
సినిమా
హైదరాబాద్: ఇటీవల బాలీవుడ్లో విడుదలైన అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రం భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దీంతో టాలీవుడ్ హీరోలంతా హిందీ మార్కెట్‌పై కన్నేశారు. తమ తదుపరి సినిమాలు హిందీలోనూ విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు అదే బాటలో మాస్ మహారాజ్ రవితేజ కూడా నడుస్తున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘ఖిలాడి’ ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఈ చిత్రాన్ని హిందీలోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.
రవితేజ గత సినిమాలు కొన్ని హిందీలో డబ్ అయి యూట్యూబ్‌లో విడుదలయ్యాయి. వాటికి బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. అలాగే, ఈ ‘ఖిలాడి’ చిత్రం మంచి యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో బాలీవుడ్‌లోనూ విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. అందుకే, పెన్ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని హిందీ వెర్షన్లో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో రవితేజ రెండు భిన్నమైన పాత్రలు పోషిస్తున్నారు. దీనికి రమేశ్‌వర్మ దర్శకత్వం వహిస్తుండగా.. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో డింపుల్ హయతీ, మీనాక్షి చౌదరి, ఉన్ని ముకుందన్, అనసూయ భరద్వాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.