
క్రీడలు
దిల్లీ: ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో భాగంగా యూరోపియన్ అంచె మ్యాచ్‌ల్లో తలపడే భారత జట్టును శనివారం హాకీ ఇండియా ప్రకటించింది. 24 మంది సభ్యుల జట్టుకు గోల్‌కీపర్ సవిత పునియానే కెప్టెన్‌గా కొనసాగనుంది. జులై 1న స్పెయిన్‌లో ఆరంభమయ్యే మహిళల హాకీ ప్రపంచకప్‌నకు ముందు ఈ ఐరోపా పర్యటనలో భారత్ వచ్చే నెల 11 నుంచి 22 వరకు ఆరు మ్యాచ్‌లాడనుంది. బెల్జియం (జూన్ 11, 12వ తేదీల్లో), అర్జెంటీనా (18, 19), యుఎస్ఏ (21, 22)తో జట్టు తలపడుతుంది. గాయం నుంచి కోలుకున్న రాణి రాంపాల్ ఈ పర్యటనలో ఆడే అవకాశం ఉన్నప్పటికీ సారథి పగ్గాలు సవితకే కట్టబెట్టారు. సుదీర్ఘ కాలంగా ఇబ్బంది పెట్టిన తొడ కండరాల గాయం నుంచి కోలుకున్న రాణి.. నెదర్లాండ్స్‌తో భువనేశ్వర్‌లో జరిగిన ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ మ్యాచ్‌లకు జట్టుకు ఎంపికైంది. కానీ మైదానంలో దిగలేదు. మరోవైపు అనుభవజ్ఞురాలైన డిఫెండర్ దీప్ గ్రేస్ ఎక్కా వైస్‌కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. జూనియర్ ప్రపంచకప్‌లో మెరిసిన బిచూ దేవి, ఇషిక, అక్షత, బల్జీత్ కౌర్, సంగీత కుమారి, దీపిక లాంటి క్రీడాకారిణులకు సీనియర్ జట్టులో చోటు దక్కింది. ఆంధ్ర అమ్మాయి ఎతిమరపు రజనీతో పాటు మహిమ చౌదరీ, రాజ్విందర్ కౌర్ స్టాండ్‌బైలుగా ఎంపికయ్యారు. వచ్చే నెల 4, 5 తేదీల్లో స్విట్జర్లాండ్‌లో జరిగే ఎఫ్ఐహెచ్ తొలి మహిళల హాకీ 5 (5×5) టోర్నీలో తలపడే భారత జట్టుకు కెప్టెన్‌గా రజనీ, వైస్ కెప్టెన్‌గా మహిమ ఎంపికైన సంగతి తెలిసిందే.