ఈనాడు ప్రత్యేకం

Facebook Share Twitter Share Comments Telegram Share
Neuralink: మెదడుకు మస్కా!

జీవితాన్ని మార్చనున్న ‘ఆలోచన’
ఎలన్‌ మస్క్‌ ‘న్యూరాలింక్‌’ ప్రాజెక్టులో ముందడుగు
ఈ ఏడాదే మానవ ప్రయోగాలు  

మనసులో అనుకున్నదే తడవుగా.. ఎక్కడో ఉన్న డ్రైవర్‌రహిత కారు మన ముందుకు వచ్చి ఆగితే! మనకు ఇష్టమైన సంగీతాన్ని చెవిలోకి కాకుండా నేరుగా మెదడులోకే చొప్పించేస్తే..! కంప్యూటర్‌ డేటా తరహాలో మన జ్ఞాపకాలనూ డౌన్‌లోడ్‌ చేసుకొని, భద్రపరచుకోగలిగితే..! అవసరమైనప్పుడు వాటిని ‘రీప్లే’ చేసుకోగలిగితే..! వాటిని మరో వ్యక్తిలోకి పంపగలిగితే..!

వినడానికి ఇది సైన్స్‌ కాల్పనిక సాహిత్యంలా అనిపించినా.. ఈ మహాద్భుతాన్ని ఆవిష్కరించే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు వ్యాపార దిగ్గజం ఎలన్‌ మస్క్‌. దీనికి సంబంధించిన అధునాతన ‘బ్రెయిన్‌-కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌’ (బీసీఐ) సాంకేతికతను మానవులపై ప్రయోగించే దశకు ఆయన సంస్థ చేరుకుంది. నాడీ సంబంధ సమస్యలు, వెన్నుపూస గాయాలతో కాళ్లు, చేతులు చచ్చుబడ్డవారు తమ అవయవాలను కదిలించేందుకు ఇది సాయపడుతుందని మస్క్‌ చెబుతున్నారు. అంతిమంగా దీనివల్ల ‘మానవాతీత శక్తి’ లభిస్తుందంటున్నారు. ఆయన ప్రణాళికల్లో సగం అమలైనా.. మానవ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞాన విప్లవానికి తెరలేస్తుంది. అది ప్రపంచం తీరుతెన్నులనే మార్చేస్తుంది.  

పునర్‌వినియోగ రాకెట్లు, వేగవంతమైన హైపర్‌లూప్‌ ప్రయాణ సాధనాలు, మారుమూల ప్రాంతంలోనూ ఇంటర్నెట్‌ అందించేందుకు వేల శాటిలైట్లతో ‘స్టార్‌లింక్‌’ వంటి ప్రాజెక్టులతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మస్క్‌.. మానవ మెదడులో కంప్యూటర్‌ చిప్‌ను చొప్పించేందుకు 2017లో ‘న్యూరాలింక్‌’ అనే అంకుర సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఇప్పుడు ‘క్లినికల్‌ డైరెక్టర్‌’ను నియమించేందుకు కసరత్తు చేస్తోంది. దీన్ని బట్టి బీసీఐ పరిజ్ఞానం మానవులపై ప్రయోగించే దశకు చేరువైనట్లు స్పష్టమవుతోంది. 2022 ముగిసే లోపల దాన్ని సాధిస్తామని గత నెలలో మస్క్‌  ప్రకటించారు.


ఏమిటీ ప్రాజెక్టు?

న మెదడు.. శరీరంలోని వివిధ అవయవాలకు నాడీ కణాల (న్యూరాన్లు) ద్వారా సంకేతాలను పంపడం, అందుకోవడం చేస్తుంది. ఈ కణాలు పరస్పరం సంధానమై, ఒక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తాయి. న్యూరో ట్రాన్స్‌మిటర్లు అనే రసాయన సంకేతాలతో ఇవి కమ్యూనికేషన్‌ సాగిస్తాయి. ఈ ప్రక్రియలో విద్యుత్‌ క్షేత్రం ఏర్పడుతుంది. మెదడులోని పలు న్యూరాన్లకు సమీపంలో ఎలక్ట్రోడ్లను ఉంచడం ద్వారా వాటిలోని విద్యుత్‌ సంకేతాలను రికార్డు చేయడం ‘న్యూరాలింక్‌’ ప్రాజెక్టు ఉద్దేశం. తద్వారా వాటిని ఆధునిక యంత్రాల నియంత్రణకు ఉపయోగించాలని ఆ సంస్థ భావిస్తోంది. సూటిగా చెప్పాలంటే మెదడులోని ఆలోచన శక్తి సాయంతో మనం యంత్రాలతో అనుసంధానం కావొచ్చు. అలాగే నాడీ, కదలికలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేయవచ్చు.


లాన్‌ మస్క్‌కు కృత్రిమ మేధ (ఏఐ)పై తీవ్ర వ్యతిరేకత ఉంది. అది మానవుల కన్నా తెలివైందని, భవిష్యత్‌లో మానవాళిపై పైచేయి సాధిస్తుందని తరచూ చెబుతున్నారు. దాన్ని ఎదుర్కోవడానికే న్యూరాలింక్‌ ప్రాజెక్టుకు ఆయన శ్రీకారం చుట్టారు. ఏఐని అధిగమించేలా మానవ మేధస్సును, సామర్థ్యాలను పెంచడానికి న్యూరాలింక్‌ ప్రాజెక్టు దోహదపడుతుందని ఆయన పేర్కొంటున్నారు.  


సాధనాలివీ..

న్యూరాలింక్‌ బ్రెయిన్‌-కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌ (బీసీఐ)లో 8 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన ఎన్‌1 అనే చిప్‌ ఉంటుంది. దానికి సన్నటి ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వెంట్రుకతో పోలిస్తే వాటి మందం 20వ వంతు మాత్రమే ఉంటుంది.

ఈ చిప్‌.. చెవిపై ఉండే ఒక సాధనంతో వైర్‌లెస్‌ పద్ధతిలో అనుసంధానమై ఉంటుంది. అది బ్లూటూత్‌ సాయంతో సమీపంలోని స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానం కాగలదు.

జంతువులపై ప్రయోగాలు విజయవంతం..
న్యూరాలింక్‌ చిప్‌ను ఇప్పటికే పందులు, కోతుల్లో విజయవంతంగా పరీక్షించారు. ఈ సాధనం అత్యంత సురక్షితమైనదని, విశ్వసనీయమైందని వెల్లడైనట్లు ఆ సంస్థ నిపుణులు చెప్పారు. దీని సాయంతో ఒక కోతి ‘పాంగ్‌’ వీడియో గేమ్‌ను ఆడింది.  


మెదడులో అమర్చేది ఇలా..

పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ ఎన్‌1 సాధనాన్ని అమరుస్తారు. ఈ చిప్‌నకు ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి చొప్పిస్తారు. ఒక చిప్‌లో మూడువేలకుపైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వాటిని మెదడులోని ముఖ్యమైన భాగాలకు చేరువగా ప్రవేశపెడతారు. అవి సుతిమెత్తగా ఎటుపడితే అటు వంగేలా ఉంటాయి. అందువల్ల సమీపంలోని కణజాలానికి నష్టం ఉండదు.  

చిప్‌ను సురక్షితంగా, అత్యంత కచ్చితత్వంతో, చిన్నపాటి కోతతో అమర్చేందుకు ప్రత్యేకంగా ఒక రోబోను ‘న్యూరాలింక్‌’ అభివృద్ధి చేసింది. అయితే మొదట్లో న్యూరోసర్జరీతో దీన్ని ఇంప్లాంట్‌ చేస్తారు. ఈ ప్రక్రియ గంటలోపే పూర్తవుతుంది.

చిప్‌లోని బ్యాటరీ వైర్‌లెస్‌ పద్ధతిలో ఛార్జి అవుతుంది. అందువల్ల దీన్ని ధరించినవారు సాధారణంగానే కనిపిస్తారు.

కంటికి చేసే లేసిక్‌ సర్జరీ తరహాలో భవిష్యత్‌లో చాలా సులువుగా, తక్కువ ఖర్చుతో బీసీఐలను అమర్చే స్థాయికి పరిజ్ఞానాన్ని ఆధునికీకరించాలని మస్క్‌ భావిస్తున్నారు.

ఈ సాధనాన్ని మెదడుకు దూరంగా పెడితే సంకేతాలను కచ్చితత్వంతో గుర్తించడం సాధ్యం కాదు. అందువల్లే పుర్రెలో అమర్చాల్సి వస్తోంది.


పనిచేసేది ఇలా..

ఎలక్ట్రోడ్లు.. మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సందేశాలను గుర్తించి ఎన్‌1 చిప్‌కు పంపుతాయి. ఒక చిప్‌లోని ఎలక్ట్రోడ్లు వెయ్యి న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి. మొత్తం మీద ఒక వ్యక్తిలోకి 10 చిప్‌లను ప్రవేశపెట్టొచ్చు.

ఇన్‌స్టాల్‌ అయ్యాక ఈ బీసీఐ.. మెదడు నుంచి విద్యుత్‌ సంకేతాలను పంపడం, అందుకోవడం, ప్రేరేపించడం వంటివి చేస్తుంది. వాటిని కంప్యూటర్లు విశ్లేషించగలిగే అల్గోరిథమ్‌లుగా మారుస్తుంది.


ప్రయోజనాలు..

న్యూరాలింక్‌ బీసీఐ.. మానవులు, కంప్యూటర్ల అనుసంధానానికి బాటలు వేస్తుంది. ఆలోచనశక్తి ద్వారా.. తాకాల్సిన అవసరం లేకుండానే స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లను ఆపరేట్‌ చేసేందుకు మొదట్లో ఇది సాయపడుతుందని ఆ సంస్థ చెబుతోంది. భవిష్యత్‌లో ఈ సాధనంతో ఎన్నో అద్భుతాలను సాధించొచ్చని పేర్కొంది. వారి కథనం ప్రకారం రానున్న కాలంలో ఈ ప్రాజెక్టుతో కలిగే ప్రయోజనాలివీ..

నాడీ సమస్యలు, వెన్నుపూసకు గాయాలు, పక్షవాతం వంటి వాటివల్ల కాళ్లు, చేతులు పూర్తిగా లేదా పాక్షికంగా చచ్చుబడ్డ రోగుల్లో స్పర్శ, కదలికలను మెరుగుపరిచే వీలుంది. వీరు సులువుగా ఉపకరణాలను ఉపయోగించగలుగుతారు. దీర్ఘకాలంలో వీరి అవయవాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించే వీలుంది.

డిమెన్షియా, అల్జీమర్స్‌, పార్కిన్‌సన్స్‌ వ్యాధి, మానసిక సమస్యల చికిత్స కోసం వాడొచ్చు.

ఆలోచన శక్తి సాయంతో టెక్స్ట్‌ లేదా స్వర సందేశాలతో కమ్యూనికేషన్‌ సాగించడానికి, బొమ్మలు గీయడానికి ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది.

ఈ చిప్‌ సాయంతో హార్మోన్‌ స్థాయిని కూడా నియంత్రించొచ్చు. కుంగుబాటును దూరం చేసుకోవచ్చు.

అవసరమైన నైపుణ్యాలను మెదడులోకి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కంటి చూపును, వినికిడి పరిధిని పెంచుకోవచ్చు.

సుదీర్ఘ భవిష్యత్‌లో దీనివల్ల ‘మానవాతీత విషయగ్రహణ సామర్థ్యం’ (సూపర్‌ హ్యూమన్‌ కాగ్నిషన్‌) సాధించడమే తమ లక్ష్యమని మస్క్‌ చెబుతున్నారు. కృత్రిమ మేధపై పోరాటానికి ఇది అవసరమని స్పష్టంచేస్తున్నారు. అవసరమైతే ఏఐతో ‘సురక్షిత సహజీవనం’ చేయడానికీ ఇది సాయపడుతుందని చెబుతున్నారు.  


అనుమతిపై ధీమా..

ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని మానవులపై ప్రయోగించినప్పుడు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఈ సంస్థ నిర్దేశించిన దాని కన్నా మెరుగైన ప్రమాణాలను పాటిస్తామని, అందువల్ల ఈ పరీక్షలకు తమకు తప్పకుండా అనుమతి వస్తుందని మస్క్‌ చెబుతున్నారు.

2020 జులైలో న్యూరాలింక్‌కు ‘బ్రేక్‌త్రూ పరిజ్ఞానం’గా ఎఫ్‌డీఏ నుంచి గుర్తింపు వచ్చింది. ఇది న్యూరాలింక్‌ సాధనాలను భారీ సంఖ్యలో ఉత్పత్తి చేయడానికి మార్గం సుగమం చేస్తుంది.


సవాళ్లు..

మెదడు పనితీరుపై శాస్త్రవేత్తలకు ఇప్పటికీ పూర్తి అవగాహన లేదు. దీనివల్ల ఈ ప్రాజెక్టుకు సవాళ్లు ఎదురుకావొచ్చు. న్యూరాలింక్‌తో రికార్డు చేసే డేటాను దుర్వినియోగం చేయవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవతలి వ్యక్తి ఆలోచన, చర్యలు, భావోద్వేగాలను పర్యవేక్షించడం నైతికంగా సబబేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ సాధనం అమర్చుకున్న వ్యక్తినే ఉద్యోగంలోకి తీసుకోవాలా అన్న డోలాయమాన పరిస్థితి తలెత్తవచ్చు. దీనిపై ప్రత్యేక చట్టాలు అవసరమవుతాయని నిపుణులు చెబుతున్నారు.


- ఈనాడు ప్రత్యేక విభాగం


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.