
వసుంధర
‘ఆడవాళ్లకేం తెలుసు డబ్బు గురించి?’... పదేళ్ల క్రితం వరకూ తరచూ వినిపించిన మాటే ఇది. ఉన్నత చదువులు, అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం ఈ పరిస్థితిలో మార్పుతెస్తున్నాయి. దానికి నిదర్శనంగానా అన్నట్టు... ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఆర్థిక రంగంలో అద్భుతాలు చేస్తూ లక్షల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ‘ఫిన్‌టెక్’ వ్యాపార దిగ్గజాల్లో కొందరి ప్రస్థానం చూడండి...!
మనకు కంటినిండా కలలుంటాయి. గుండె నిండా ఆత్మవిశ్వాసం ఉంటుంది. కానీ ఏం లాభం? ఆత్మవిశ్వాసాన్నీ, కలల్నీ నమ్మి ఎవరూ పెట్టుబడి పెట్టరుగా! చిన్న వ్యాపారులకు ఇదే అతిపెద్ద సమస్య అంటారు హార్దికాషా. వారికి అండగా ఉండేందుకు ఆమె ప్రారంభించిన ‘కినారా క్యాపిటల్’ యాప్ 2.5 లక్షల మందికి ఉపాధి చూపింది. అందుకు వారికి అందిన రుణాల మొత్తం రూ.700 కోట్లు. మధ్యతరగతి గుజరాతీ అమ్మాయి హార్దిక.. ఈ ప్రయత్నం చేయడానికి కారణం ఆమె తల్లే. చిన్న వ్యాపారం ప్రారంభించాలని తల్లి చేసిన ప్రయత్నాలు 17 ఏళ్ల హార్దిక మనసులో నాటుకు పోయాయి. కొలంబియా బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చదివి, కొన్నాళ్లు స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని సామాజిక వ్యాపార నిర్వహణ బాధ్యతలు తీసుకుంది హార్దిక. తన తల్లిలానే చాలామంది పెట్టుబడి కోసం ఇబ్బంది పడటాన్ని చూసింది. అవే ఆమె బెంగళూరు వచ్చి సంస్థ పెట్టడానికి కారణం అయ్యాయి. ఏఐ, మెషీన్ లెర్నింగ్ ఆధారంగా పనిచేసే ఈ యాప్ చిన్న వ్యాపారులకు అతిసులభంగా, ఒక్కరోజులోనే రుణం అందేలా చేస్తుంది. ముఖ్యంగా మహిళలకు ‘హెర్ వికాస్’ పేరుతో రాయితీతో రుణాలను వేగంగా అందజేస్తుంది. ప్రత్యేకంగా మహిళలకే రూ.75 కోట్ల రుణాలు ఇచ్చి స్వయం ఉపాధి బాట పట్టించింది హార్దిక. ప్రస్తుతం ఆరు రాష్ట్రాల్లో 110 శాఖలుగా విస్తరించిందీ సంస్థ.
చిరువ్యాపారులకు అప్పు...
సంపన్నులు, మధ్యతరగతి వాళ్లని నమ్మి ఎవరైనా రుణాలిస్తారు. కానీ కూలీలు, రోడ్లపై చిరువ్యాపారులని నమ్మి ఎవరైనా రుణాలిస్తారా? ‘కెలడియోఫిన్’ సాయంతో సుచిత్రాముఖర్జీ ఆ పని చేస్తున్నారు. ఐఐఎమ్ అహ్మదాబాద్‌లో ఎంబీఏ, దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్‌లో డిగ్రీ చేశారు సుచిత్ర. లండన్‌లో మోర్గాన్స్టాన్లేలో ఉద్యోగ అనుభవం ఉందామెకు. ‘వ్యవసాయ కూలీలకు, భవన నిర్మాణ కార్మికులకు త్వరగా రుణాలు లభించవు. కారణం వాళ్లకు ఒక పద్ధతిలో ఆదాయం రాదు. ఇలాంటి వాళ్లకోసమే కెలడియోఫిన్ ఏర్పాటు చేశా. మా వినియోగదారుల్లో ఎక్కువ మంది మహిళలే. మిషన్ కుట్టే వాళ్లు, కాయగూరలు అమ్మే వాళ్లు, కూలీలు, టిఫిన్ బళ్ల వాళ్లకు సులభ రుణాలని అందిస్తున్నాం. ఇంతవరకూ 14 రాష్ట్రాల్లో వందకోట్లకు పైగా రుణాలిచ్చాం. మా వినియోగదారులను పొదుపు మార్గాలవైపు నడిపిస్తాం. బీమా గురించిన అవగాహన కలిగిస్తాం. ఉదాహరణకి చిరువ్యాపారుల దగ్గర రూపే కార్డులు ఉంటాయి. వాటిపై లక్ష రూపాయల బీమా సదుపాయం ఉంటుంది. ఇలా అన్నీ నేర్పించి వారు ప్రగతిబాట పట్టేలా చేస్తాం అంటున్నారు సుచిత్ర.
నేటి తరానికి ఆర్థిక సూత్రాలు
మనదేశంలో మిలేనియల్స్ సంఖ్య చాలా ఎక్కువ. కుటుంబానికి ఆధారంగా ఉండేదీ వాళ్లే. కానీ వీళ్లలో 20 శాతం మందికి కూడా ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన లేదు. అలాంటి వారికి పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సూత్రాలని సులభంగా నేర్పాలనే లక్ష్యంతో ఇండియా- హాంకాంగ్ వేదికగా ‘ఇన్‌వెస్టోఏసియా’ సంస్థని స్థాపించారు స్మృతితోమర్... భారత్ నుంచి నాస్కామ్ గుర్తించిన మూడు అత్యుత్తమ సంస్థల్లో ఇదీ ఒకటి. ఎన్ఐటీ భోపాల్ నుంచి బీటెక్ చేసిన స్మృతి చదువయ్యాక లాటిన్ అమెరికాలోనే అతిపెద్దదైన సిటీబ్యాంక్ బెనామెక్స్‌లో పనిచేశారు. బ్లాక్ చెయిన్ సాంకేతికతలో నైపుణ్యం సాధించారు. ఇండియా, హాంకాంగ్ వేదికగా ఉండే ‘ఇన్‌వెస్టోఏసియా’ సంస్థ ద్వారా విదేశీయులు మన మార్కెట్లలో సులభంగా పెట్టుబడులు పెట్టొచ్చు. మనమూ చైనా, కొరియా, జపాన్ వంటి దేశాల్లో ఏ చిక్కులూ లేకుండా పెట్టుబడులు పెట్టొచ్చు. ‘నాకు వారెన్ బఫెట్ డబ్బు పాఠాలంటే ఇష్టం. నేటి తరానికి అవి మాత్రమే సరిపోవనిపించింది. అవేంటో చెప్పడానికే ఈ ఇన్వెస్టోఏసియాని ప్రారంభించా.’ అంటారు స్మృతి.