
వసుంధర
‘అమ్మాయిలంటే ఇలానే ఉండాలి..’ తరాలుగా సమాజంలో పాతుకుపోయిన ఈ సంప్రదాయ భావనలకి చెక్ పెట్టాలనుకున్నారు వీళ్లు. ఇందుకోసం అబ్బాయిలకు మాత్రమే పరిమితం అనుకున్న బైక్ రేసింగ్‌లో అడుగుపెట్టారు. ఖండాలు, దేశాలు చుట్టేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లలపై చిన్నచూపుని తమదైన శైలిలో దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు...
ప్రధాని మెచ్చిన రేసర్...
సూరత్‌లో 30 మంది సభ్యులున్న పెద్ద ఉమ్మడి కుటుంబంలో పుట్టింది డాక్టర్ సారికామెహతా. ఆడపిల్లకు చదువు అవసరం లేదు అని బలంగా నమ్మే కుటుంబంలో పెరిగిన ఆమె తల్లి సాయంతో బిహేవియరల్ సైన్స్‌లో పీహెచ్డీ చేయగలిగారు. పెళ్లై ఇద్దరు పిల్లలు పుట్టాక భర్త జిజ్ఞేష్ మెహతా సాయంతో బైక్ నడపడం నేర్చుకుని రేసింగ్‌లపై దృష్టి పెట్టారు. రహదారి భద్రతపై అవగాహన తీసుకొచ్చేందుకు జర్మనీ, ఆస్ట్రియా, ఫ్రాన్స్ సహా 21 దేశాలని ఒంటరిగా బైక్‌పై పర్యటించారు. కిలిమంజారో వంటి పర్వతాలనీ అధిరోహించారు. ఇవన్నీ కష్టమైన వ్యవహారాలు కాదు అంటూ ఆడపిల్లల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు 50 మంది స్త్రీలకు బైకింగ్‌లో శిక్షణ ఇచ్చి ‘బైకింగ్ క్వీన్ ఛారిటబుల్ ట్రస్ట్’ని ఏర్పాటు చేశారు. ఈ బృందంతో కలిసి పదిదేశాలు, మనదేశంలోని ఆరువేల గ్రామాలు పర్యటించారు. ఆడపిల్లల చదువు, భ్రూణహత్యలు, ఆరోగ్యం-శుభ్రత వంటివాటిపై అవగాహన తీసుకొస్తూ బైక్ ర్యాలీలు నిర్వహించారు. ఆమె కృషిని గుర్తించిన డబ్ల్యూహెచ్‌వో, ఐరాస ఆమెను ప్రశంసించాయి. ‘బేటీబచావో... బేటీపడావో’, ‘స్వచ్ఛభారత్’ వంటి ప్రభుత్వ పథకాలు దేశంలోని మారుమూల గ్రామాలకు చేరవేసినందుకు మోదీ బైకింగ్ క్వీన్స్ బృందాన్ని తన ఇంటికి ఆహ్వానించి ప్రశంసించారు.
వేగవంతమైన మహిళగా...
వారంలో ఆరురోజులు డాక్టర్‌గా విధులు. వారాంతంలో మాత్రం ఆ వృత్తికి పూర్తిగా భిన్నమైన సూపర్బైకర్ అవతారం. ‘అరె అమ్మాయిలు అంత వేగాన్ని నియంత్రించగలరా?’ అనేవారు నోరెళ్లబెట్టాలాంటి వేగం డాక్టర్ నిహారికాయాదవ్ది. జేకేటైర్స్ సూపర్టైర్ ఛాంపియన్‌షిప్‌లో 34 మంది సూపర్బైకర్స్ పాల్గొంటే అందులో ఉన్న ఒకే ఒక అమ్మాయి డాక్టర్ నిహారికా. ఇలా వరుసగా మూడేళ్లపాటు సూపర్బైకర్స్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంది. హెల్మెట్ తీసి తన పొడవాటి శిరోజాలని విదిలించేంతవరకూ అందులో ఉన్నది ఒక అమ్మాయి అంటే నమ్మలేని పరిస్థితి ఆ రేస్ చూడ్డానికి వచ్చిన ప్రేక్షకులది. నిహారికా కోరుకునేది కూడా అదే. 1000 సీసీ సామర్థ్యం ఉన్న బండిని అవలీలగా నడుపుతూ ఒక అమ్మాయి మగవాళ్లతో సమానంగా సూపర్బైకర్లా ఉండగలదు అని నిరూపించింది. అందుకే నిహారికా ఫాస్టెస్ట్ లేడీ సూపర్బైకర్గా పేరుతెచ్చుకుంది. ‘మా అమ్మ కార్‌రేసర్. నాన్న ఆర్మీలో యుద్ధవిమానాలు నడిపేవారు. వారిచ్చిన ధైర్యంతోనే ఈ అభిరుచిని పెంచుకున్నా’ అనే నిహారికా టెడ్ఎక్స్లో స్ఫూర్తిదాయక ప్రసంగాలూ ఇస్తోంది.
అజిత్‌కు సలహాలు ఇచ్చి...
మొన్నామధ్య తమిళనటుడు అజిత్ బైక్‌పై కొన్ని దేశాలు పర్యటించాలనుకున్నాడు. అందుకోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసునేందుకు ప్రముఖ మహిళా బైకర్ మరల్‌యజర్‌లూని సంప్రదించాడు. బైక్‌లు అబ్బాయిలు మాత్రమే నడపగలరు అనే సంప్రదాయ భావనల నుంచి అమ్మాయిలూ దూసుకుపోతున్నారు అని చెప్పడానికి ఈ ఉదాహరణ సరిపోతుంది కదా! సూపర్‌బైక్స్ నడపడంలో మరల్ సామర్థ్యం తక్కువేం కాదు. ఏడు ఖండాలు... 64 దేశాల్లో 64000 కి.మీల దూరాన్ని ఒంటరిగా చుట్టేసిందామె. నిజానికి మరల్ భారతీయురాలు కాదు. ఇరానీ అమ్మాయి. ఇరవై ఏళ్ల క్రితం చదువుకోవడానికి వచ్చి ఇక్కడే స్థిరపడింది. మార్కెటింగ్‌లో పీహెచ్డీ చేసిన మరల్... ఇక్కడే మా-యా పేరుతో ఒక ఫ్యాషన్ బ్రాండ్‌ని స్థాపించి బైకింగ్, రేసింగ్‌లపై ఆసక్తిని పెంచుకుంది. తానుపుట్టిన ఇరాన్లో అమ్మాయిలు బైక్‌లు నడపడం నిషిద్ధం. ఆ దేశంలో అమ్మాయిలకు బైక్‌లు నడిపే అవకాశం కలిగించాలని ఆ దేశ ప్రధానిని కోరడంతో పాటు ‘రైడ్టుబివన్’ పేరుతో వివిధ దేశాలు పర్యటిస్తూ మరల్ ఆడపిల్లల హక్కులపై అవగాహన తీసుకొస్తోంది. ‘ఎన్నో దేశాలు తిరిగేదాన్ని. కానీ రాత్రిళ్లు మాత్రం ఎక్కడ బస ఉండాలనేది ఎప్పుడూ సవాలే. రాత్రిళ్లు ఒంటరిగా టెంట్ వేసుకుని విశ్రాంతి తీసుకొనేదాన్ని. ఇన్నిదేశాల్లో ఒక్క ప్రమాదం కూడా ఎదురుకాలేదు. నా పర్యటన మనుషులపట్ల నమ్మకాన్ని పెంచింది’ అనే మరల్ డూకాటీ, బీఎమ్‌డబ్ల్యూ, హ్యార్లీ బండ్లని అవలీలగా నడిపేస్తుంది.