
గ్రేటర్ హైదరాబాద్
మంత్రి కొప్పుల ఈశ్వర్, విప్ బాల్క సుమన్
ఈనాడు, హైదరాబాద్: దేశంలోనే అత్యుత్తమ సంస్థ, తెలంగాణకు కొంగు బంగారమైన సింగరేణిపై కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కక్ష పూనిందని, లాభాల్లో ఉన్న సంస్థను విక్రయించాలని కుట్ర పన్నడం దారుణమని మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. దీనిపై కార్మిక కుటుంబాలతో కలిసి ఉద్యమించేందుకు తెరాస నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఈ సంస్థ కోసం పోరాడేందుకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారని, గల్లీ నుంచి దిల్లీ దాకా ఇది సాగుతుందన్నారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేంద్రం దిగొచ్చే వరకు ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు పోరాడాలని, భాజపా నేతలను నిలదీయాలని వారు కోరారు. సోమవారం విప్ బాల్క సుమన్, ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, గండ్ర వెంకటరమణరెడ్డి, సండ్ర వెంకటవీరయ్యలతో కలసి తెలంగాణభవన్‌లో కొప్పుల విలేకరులతో మాట్లాడారు. ‘‘తెలంగాణ వచ్చాక బొగ్గు ఉత్పత్తి, రవాణా రంగంలో సింగరేణి గణనీయమైన వృద్ధి సాధించింది. సింగరేణి సంస్థ ఎదుగుతుంటే కేంద్రం భరించలేకపోతోంది. దానిని ప్రైవేటీకరించేందుకు కుట్ర చేస్తోంది. ఇంత జరుగుతున్నా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏం చేస్తున్నారు? వాళ్లకు ఓట్ల రాజకీయం తప్ప ఇక్కడి ప్రజల సమస్యలు పట్టవు. కేంద్రం తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి’’ అని డిమాండ్ చేశారు.