సంపాదకీయం

Facebook Share Twitter Share Comments Telegram Share
విద్వేష మాధ్యమాలు!

ప్రజల మధ్య సౌహార్ద వారధులుగా భాసిల్లాల్సిన సామాజిక మాధ్యమాలు- వదంతులు, వేధింపులకు ప్రధాన వాహకాలవుతున్నాయి. అసభ్య, అశ్లీల సందేశాలతో వ్యక్తులు, సంస్థల గౌరవమర్యాదలకు మసిపూసే ముసుగు మనుషుల క్రీడాంగణాలుగా అవి పరువుమాస్తున్నాయి. పలు మాధ్యమాల్లో లక్షల సంఖ్యలో నకిలీ ఖాతాలు తెరుస్తున్న ప్రబుద్ధులు- విపరీత వ్యాఖ్యలతో ప్రజాసమూహాల నడుమ వైషమ్యాలు రాజేస్తున్నారు. తప్పుడు వార్తలను వండివార్చుతూ భిన్న వర్గాలు, దేశాలకు వ్యతిరేకంగా హింసోన్మాదాలను రెచ్చగొడుతున్నారు. పాకిస్థాన్‌ కేంద్రంగా ఇండియాపై విషం చిమ్ముతున్న 35 యూట్యూబ్‌ ఛానళ్లు, మరికొన్ని ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలపై కేంద్రం తాజాగా నిషేధాజ్ఞలు విధించింది. గత నెలలోనూ అటువంటి ఇరవై ఛానళ్లపై ఆంక్షల కొరడా ఝళిపించింది. 2014-20 మధ్య 19 వేలకు పైగా సామాజిక మాధ్యమాల ఖాతాలు, వెబ్‌సైట్లను సర్కారు అలా నిషేధించింది. అయినా, రావణాసురుడి తలల్లా పుట్టుకొస్తున్న విద్వేష వేదికలు- భారత సార్వభౌమత్వానికే సవాలు విసురుతున్నాయి. దేశీయంగా సామాజిక మాధ్యమాలను దుర్వినియోగపరుస్తూ, అనాగరిక అప్రజాస్వామ్య భావనలను వ్యాప్తిలోకి తెస్తున్న మూకలు కొన్ని- జాతీయ సమగ్రత, శాంతిభద్రతలకు పెనుముప్పుగా పరిణమిస్తున్నాయి. నిరుడు ఆఖరి ఎనిమిది నెలల్లోనే అక్రమ, అనైతిక కార్యకలాపాలకు ఒడిగడుతున్న 1.13 కోట్ల భారతీయ ఖాతాలను వాట్సాప్‌ నిషేధించింది. 2021 మే-ఆగస్టు మధ్య ఇండియాకు సంబంధించి సుమారు 27.34 లక్షల చట్టవిరుద్ధ సమాచార భాగాలను గూగుల్‌ తొలగించింది. అంతర్జాలం, సామాజిక మాధ్యమాలను ముంచెత్తుతున్న దుష్ట, ధూర్త సమాచారం వాస్తవ స్థాయితో పోలిస్తే- ఆయా సంస్థలు గుర్తించి, నిర్మూలిస్తోంది చాలా స్వల్పం! ప్రాంతీయ భాషలతో చిరపరిచితులైన సిబ్బంది, కృత్రిమ మేధల వినియోగంతోనే ఆ పెడపోకడలకు అడ్డుకట్ట పడుతుంది. అందులో సామాజిక మాధ్యమాల వైఫల్యం ఆందోళనకరమే కాదు, జనశ్రేయానికి తీవ్ర విఘాతకరమైనది కూడా!

జాతీయ బాలల హక్కుల సంఘం ఇటీవలి సర్వే ప్రకారం, దేశీయంగా దాదాపు 43శాతం పాఠశాల విద్యార్థులు సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నారు. విశృంఖలమైన అంతర్జాల సమాచార వెల్లువకు వారిలో అత్యధికులు ప్రభావితులవుతున్నారు. సోషల్‌ మీడియా వినియోగదారులైన భారతీయ యువతుల్లో 58శాతం తీవ్రస్థాయి వేధింపులను ఎదుర్కొంటున్నట్లు పలు అధ్యయనాలు చాటుతున్నాయి. లైంగిక దుర్విచక్షణతో పేట్రేగిపోయే ఆన్‌లైన్‌ అల్లరి మూకల వికృత మనస్తత్వాలకు అవి అద్దంపడుతున్నాయి. మరోవైపు, ఎన్‌సీఆర్‌బీ లెక్కల మేరకు 2018-20 మధ్య దేశీయంగా వదంతులు, నకిలీ వార్తల కేసులు అయిదు రెట్లు అధికమయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో పుక్కిటి పురాణాల వ్యాప్తి పోనుపోను పెచ్చరిల్లుతుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా విష వ్యాఖ్యలు చేసినవారికి అరదండాలు వేయడంలో సీబీఐ అలసత్వాన్ని ఏపీ హైకోర్టు కొద్ది నెలల క్రితం తీవ్రంగా తప్పుపట్టింది. వ్యక్తుల గోప్యతా హక్కు వట్టిపోకూడదంటే- సామాజిక మాధ్యమాల నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థను కొలువుతీర్చాలని పార్లమెంటరీ స్థాయీసంఘం ఇటీవల సిఫార్సుచేసింది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు- అశ్లీల చిత్రాలు, దృశ్యాలపై ఫిర్యాదులు అందితే సామాజిక మాధ్యమాలు 24 గంటల్లోగా వాటిని తొలగించాలి. ‘ఆయా చిత్రాలు మా నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయి’ అంటూ వాటిపై చర్యలు తీసుకునేందుకు అవి కొన్నిసార్లు విముఖత ప్రదర్శిస్తున్నాయి. ఆయా సంస్థల దుర్విధానాలకు పగ్గాలేయడం ఎంత అవసరమో, ఆ నెపంతో పౌరుల భావ ప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్లు బిగించేందుకు ప్రయత్నించడం అంతే ప్రమాదకరం. విధాన రచనలో, ఆచరణలో ప్రభుత్వాలు ఆ మేరకు విచక్షణాయుతంగా వ్యవహరించాలి!


దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.