు మూత పడ్డాయి. ఆర్డర్లు లేవు. తిరిగి కూలి పనులకు వెళ్లాం. అయినా మనుపటి ఉత్సాహంతో లాక్డౌన్ తర్వాత సెప్టెంబర్‌లో మళ్లీ యూనిట్‌ను ప్రారంభించాం. ఈ మూడు నెలల్లో మరో 4 లక్షల సబ్బులను తయారు చేసి పాఠశాలలకు సరఫరా చేశాం. అలా ఏడాదిలోనే రూ. 60 లక్షల వ్యాపారం జరిగింది. బయట మార్కెట్లో ఈ సబ్బులకు డిమాండ్ పెరగడంతో ప్యాకింగ్‌లో మార్పులు చేసి... ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలనుకుంటున్నాం. ఉదయం 10 నుంచి మొదలుపెట్టి సాయంత్రం 5 వరకు సుమారుగా 10వేల సబ్బులని తయారు చేస్తాం. గిరాకీ పెరుగుతుండటంతో సర్ఫ్, గిన్నెలు తోముకునే సబ్బులు కూడా చేయబోతున్నాం. ఈ పరిశ్రమను ఏర్పాటు చేయడం, విజయవంతంగా నడపడంతో చాలా ధైర్యం వచ్చింది. మా జీవితాల్లో మార్పులు వస్తున్నాయి’ అని సంతోషంగా చెబుతోంది బృంద అధ్యక్షురాలు ధనసరి సౌజన్య.
- సోగాల స్వామి, జయశంకర్ భూపాలపల్లి