
గ్రేటర్ హైదరాబాద్
ఏటా మార్కెట్ విలువ పెంపు.. గిరాకీ ప్రాంతాల్లో ఎప్పుడైనా పెంచుకోవచ్చు..
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఏటా వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మార్కెట్ విలువలు పెంచేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రెండేళ్లకు ఒకసారి పెంపుదలకు అనుమతి ఉండగా తాజాగా దీన్ని సవరించింది. డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఎప్పుడైనా పెంచవచ్చని పేర్కొంది. ఈ మేరకు ప్రతి ఏటా మార్కెట్ విలువను సవరించే అధికారాన్ని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్‌కు ఇచ్చింది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి కొత్త మార్కెట్ విలువలను అమలు చేయలని జరుగుతున్న కసరత్తులో భాగంగా సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించిన మార్కెట్ విలువ, బహిరంగ మార్కెట్ విలువకు పొంతన ఉండటంలేదని భావించిన ప్రభుత్వం ఈ విలువలను సవరిస్తోంది. మంత్రిమండలి ఉపసంఘం కూడా ఆర్థిక వనరుల పెంపుపై సమగ్రంగా పరిశీలించింది. రాష్ట్ర అవసరాలు పెరుగుతున్నా రాబడి వచ్చే అవకాశం ఉన్న వాటిని విస్మరించడం సరికాదనే అభిప్రాయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో విలువ సవరణలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
ప్రాతిపదికకు పలు అంశాలు
* ఎనిమిదేళ్లుగా భూముల విలువను సవరించకపోవడం, రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ), తలసరి ఆదాయం రెట్టింపు కావడం, సాగునీటి ప్రాజెక్టులతో నీటి వసతి పెరగడంతో భూముల విలువ భారీగా పెరగడం, రాష్ట్రంలో ఐటీ, ఫార్మా, పర్యాటకం, స్థిరాస్తి రంగంలో పెరుగుదల, కొత్త జిల్లాల ఏర్పాటు, వివిధ రంగాల్లో అభివృద్ధి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంది.
* హైదరాబాద్ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్డుకు అటు ఇటు, తాజాగా వస్తున్న రీజనల్ రింగ్‌రోడ్డు నేపథ్యంలో వేగంగా జరుగుతున్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుంది.
* మౌలిక సదుపాయాల కల్పనతో జరుగుతున్న అభివృద్ధి, హైదరాబాద్ నలుదిశలా పెరుగుతున్న రియల్ ఎస్టేట్ జోరు నేపథ్యంలో మార్కెట్ విలువల సవరణకు సర్కారు మొగ్గుచూపింది. ఇందులో భాగంగానే ఏడాదికి ఒక సారి సవరించడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో ఎప్పుడైనా మార్చేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది.
అదిరేలా రిజిస్ట్రేషన్ల రాబడి
రాష్ట్ర ఖజానాకు రిజిస్ట్రేషన్ల రాబడి కీలకంగా మారుతోంది. 2020-21లో కరోనా ప్రభావం ఉన్నా రాబడి బాగా పెరగడంతో పాటు కొత్త మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో అంచనాలను రూ.12,500 కోట్లకు పెంచింది. ఇప్పటికే రూ.7,500 కోట్ల రాబడి వచ్చింది. కొత్త మార్కెట్ విలువలు అమలులోకి వస్తే రాబడి అంచనాలను మించుతుందని ఆర్థిక శాఖ లెక్కకడుతోంది.