ఫీచర్ పేజీలు

Facebook Share Twitter Share Comments Telegram Share
గుండె గుండెకో వేగం!

నిరంతరం గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. దీని వేగం అన్నిసార్లూ ఒకేలా ఉండదు. అందరిలోనూ ఒకేలా కొట్టుకోవాలనీ లేదు. రోజంతా మనం చేసే పనులను బట్టి శరీరానికి అవసరమైన ఆక్సిజన్‌ మేరకు దీని వేగం ఆధారపడి ఉంటుంది. గుండె వేగం ‘నార్మల్‌’ అనేది వ్యక్తులను బట్టి మారిపోతుంటుంది. వయసు మీద పడుతున్నకొద్దీ మారిపోవచ్చు. గుండె వేగం ఆధారంగా గుండె ఆరోగ్యాన్నీ అంచనా వేయొచ్చు.


విశ్రాంతి గుండె వేగం

విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు రక్తాన్ని పంప్‌ చేయటానికి గుండె ఎక్కువగా కష్టపడాల్సిన పనుండదు. అందుకే నెమ్మదిగా కొట్టుకుంటుంది. ఇలా విశ్రాంతిగా ఉన్నప్పుడు నిమిషానికి గుండె కొట్టుకునే వేగాన్ని ‘రెస్టింగ్‌ హార్ట్‌ రేట్‌’ అంటారు. ఇది ఆరోగ్యవంతుల్లో చాలావరకు 60-100 మధ్యలో ఉంటుంది. సాధారణంగా మంచి శారీరక సామర్థ్యం గలవారిలో విశ్రాంతి గుండె వేగం తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు- పరుగు, ఈత వంటి ఆటలాడే క్రీడాకారుల్లో ఇది 40ల్లోనే ఉంటుంది. మరీ కష్టపడకుండానే ఇలా శరీరం మొత్తానికి రక్తాన్ని పంప్‌ చేయటాన్ని గుండె ఆరోగ్యానికి సూచికగా భావిస్తారు. ఇంతకీ విశ్రాంతి సమయంలో గుండె వేగాన్ని తగ్గించుకునేదెలా? ప్రశాంతంగా కూర్చొని, గ్లాసు నీళ్లు తాగితే గుండె వేగం నెమ్మదిస్తుంది. కొద్దిసేపు గాఢంగా శ్వాస తీసుకున్నా సరే. రోజుకు కనీసం అరగంట సేపు వ్యాయామం చేయటం, మంచి పోషకాహారం తినటం, బరువు అదుపులో ఉంచుకోవటం.. మద్యం, కెఫీన్‌ మితిమీరకుండా చూసుకోవటం, పొగ అలవాటు మానెయ్యటం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలితోనూ దీన్ని సాధించొచ్చు. ఒత్తిడిని తగ్గించే ధ్యానం, ప్రాణాయామం వంటివీ మేలు చేస్తాయి.


గుండె వేగం-వ్యాయామం

ష్టమైన పనులు, వ్యాయామాలు చేస్తున్నప్పుడు గుండె వేగంగా కొట్టుకోవటం తెలిసిందే. అయితే దీనికీ ఒక పరిమితి ఉంది. ఇది గరిష్ఠ గుండె వేగం మీద ఆధారపడి ఉంటుంది. వయసును పరిగణనలోకి తీసుకొని దీన్ని లెక్కిస్తారు. ముందుగా 220 నుంచి వయసును తీసేస్తారు. ఉదా: 50 ఏళ్లు ఉన్నాయనుకోండి.. 220 నుంచి 50 తీసేయగా మిగిలే 170ని గరిష్ఠ గుండె వేగంగా పరిగణిస్తారు. అంటే 50 ఏళ్ల వయసువారిలో గుండె ఎక్కువలో ఎక్కువగా 170 సార్లు కొట్టుకున్నా ఇబ్బంది లేదని అర్థం. అయితే వ్యాయామాలు చేస్తున్నప్పుడు ఇందులో కొంతవరకే చేరుకునేలా చూసుకోవాలి. ఇప్పుడిప్పుడే వ్యాయామాలు మొదలెడితే గరిష్ఠ వేగంలో సగం వరకే చేరుకునేలా చూసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేసేవారు 85% వరకు చేరుకోవచ్చు. ట్రెడ్‌మిల్‌ వంటి కొన్ని యంత్రాలు, పరికరాలు గుండె వేగాన్ని లెక్కించి చూపిస్తుంటాయి. వీటిని బట్టి తేలికగానే దీన్ని గుర్తించొచ్చు.  

ఇతర పరిస్థితులు

వేడి, తేమ వంటి బయటి పరిస్థితులూ గుండె వేగం పెరిగేలా చేయొచ్చు. తీవ్రమైన భావోద్వేగాలకు లోనవ్వటం, ఆందోళన వంటి వాటితోనూ గుండె వేగం పెరుగుతుంది. కొందరికి కూర్చొని పైకి లేచినప్పుడూ కొద్ది సెకన్ల పాటు గుండె వేగంగా కొట్టుకోవచ్చు. గుండె వేగం విషయంలో వీటినీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.