
సంపాదకీయం
ఎద్దుకు మేతేసి ఆవును పాలివ్వమంటే ఇస్తుందా? రాజకీయ పెత్తందారుల పెంపుడు మనుషులకు రాజ్భవన్లను రాసిచ్చేశాక, రాజ్యాంగ ప్రమాణాలకు మన్నన దక్కాలంటే కుదురుతుందా? ‘భారత సంవిధానం ప్రకారం గవర్నర్ తనకుతానుగా చక్కబెట్టే బాధ్యతలేమీ లేవు... మంత్రివర్గ సలహాలను ఆయన తప్పనిసరిగా ఆమోదించి తీరాలి’- రాజ్యాంగ సభ చర్చల్లో భాగంగా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ స్పష్టీకరించిన అంశమిది. స్వాతంత్య్ర అమృత మహోత్సవాల సమయంలో దాదాపుగా అదే సంగతిని సుప్రీంకోర్టు తిరిగి గుర్తుచేయాల్సి వచ్చిందంటే- చట్టబద్ధమైన పాలనకు కట్టుబడ్డ ప్రజాస్వామ్య దేశంగా ఇండియా ఇన్నేళ్లలో ఏం పరిణతి సాధించినట్లు? రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి ఏజీ పేరారివాళన్ క్షమాభిక్షకు తమిళనాడు మంత్రిమండలి గతంలో సిఫార్సు చేసింది. దాదాపు రెండేళ్ల పాటు దాన్ని అక్కడి గవర్నర్ తొక్కిపెట్టారు. నిర్ణయంలో సుదీర్ఘ జాప్యానికి కారణమేమిటని సర్వోన్నత న్యాయస్థానం ఆరాతీయడం ఆరంభించగానే- బంతిని రాష్ట్రపతి కోర్టులోకి తోసేసి ఆయన ఎంచక్కా చేతులు దులిపేసుకున్నారు. ‘161 అధికరణ కింద దోషులకు శిక్షల తగ్గింపు, మార్పుపై రాష్ట్ర మంత్రివర్గ సలహాకు గవర్నర్ కట్టుబడాలి... ప్రస్తుత కేసులో విషయాన్ని రాష్ట్రపతికి నివేదించకుండా ఉండాల్సింది... ఇటువంటి చర్యలు రాజ్యాంగ విరుద్ధమైనవి’ అంటూ పేరారివాళన్ విడుదలకు న్యాయపాలిక తాజాగా ఆదేశాలిచ్చింది. ‘అసలు ఏ రాజ్యాంగ నిబంధనకు అనుగుణంగా గవర్నర్ అలా వ్యవహరించారు’ అని నిగ్గదీసిన మాన్య న్యాయమూర్తులు- దేశ సమాఖ్య నిర్మాణంపై దాడిగా దాన్ని అభివర్ణించారు. కేంద్రానికి తాబేదారులుగా సమాఖ్య స్ఫూర్తికి సమాధి కట్టడంలో చెయ్యితిరిగిన గవర్నర్లకు దేశీయంగా ఏనాడూ లోటు లేదు. అటువంటి వారినే ఏరికోరి ముద్దుచేస్తూ చంకనెక్కించుకునే దిల్లీ పెద్దల ‘ప్రేమ’లోనూ అప్పటికీ ఇప్పటికీ ఏ మార్పూ రాలేదు!
రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పాలనా వ్యవహారాల్లో గవర్నర్ వేలుపెట్టరని హామీ ఏమిటని రాజ్యాంగ సభ సభ్యులుగా హెచ్.వి.కామత్ ప్రశ్నించారు. హామీ అంటే... గవర్నర్ విజ్ఞతే; ఆయనను నియమించే అధీకృత వ్యవస్థ వివేకమేనని సాటి సభ్యులు పి.ఎస్.దేశ్‌ముఖ్ బదులిచ్చారు. రాష్ట్రాల ప్రథమ పౌరులు, వారిని ఎంపిక చేసే దేశ పాలకుల ధర్మదీక్ష పట్ల రాజ్యాంగ నిర్మాతలు పెట్టుకున్న నమ్మకమది. అది వమ్ము కావడానికి ఎంతో కాలం పట్టలేదు. ప్రతిపక్ష ప్రభుత్వాలను ఉరితీసే తలారులుగా గవర్నర్లను కాంగ్రెసే తీర్చిదిద్దింది. 1967లో పశ్చిమ్ బెంగాల్లో అజయ్ ముఖర్జీ సర్కారును బర్తరఫ్ చేసిన ధర్మవీర, 1984లో తెలుగునాట ఎన్టీరామారావును అన్యాయంగా పదవీచ్యుతుణ్ని చేసిన రామ్‌లాల్, అదే ఏడాది సిక్కిమ్‌లో నర్ బహాదూర్ భండారి ఏలుబడికి చెల్లుచీటీ రాసిన హోమీ తలెయర్ఖాన్ల నుంచి 2005లో బిహార్‌లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన బూటాసింగ్ వరకు అందరూ ‘హస్తం’ పార్టీ అంతేవాసులే. గవర్నర్ల నియామకాలపై కేంద్రం గుత్తాధిపత్యాన్ని ప్రశ్నించి, అంతర్రాష్ట్ర మండలికి ఆ అధికారాన్ని దఖలుపరచాలని లోగడ గళమెత్తిన భాజపా హయాములో పరిస్థితి ఏమైనా మారిందా? ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో గవర్నర్ల నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. సమర్థత, సచ్ఛీలతలతో సంబంధం లేకుండా... విధేయతే ఏకైక అర్హతగా మాజీ ముఖ్యమంత్రులు, పార్టీల నేతలు, అనుంగు మాజీ అధికారులను రాష్ట్రాలకు ప్రథమ పౌరులుగా పంపడంలో అన్ని పార్టీలదీ అదే వరస... సంవిధాన సూత్రాలకు మంటపెట్టడంలో వాటన్నింటిదీ ఒకటే విధ్వంసక పంథా! పదవులు దక్కని నేతలను బుజ్జగించడానికి, వయోధిక నేతాగణాలకు రాజకీయ చరమాంకంలో కొత్త విడిది కల్పించడానికి రాజ్భవన్లను కేంద్ర అధికార పక్షాలు మహబాగా ఉపయోగించుకుంటున్నాయి. వాటి దుర్విధానాలే గవర్నర్ల వ్యవస్థను జనస్వామ్యానికి శత్రుశిబిరంగా మార్చేశాయి!
తమిళనాడులో 1990-91లో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయాలన్న కేంద్రం నిర్దేశాన్ని రాష్ట్ర గవర్నర్‌గా సుర్జిత్ సింగ్ బర్నాలా నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. తమకు తలొగ్గనందుకు ఉన్నపళంగా బిహార్‌కు బదిలీ చేస్తే, పదవికి రాజీనామా ఇచ్చేసి తన ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నారు. అటువంటి ప్రజాస్వామ్య హితైషులు నిర్వర్తించిన ఉన్నత బాధ్యతల్లోకి- అంజనం వేసి చూసినా నైతిక నిష్ఠ అంటూ ఏదీ కనపడనివాళ్ల్లు జొరబడ్డారు. అక్రమ లైంగిక వ్యవహారాల్లో తలమునకలైన వ్యక్తిత్వ హీనులుగా పరువుమాసి, అవినీతి ఆరోపణల్లో మునిగి గతిలేక రాజీనామాలు చేసినవారూ ఉన్నారు. ప్రజాసమూహాల నడుమ విద్వేషాగ్నులు ఎగదోసే, బేషరమ్‌గా రాజకీయాలు మాట్లాడే పెద్దమనుషులూ కొన్నేళ్లుగా ఆ కుర్చీలు ఎక్కుతున్నారు. కశ్మీరీ ప్రజలను ఆర్థికంగా బహిష్కరించే కుటిల ఆలోచనలకు మేఘాలయ గవర్నర్‌గా తథాగత రాయ్ మూడేళ్ల క్రితం మద్దతు పలికారు. ‘మేమందరం భాజపా కార్యకర్తలం. పార్టీ మళ్ళీ గెలవాలని కోరుకుంటున్నా’మంటూ రాజస్థాన్ గవర్నర్‌గా కల్యాణ్ సింగ్ గత సార్వత్రిక ఎన్నికలకు ముందు బహిరంగంగా ఢంకా బజాయించారు. రాష్ట్రంలో పాలన రాజ్యాంగబద్ధంగా సాగేలా చూడాల్సిన పదవిలో ఉంటూ ఎన్నికల నిబంధనావళిని ఆయన గంగలో కలిపారు. కేరళ, పశ్చిమ్ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో సర్కార్లపై ప్రస్తుత గవర్నర్లు ఒంటికాలిపై లేస్తున్నారు. నిష్పాక్షికతకు నిర్లజ్జగా నీళ్లొదులుతూ, ప్రజలు ఎన్నుకున్న పాలకుల కాళ్లలో కట్టెలు పెట్టడానికి శతథా ప్రయత్నిస్తున్నారు!
గవర్నర్ అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కాదని గతంలోనే పేర్కొన్న సుప్రీంకోర్టు- ఆ పదవిని రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర వ్యవస్థగా ఉద్ఘాటించింది. రాజ్భవన్లు రాజకీయ పార్టీల అదనపు కార్యాలయాలు కాకూడదనీ ఆకాంక్షించింది. కేంద్రం కోసం కేంద్రం చేత గవర్నర్లుగా నియుక్తులయ్యే విధానంతో న్యాయపాలిక హితోక్తులన్నీ మట్టిపాలవుతున్నాయి. రాష్ట్రాలను సంప్రదించిన తరవాతే గవర్నర్లను నియమించాలని జవహర్లాల్ నెహ్రూ, టీటీ కృష్ణమాచారి, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ వంటివారు ఏనాడో ఉద్బోధించారు. సమకాలీన భారతంలో ఆ సూచనను మన్నిస్తున్న పార్టీలే లేవు. అసలు రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులనే ఆ పదవికి ఎంపిక చేయాలన్న ఎన్నో సంఘాల సిఫార్సులూ సంవత్సరాలుగా చెదలు పట్టిపోతున్నాయి. భారతదేశం రాష్ట్రాల సమాహారమన్నది సంవిధాన నిర్వచనం. వాస్తవంలో ఆ స్ఫూర్తి పరిఢవిల్లాలంటే- గవర్నర్లు కేంద్ర పాలకుల కీలుబొమ్మలు కాకూడదు. ఆ మేరకు నియామక పద్ధతి సాకల్య ప్రక్షాళనతోనే అది సాధ్యం. ప్రజాస్వామ్యానికి ప్రథమ సేవకులుగా తమను తాము గొప్పగా అభివర్ణించుకునే నేతాగణాలు అందుకు అడుగు ముందుకు వేస్తాయా?
- శైలేష్ నిమ్మగడ్డ