
గ్రేటర్ హైదరాబాద్
ఏఐఎస్ నిబంధనల సవరణ.. రాష్ట్రాల హక్కులను హరించడమే
వెంటనే ఉపసంహరించుకోవాలి
ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
ఈనాడు, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అఖిల భారత సర్వీసుల (ఏఐఎస్) నిబంధనలకు ప్రతిపాదించిన సవరణలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. ఇవి రాజ్యాంగ, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లసేవా గుణాలను దెబ్బతీస్తాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండు చేశారు. కేంద్రానికి దమ్ముంటే పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు.
‘‘ప్రస్తుత నిబంధనల ప్రకారం ఏఐఎస్ అధికారులను కేంద్రం డిప్యుటేషన్‌పై తీసుకుంటే రాష్ట్రాల అనుమతి తీసుకోవాలి. దీనిని ఎత్తివేసి, రాష్ట్రాలతో సంబంధం లేకుండా కేంద్రం ఏకపక్షంగా తీసుకునేలా సవరణ చేశారు. ఇది రాజ్యాంగ నిబంధనలను, సహకార సమాఖ్య స్పూర్తిని దెబ్బతీసే ప్రమాదకర నిర్ణయం. రాష్ట్రాల పరిపాలనలో కేంద్రం జోక్యం చేసుకోవడమే. రాష్ట్రాలలో పని చేసే అధికారులపై పరోక్ష నియంత్రణను ప్రదర్శించే ఎత్తుగడ. రాష్ట్రాల్లో పనిచేసే అధికారులను లక్ష్యంగా చేసుకుని వేధించడం. వారిని నైతికంగా ఇబ్బంది పెట్టి, నిరుత్సాహానికి గురిచేసే చర్య. రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారుల జవాబుదారీతనంపై ప్రభావం చూపుతుంది. అఖిల భారత సర్వీసుల అధికారుల విషయాలలో రాష్ట్ర ప్రభుత్వాలను నిస్సహాయ సంస్థలుగా మారుస్తుంది. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అడ్డదారి నిర్ణయాలు తీసుకునే బదులు పార్లమెంటులో చట్టం సవరించే దమ్ము కేంద్రానికి లేదా?
రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకుండా ఎలా చేస్తారు?
రాజ్యాంగంలోని 312 అధికరణ ప్రకారం 1951లో అఖిలభారత సేవలపై పార్లమెంటు చట్టం చేసింది. ఏదేని రాజ్యాంగ సవరణ చేపట్టినప్పుడు విధిగా రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోవాలని రాజ్యాంగ నిర్మాతలు నిర్దేశించారు. దీనికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. సవరణలను ప్రభుత్వం అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యాన్ని కోల్పోతాయి. ప్రస్తుతం ఉన్న ఏఐఎస్ నిబంధనలు సమతూకంగా ఉన్నాయి. వాటిని కొనసాగించాలి. మన రాజ్యాంగంలోని పరిపాలన, న్యాయబద్ధత. సమాఖ్య రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ప్రతిపాదిత సవరణలను నిలిపివేయాలి. వాటిని పూర్తిగా ఉపసంహరించుకోవాలి’ అని సీఎం కేసీఆర్ లేఖలో కోరారు.