
క్రైమ్
ఈటీవీ, ఆదిలాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తుపాకీ కాల్పుల కేసులో ఎంఐఎం ఆదిలాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఫారూఖ్ అహ్మద్‌కు కోర్టు జీవితఖైదు శిక్షతో పాటు రూ.12 వేల జరిమానా విధించింది. ఈ మేరకు ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి డా.టి.శ్రీనివాస్‌రావు సోమవారం తీర్పు చెప్పారు. ఏ-2గా ఉన్న ఫెరోజ్‌ఖాన్, ఏ-3 ఎండీ హర్షద్‌లను నిర్దోషులుగా ప్రకటించారు. దాదాపు తొమ్మిది నెలల వ్యవధిలోనే ప్రత్యేక కోర్టు అన్ని కోణాల్లో విచారణ జరిపి తీర్పు వెల్లడించింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 2020 డిసెంబరు 18న పిల్లల ఆటలో తలెత్తిన వివాదం ఇరువర్గాల మధ్య ఘర్షణలకు దారితీసింది. ఇందులో ఫారూఖ్ అహ్మద్ ఓ చేతిలో తల్వార్ పట్టుకుని, మరో చేతిలో పిస్తోలుతో కాల్పులు జరపడం కలకలం సృష్టించింది. ఈ కాల్పుల్లో మాజీ కౌన్సిలర్ సయ్యద్ జమీర్, మన్నాన్, మోతేసీన్లు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన సయ్యద్ జమీర్ హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే నెల 26న మరణించారు.