
వసుంధర
అన్నీ ఉన్నా ఇంకా ఏదో చేయలేదన్న వెలితి కొందరి జీవితాల్ని వెంటాడుతూ ఉంటుంది.. తోటివారికి సేవ చేయడంతోనే ఆ వెలితికి దూరమవ్వాలనుకున్నారు హైదరాబాద్‌కు చెందిన సుధాకేశవరాజు. నిమ్స్ ఆసుపత్రిలో క్యాన్సర్ బాధిత చిన్నారులకు అండగా ఉండేందుకు ‘సంతృప్తి ఫౌండేషన్’ని స్థాపించిన ఆమె సేవా ప్రస్థానమిది..
నేను పుట్టిపెరిగింది ఒడిశాలో. నాన్న కృష్ణానంద, అమ్మ సూర్యమణి. అమ్మమ్మ వాళ్లది కాకినాడ. ఇంట్లో అందరూ తెలుగు మాట్లాడుతుంటే నాకూ వచ్చింది. మావారు చంద్రశేఖర్ యురోపియన్ సంస్థకి ఫైనాన్స్ గ్లోబల్ హెడ్. నాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి స్నిగ్ధ్ద దిల్లీలో ఇంజినీరింగ్ చదువుతోంది. చిన్నమ్మాయి సమీర ఇంటర్ చదువుతోంది. నేను వేరే ఊళ్లకు వెళ్లాల్సి వస్తే.. చిన్న పాప, మావారు ఆసుపత్రికి వెళ్లి పిల్లలకు ఆహారం అందిస్తారు.
ఓ రోజు మా ఫ్రెండ్ కూతురు నిమ్స్ ఆసుపత్రిలో క్యాన్సర్ చికిత్స తీసుకుంటోందని తెలిసి అక్కడకు వెళ్లాను. వెంట పండ్లు, తనకి నచ్చిన వంటలు కూడా తీసుకెళ్లా. తనతోపాటు ఆ వార్డులో ఇంకా చాలా మంది క్యాన్సర్ బాధిత పిల్లలున్నారు. వాళ్లందరూ వేర్వేరు జిల్లాల నుంచి వచ్చిన వాళ్లని తెలిసింది. బయట నుంచి ఆహారం కొనుక్కు తెచ్చుకుంటున్నారు. చూస్తే ఆ వంటలు ఏం బాగాలేవు. అలాంటివి తింటే వాళ్లు త్వరగా ఎలా కోలుకుంటారు? అలాగని ఎక్కువ ఖర్చూ చేయలేని పరిస్థితి వాళ్లది. ఆ రోజు ఇంటికి వెళ్లినా.. వాళ్ల గురించే ఆలోచన. నా వంతు సాయం చేయాలని అనుకున్నా. వారమయ్యాక ఓ రోజు ఉదయాన్నే 15మందికి భోజనం సిద్ధం చేసుకున్నా. కారులో నేనే స్వయంగా తీసుకెళ్లి, వడ్డించాను. ఆ రోజు ఆ చిన్నారుల సంతోషాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. అప్పట్నుంచీ అంటే 2017 నుంచీ ప్రతి రోజూ ఉదయం లేవగానే ఆహారం సిద్ధం చేయడం, వాళ్లకు వడ్డించడం నా దినచర్యలో భాగమైంది. ప్రస్తుతం రోజుకు 100 మంది చిన్నారులకు భోజనం అందిస్తున్నాం.
ఊపిరున్నంత వరకూ..
మేం స్వయంగా వండిన ఆహారం మాత్రమే చిన్నారులకు పెట్టాలన్నది నా లక్ష్యం. అలా చేస్తేనే కదా వాళ్లు త్వరగా కోలుకుంటారు. వంట చేసి పెట్టడంతో నా పని అయిపోయింది అనుకోవడం లేదు. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి వాళ్లు డిశ్చార్జి అయ్యేవరకు వాళ్ల బాగోగులు చూసుకుంటాను. దీనికి నా కుటుంబ సభ్యులూ పూర్తి సహకారం అందిస్తున్నారు. ఏవైనా పనుల వల్ల బయట ఊరు వెళ్తే.. మావారు, పాప నా బాధ్యతల్ని తీసుకుంటారు. నాకు ఒడిశాలో ఓ కార్పొరేట్ సంస్థ ఉంది. నగరంలో ఓ పాఠశాలలో కొంత వాటా కూడా ఉంది. వాటి నుంచి వచ్చిన నగదుతోనే సేవా కార్యక్రమాలు చేస్తున్నా. నా ఊపిరున్నంత వరకూ నిమ్స్‌లో నా సేవలు కొనసాగుతాయి.
కన్నీళ్లు ఆగలేదు..
మహారాష్ట్ర షిరిడీకి చెందిన తేజస్ పాటిల్‌కు 16ఏళ్లు. ఇక్కడ తొమ్మిది నెలల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. అయినా లాభం లేదు. కొవిడ్ సమయంలో అతన్ని సొంతూరు పంపడం చాలా కష్టమైంది. వాళ్ల నాన్నకి డ్రైవింగ్ తెలుసని చెప్పడంతో నా కారు, డీజిల్ ఖర్చులు ఇచ్చి ఇంటికి పంపాను. కానీ వెళ్లిన వారం రోజులకే ఆ అబ్బాయి చనిపోవడం బాధనిపించింది. కర్నూల్ జిల్లా రాయపురానికి చెందిన మరో అబ్బాయి హరీశ్. నాలుగేళ్లు. భలే అందంగా ఉండేవాడు. బ్లడ్ క్యాన్సర్‌తో ఆసుపత్రిలో చేరాడు. నాకు బాగా దగ్గరయ్యాడు. వాడికి చేపలంటే ఇష్టం. రోజూ ఉదయాన్నే ఫోన్ చేసి.. ఫిష్ తీసుకురా ఆంటీ అనేవాడ[ు. ఏది కావాలన్నా నాకే చెప్పేవాడు. వాడితో ఎంత అనుబంధం పెరిగిందంటే, ఒక దశలో దత్తత తీసుకోవాలని అనుకున్నా. కానీ తను చనిపోయాడు. వాళ్ల ఊరెళ్లి అంత్యక్రియలు చేసినప్పుడు కన్నీళ్లు ఆగలేదు.
స్నేహితుల సహకారంతో...
ఈ యజ్ఞంలో మంచి మనసున్న స్నేహితులూ నాకు తోడుగా నిలిచారు. అనురాధ కలిదిండి చిన్నారులకోసం ప్రతి గురువారం నాన్‌వెజ్ భోజనం వండిపెడతారు. ఓ వారం చికెన్, ఓ వారం మటన్, బిర్యాని ఇలా వంటలను చేసి పంపిస్తారు. అనీల్ అంబాటి 2017 నుంచి ఇప్పటి వరకూ ప్రతి నెలా డబ్బుని పంపిస్తున్నారు. రాజమండ్రికి చెందిన పల్లవి కొంతమందికి మందులను అందిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో సాయం కావాలని పోస్టు చేస్తే జి.సుబ్బారావు స్పందించి వెంటనే సాయం చేస్తారు. ఇలా మరో 12 మంది ప్రతి నెలా తలో వెయ్యి రూపాయలు జమ చేస్తున్నారు. వైద్యం, మందుల కోసం ఈ నగదును ఖర్చుపెడుతున్నాం.
- తలారి నరేందర్, హైదరాబాద్