
క్రైమ్
వైకాపా ఎమ్మెల్సీ మాజీ డ్రైవరు మృతిపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి
తిరుపతి (నేరవిభాగం), న్యూస్‌టుడే: ‘వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ మాజీ డ్రైవరు సుబ్రహ్మణ్యం అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కేసు నమోదు చేశాం.. మృతుడి శరీరంపై ఉన్న గాయాలు, ఘటన జరిగిన తీరుపై పోలీసుల దర్యాప్తు సాగుతోంది.. పోస్టుమార్టం, వైద్య నివేదికలు అందిన తర్వాత పూర్తిస్థాయి విచారణ చేపట్టి త్వరగా పూర్తి చేస్తాం’ అని రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. తిరుపతి ఎస్వీయూ సెనేట్హాల్లో తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో నేరాల నియంత్రణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకర్లతో డీజీపీ మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో రోడ్డు ప్రమాద మరణాలు గతంలో మాదిరిగానే ప్రస్తుత త్రైమాసికంలో నమోదయ్యాయి. హత్యలు, వరకట్న మరణాలు, అత్యాచారాల సంఖ్య గతం కంటే తగ్గింది. మాజీ మంత్రి నారాయణ కేసులో సమన్వయం చేయలేని ఒకరిపై చర్యలు తీసుకున్నాం.తిరుపతి-చిత్తూరు సరిహద్దుల్లో మూతపడ్డ చెక్‌పోస్టులను ప్రారంభించేందుకు చర్చిస్తాం’ అని డీజీపీ తెలిపారు. ఈ సమావేశంలో అనంతపురం డీఐజీ రవిప్రకాష్, తిరుపతి, చిత్తూరు జిల్లాల ఎస్పీలు పరమేశ్వరరెడ్డి, రిషాంత్ రెడ్డి పాల్గొన్నారు.