
వసుంధర
అత్తమామలు కరవు సీమ తలరాత మార్చారు. ఆమె వారి వారసత్వాన్ని అందుకుంది. ‘సమయం కన్నా రెట్టింపు పని చేయాలి. సాయం కోరి వచ్చినవారిని తిప్పి పంపొద్దు..’ అన్న వాళ్ల మాటల్నే వేదవాక్కులా పాటిస్తోంది. వారి బాటలో పయనిస్తూనే సేవా పరిధిని విస్తరిస్తూ వెళుతోంది. కొవిడ్ సమయంలోనూ నాయకురాలిగా ధైర్యంగా ముందుకు సాగుతూ మరెందరినో నడిపిస్తోంది. అనంతపురానికి చెందిన విశాల ఫెర్రర్.. సేవా ప్రయాణమిది!
అనంతపురంలో విన్సెంట్ ఫెర్రర్, అన్నే ఫెర్రర్ అంటే తెలియని వారుండరు. 50 ఏళ్ల కిందట స్పెయిన్ నుంచి వచ్చి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)ను ప్రారంభించారీ దంపతులు. వ్యవసాయాభివృద్ధి, నీటి నిల్వలు పెంచడం వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. కరవుసీమగా పేరొందిన ఆ జిల్లా తలరాతనే మార్చేశారు. వీళ్ల కోడలే విశాల ఫెర్రర్. అత్తమామల వారసత్వాన్ని అందుకోవడమే కాక విద్య, వైద్యం, గృహనిర్మాణం, క్రీడలు, మహిళా సాధికారత, తదితర విభాగాలకూ సేవలకు విస్తరించారు. 2019.. ఆకస్మిక లాక్డౌన్. పెరుగుతున్న కేసులు. ప్రజల్లో ప్రాణభయం. జిల్లా కలెక్టర్ స్వయంగా సంస్థ సాయం కోరారు. ఆ తరుణంలో ఆమె వేసిన అడుగు అందరిలో స్థైర్యాన్ని నింపింది.
69 ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి అనంత నగరంలో రెడ్ జోన్లలోని వారికి, శివారు కాలనీల్లోని నిరుపేదలకు ఆహారం సమకూర్చారు. రోజూ పదివేల మందికి భోజనం అందించారు. ఇందుకోసం ఆర్డీటీ సిబ్బందితోపాటు కుటుంబ సభ్యుల్నీ భాగస్వామ్యుల్ని చేశారు. వేకువజాము నుంచి కూరగాయలు తరగడం, ప్యాకింగ్ అన్నింట్లో పాలుపంచుకున్నారు. అలా 5 లక్షల మందికిపైగా ఆకలి తీర్చారు. ఆర్డీటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బత్తలపల్లి ఆసుపత్రిని కొవిడ్ చికిత్సా కేంద్రంగా మార్చారు. దాదాపుగా పదివేలమంది ఇక్కడ చికిత్స పొందారు. వారందరికీ పౌష్టికాహారం అందించారు. ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి అండగా నిలిచారు. ఈమె సేవను చూసి ఎంతోమంది దాతలు, రైతులు ముందుకొచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి బతుకు దెరువు కోసం వచ్చినవారు, మార్గమధ్యంలో చిక్కుకుపోయిన 5వేలకు పైగా మందిని వారి స్వగ్రామాలకు చేరేలా చూశారు. దాదాపు 70 లక్షల మాస్కులు కుట్టించి ప్రజలకు ఉచితంగా అందించారు. తద్వారా కొందరికి ఉపాధి కల్పించారు. కరోనాకు భయపడి ప్రైవేటు ఆసుపత్రులూ మూతబడ్డాయి. ప్రభుత్వ వైద్యశాలల్లో కొవిడ్ మినహా ఇతరుల్ని చేర్చుకోలేని పరిస్థితి. ఆ తరుణంలో ‘అమ్మ’లకు కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆసుపత్రిలో చికిత్సలు అందేలా చూశారు. వీరి ఆధ్వర్యంలో విద్యాలయాల విద్యార్థుల చదువుకు ఆటంకం కలగొద్దని ట్యాబ్స్ అందించి, ఆన్లైన్ తరగతులు నిర్వహించారు. కొవిడ్ కారణంగా మృతి చెందిన మూడొందలకు పైగా కుటుంబాలను ఆదుకున్నారు.
సమయానికి ప్రాణవాయువు అందక చనిపోతున్న వారిని చూసి విశాల ఫెర్రర్ మనసును కలచివేసింది. వారికి సాయమందించడానికి ‘స్పందించు.. ఆక్సిజన్ అందించు’ అని పిలుపునిచ్చారు. దానికి స్పందించి విద్యార్థులు, ఎన్జీఓలు, ఇతర సంఘాలు కదిలొచ్చి ఆర్థిక సాయం చేశాయి. సుమారు రూ.4 కోట్లు పోగయ్యాయి. వాటితో ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు సిద్ధం చేశారు. పరిస్థితి ఏదైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండటం ఆమె నైజం. కొవిడ్ తగ్గిందని అందరూ ఊపిరి పీల్చుకున్నా.. గ్రామాల్లో జాగ్రత్తలపై చైతన్యం నింపుతూనే ఉన్నారు. ‘పేదలకు గూడు, విద్య, వైద్యం లక్ష్యంగా ఆర్డీటీ పనిచేస్తోంది. నేను దానికి కొన్ని జత చేస్తున్నా. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలనే ఉద్దేశంతో నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నాం. విద్యార్థి దశనుంచే సేవపై ఆసక్తి. వలంటీర్‌గా సేవలందించేదాన్ని. ఇంత పెద్ద సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించడం, వాటిని విస్తృతం చేయడం చాలా ఆనందంగా ఉంది. చేసే ప్రతి పని పాలక వర్గంతో చర్చించి, ఆమోదం పొందాకే చేపడతాం. ప్రతి పనిలోనూ అత్త, మావారు మాంచో ఫెర్రర్ సలహాలు, సూచనలు ఇస్తారు. వాళ్ల ప్రోత్సాహం, సూచనలతోనే ముందుకు సాగుతున్నా’ అంటున్నారు విశాల.
- సూగూరు రవీందర్రావు, అనంతపురం