
వసుంధర
పెద్ద సంస్థలో ఉద్యోగం ఆమె కల. అనుకున్నట్టుగానే సాధించింది. ఫ్యాషన్ డిజైనింగ్.. అభిరుచి. అ, ఆలు తెలియదు. కానీ ఏదో సాధించాలన్న తపన. దీంతో సొంతంగానే నేర్చుకుని ప్రయత్నించింది. అవకాశాలొచ్చాయి.. ఎంతలా అంటే.. సినిమాలు, సెలబ్రిటీలకు సైతం చేసేలా! ఓవైపు ఉద్యోగం, మరోవైపు అభిరుచి రెంటినీ సమన్వయం చేసుకుంటూ సాగుతోంది అపర్ణ కర్లపూడి. ఆ ప్రయాణాన్ని మనతో పంచుకుందిలా..!
మాది తణుకు దగ్గర చిన్నపల్లెటూరు. నాన్న సుబ్బారావు, అమ్మ సత్యవాణి. వ్యవసాయ కుటుంబం. గీతం యూనివర్సిటీ నుంచి ఎంబీఏ ఫైనాన్స్ చేశా. హైదరాబాద్ వచ్చి పెద్ద సంస్థలో ఉద్యోగం చేయాలన్నది నాకల. అనుకున్నట్టుగానే యూఎస్‌కు చెందిన ఫైనాన్షియల్ కార్పొరేషన్లో ఉద్యోగం వచ్చింది. నాలుగేళ్లు చేశాక జీవితంలో ఏదో వెలితిగా అనిపించేది. సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనింగ్ చేయడమంటే ఇష్టం. సంబంధిత కోర్సులు చేద్దామని ప్రణాళికా వేసుకున్నా. కానీ కుదర్లేదు. సరే.. ముందు దీనిపై పట్టు పెంచుకుందామనుకుని హైదరాబాద్‌లో దొరికే వివిధ ప్రత్యేక వస్త్రాలు, ఫ్యాషన్ల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టా. నాకీ ఆసక్తి మా అమ్మ నుంచి వచ్చింది. తన దగ్గర దుస్తులు, జాకెట్ల డిజైన్లతో ఆల్బమ్ ఉండేది. అది నన్ను బాగా ఆకర్షించేది. చూస్తానంటే అమ్మ ఒప్పుకునేది కాదు. అప్పట్నుంచి దీనిలో ఏదైనా చేయాలనే కోరిక ఇటు నడిపించిందన్నమాట.
2012లో స్నేహితుడొకరు సినిమా నిర్మిస్తూ కాస్ట్యూమ్ డిజైనర్‌గా అవకాశమిచ్చాడు. అనుభవం లేకపోవడంతో మరో డిజైనర్‌తో కలిసి పనిచేశా. అలా వీకెండ్ లవ్ అనే సినిమాకు పనిచేశా. అక్కడ ప్రాక్టికల్‌గా తెలుసుకునే అవకాశం దొరికింది. ఆ అనుభవంతో మరో మూడు చిన్న సినిమాలకు స్వయంగా చేశా. ఇక్కడ లొకేషన్లకు వెళ్లి డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి అప్పటికప్పుడు డిజైన్‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఒకవైపు ఆఫీసు, మరోవైపు ఇది.. సమయం కుదరలేదు. అలా చివరగా ‘అమరం.. అఖిలం.. ప్రేమ’కు చేసి, పక్కనపెట్టా. నేను చేసినవాటన్నింటినీ ఫేస్బుక్లో ‘రోజ్ పెటల్స్’ పేరుతో పోస్ట్ చేసేదాన్ని. మంచి స్పందన వచ్చింది. వీటన్నింటినీ నా స్నేహితులు చూసేవారు, మెచ్చుకునేవారు. తమకీ చేసివ్వమనేవారు. ఇంటి దగ్గర్లోని బొటిక్ వాళ్లతో నా ఆలోచన చెప్పి, దగ్గరుండి డిజైన్ చేయించి పంపేదాన్ని. సొంతంగా బొటిక్ ప్రారంభించమనేవాళ్లు. తర్వాత మా పాప భువి పుట్టింది. మావారు సురేంద్రనాథ్ కాంట్రాక్టర్. డిజైనింగ్ అంటే కొన్నిగంటలైనా బయటకు వెళ్లాలి. మా అమ్మాయేమో ఇంకా నెలలపాపే. ఏం చేయాలా అనుకుంటున్నప్పుడు మా అత్తయ్యే ఇంట్లో ప్రారంభించమని సలహానిచ్చారు. అలా 2016లో ఇద్దరితో ‘భువి డిజైన్ స్టూడియో’ ప్రారంభించా. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ తీసుకుని చేసిస్తా. ఇప్పటికీ ప్రత్యేక కోర్సులేమీ చేయలేదు. సినిమాలకు పనిచేసినపుడు సమస్యలు, ఫొటోగ్రఫీలో బాగా కనిపించే రంగులు, ఎలాంటి సందర్భాలకు ఎలాంటివి బాగుంటాయి లాంటి ఎన్నో విషయాలు ప్రయోగాత్మకంగా నేర్చుకున్నా. అది కొత్త ప్రయోగాలు చేసేలా ప్రోత్సహిస్తోంది. ఒక రకంగా ఏకలవ్యురాలినని చెప్పొచ్చు. ఇప్పటివరకూ 3000 మందికి చేసిచ్చా. నోటిమాటతోనే ఆదరణ వచ్చింది. అలానే సినిమా వాళ్లకీ చేసే అవకాశాలొచ్చాయి. చాందిని చౌదరికి ఎక్కువగా డిజైన్ చేశా. ప్రియమణికి బ్రాండ్ యాడ్ షూట్లకు, యాంకర్ సుమకీ, అల్లు అర్హకి రెండు పండగలకు చేశా. హన్షిత (దిల్ రాజు కూతురు) ఏదైనా వేడుక, పండుగ లాంటివి ఉంటే సంప్రదిస్తారు. ఒకరకంగా నా బ్రాండ్‌కి పేరు ఆవిడ వల్లే వచ్చిందని చెబుతా.
రోజూ 10-12కి మించి ఆర్డర్లు తీసుకోను. ఉదయం ఓ 5 గంటలు బొటిక్ పనులు చూస్తా. ఆఫీసు పని మధ్యాహ్నం 3 గంటలకు మొదలవుతుంది. మిగిలిన సమయం కుటుంబానికి. ఇష్టమైనది చేస్తుండటంతో అలసట అనిపించదు. ఏడాదికి టర్నోవర్.. రూ.75 లక్షలు వరకూ వస్తోంది. ఈ క్రమంలో ఇబ్బందులూ ఎదురయ్యాయి. వాటిని నాదగ్గరున్న టీం సాయంతోనే అధిగమించాను. అందుకే లాక్‌డౌన్‌లోనూ ఆదాయం లేకపోయినా వాళ్లకి తోడుగా నిలిచా. ఇంట్లోవాళ్లే నా బలం. భవిష్యత్‌లో మా సేవల్ని హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాలకీ విస్తరించాలనుకుంటున్నా. మొదట్లో నా ఆలోచన చెప్పినప్పుడు అత్తామామలు, మావారు ‘నచ్చింది చెయ్యి, కానీ ఒత్తిడి పెంచుకోకు. నీ ఆరోగ్యం మాత్రం చూసుకో’ అన్నారు. అన్ని విషయాల్లో నాకు అండగా నిలిచారు. అందుకే నా మొదటి ప్రాధాన్యం ఇల్లే. ముందు ఇక్కడ ఆనందంగా ఉంటేనే బయట ఏదైనా సాధించగలమని నమ్ముతా. ఓవైపు ఫండ్ అకౌంటెంట్‌గా, మరోవైపు డిజైనర్‌గా సాగుతున్నానంటే వాళ్ల ప్రోత్సాహమే కారణం. దీంతోపాటు ఓపిక, కష్టపడేతత్వమూ కావాలి. నాకూ ఏదీ ఒక్కసారిగా రాలేదు. ఏళ్లు పట్టింది. అలా ఓపికతో ఉన్నప్పుడే ఏదైనా సాధించగలం.