
వసుంధర
చిన్నప్పటి నుంచి ఏదో సాధించాలన్న తపన తనది. ఆ పట్టుదలతోనే ఎన్ని ఇబ్బందులున్నా బాగా చదువుకుంది. తోటి అమ్మాయిలు సరదాగా గడుపుతోంటే తను పార్కుల్లో పౌష్టికాహారం అమ్ముతూ నిజమైన వ్యాపారవేత్తకుండాల్సిన అర్హతలేంటో తెలుసుకుంది. తర్వాతా పూలబాట లాంటి ఉద్యోగాన్ని వదిలి వ్యాపారాన్ని ప్రారంభించింది. అనుకోని అవాంతరాలకు కుంగిపోలేదు. కష్టాలకీ, నష్టాలకీ ఎదురీది... ఆమె మొదలు పెట్టిన ‘మినీ ఆసుపత్రులు’ నేడు అగ్రగామి సంస్థలకు సేవలందిస్తున్నాయి. ఆమే విజయనగరానికి చెందిన తులాల ఆశాసాగర్...
కాళ్లు నేలమీద ఉన్నా తన కలలకు నిరంతరం రెక్కలు తొడిగేది ఆశ. విజయనగరం జిల్లాలోని కురుపాం మండలం నీలకంఠాపురం ఆమె సొంతూరు. తండ్రి గిరిధర్ చౌదరిది చిన్న కిరాణా దుకాణం. అమ్మ మనోరమ. ఎన్ని ఇబ్బందులున్నా ఆశ పట్టుదలని చూసి బాగా చదివించాలనుకున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించక పదో తరగతి వరకు ఆ ఊర్లోని గిరిజన సంక్షేమ పాఠశాలలో చదివింది. తర్వాత హైదరాబాద్ ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ, ఎంఎస్సీ హోమ్‌సైన్స్ చేసింది. బీఎస్సీలో ఉండే ఆంత్రప్రెన్యూర్ డెవలప్మెంట్ సబ్జెక్‌లో చాలామంది పాస్‌మార్కులు వస్తే చాలనుకుంటారు. ఆశ మాత్రం దీనిపై గట్టిగానే దృష్టి పెట్టింది. క్లాసులో నేర్చుకుంటున్న పాఠాలని ప్రాక్టికల్‌గా తెలుసుకోవాలనుకుంది. అందుకే పౌష్టికాహారాన్ని తయారు చేసి సాయంత్రం వేళ ఇందిరా పార్కులో అమ్మేది. ఆశ ప్రతిభను గుర్తించిన అధ్యాపకులూ ప్రోత్సహించారు. కానీ అసలైన అవకాశం దొరికింది మాత్రం పెళ్లి తర్వాతే.
కొవిడ్ తెచ్చిన అవకాశం...
ఆశ భర్త విద్యాసాగర్ వైద్యుడు. చదువు పూర్తయిన తర్వాత రాంబిల్లిలోని భాగవతుల ఛారిటబుల్ ట్రస్టులో పోషకాహార నిపుణురాలిగా నాలుగేళ్లు ఉద్యోగం చేసింది ఆశ. ఆ సమయంలోనూ గిరిజన మహిళలకు అండగా నిలబడింది. పనసపండుతో పలు ఉత్పత్తుల తయారీపై వారికి శిక్షణ ఇచ్చేది. అందుకు అవసరమైన పరికరాలు తదితరాల కోసం మైక్రోసాఫ్ట్ సంస్థను ఒప్పించి వారి నుంచి రూ.25లక్షలు సాధించింది. తర్వాత కొన్నాళ్లకు వ్యాపారంవైపు రావాలన్న ఆసక్తితో చేస్తున్న సైంటిస్ట్ ఉద్యోగాన్ని వదులుకుంది. విశాఖపట్నంలోని పరవాడలో ‘సంపూర్ణ హెల్త్పుడ్’ పేరుతో పోషకాహారాలను చేసి మార్కెట్ చేసేది. సరిగ్గా వ్యాపారం విస్తరిస్తున్న సమయంలో కొవిడ్ వ్యాప్తి ఎక్కువ కావడంతో కష్టమంతా బూడిదలో పోసినట్టయ్యింది. అయినా ఆశ కుంగిపోలేదు. దీన్నుంచి బయటపడాలి, అందుకు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు భర్త మాటలు ఆమెలో కొత్త ఆశల్ని రేపాయి. కొవిడ్ సమయంలో కంపెనీలకు వైద్య సిబ్బంది కొరత ఉందన్న ఆయన మాటల్లోంచే ఆమెకో వ్యాపార ఆలోచన తట్టింది. ‘ఆ వైద్య సిబ్బందినేదో నేనే అందిస్తే?’ అన్నది తన ఆలోచన. వెంటనే రూపాయి పెట్టుబడి లేకుండా ‘ఏబీసీ హెల్త్ కేర్ సిస్టమ్’ సంస్థను ఏర్పాటు చేసింది. అచ్యుతాపురం, పరవాడ, రాంబిల్లి మండలాల్లోని కార్పొరేట్ కంపెనీలను సంప్రదించింది. అవసరం అయినప్పుడు కార్మికులు ఆసుపత్రుల దగ్గరకు పరుగెత్తకుండా... కంపెనీల ఆవరణలోనే ‘మినీ ఆసుపత్రులు’ నిర్వహించి నిరంతర వైద్యసేవలు అందిస్తామని వాళ్లను ఒప్పించింది. ఇలా 2020లో ప్రారంభమైన ‘ఏబీసీ హెల్త్‌కేర్’ సేవలు ఆయా పరిశ్రమలు, కార్మికుల అభిమానాన్ని చూరగొన్నాయి. తక్కువ కాలంలోనే ఇతర జిల్లాలకు విస్తరించాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, విశాఖ కేంద్రాలుగా పనిచేస్తున్న కంపెనీలకు వైద్యులు, వైద్య సిబ్బందిని ఇస్తున్నారు, మందులు, అక్సిజన్ వంటివి సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు తన బృందంలో 80 మంది వైద్య సిబ్బంది ఉన్నారు. ఎల్అండ్టీ, అరబిందో, గ్రాన్యూల్స్, లుపిన్, ఆర్హెచ్ఐ మెగానిస్టా, ఫార్మాజెల్, సాయినార్ లైఫ్ సైన్సెస్, బ్రాండిక్స్ అపెరల్ వంటి 12 అంతర్జాతీయ పరిశ్రమలకు వైద్య సిబ్బందిని, ఇతర సేవలను అందిస్తున్నారు. ఇప్పుడు తన సంస్థ టర్నోవర్ కోట్లల్లోకి చేరుకుంది. తనే పరిస్థితుల్లో ఉన్నా వీలైనంత మంది మహిళలకు తోడ్పడాలనేది ఆశ ఆలోచన. అందుకే మహిళలతో మాకు కష్టం అని సంస్థలు అన్నా వాళ్లని ఒప్పించి జనరల్, ఏ-షిష్ట్‌ల్లో పూర్తి గా మహిళా వైద్యులు, మహిళా వైద్య సిబ్బంది ఉండేట్టు చూసి శెభాష్ అనిపించుకుంటోంది. అవకాశం వస్తే మహిళలు ఎంత బాగా చేయగలరన్నదానికి నేను, మా బృందమే నిదర్శనమంటోంది ఆశ.
- శివలంక సూర్యచంద్రరావు, విశాఖపట్నం