
క్రైమ్
నీరజ్ పన్వర్ హత్య కేసులో నలుగురి అరెస్టు
సంజన పెదనాన్న కుమారుడు అభినందన్ సూత్రధారి
ఈనాడు, హైదరాబాద్: బేగంబజార్‌లో పల్లీల వ్యాపారి నీరజ్ పన్వర్(20) హత్యకేసును పోలీసులు ఛేదించారు. తమ అమ్మాయిని కులాంతర వివాహం చేసుకుని.. కళ్లెదురుగా కనిపిస్తున్నాడన్న కసితో నీరజ్‌ను అతడి భార్య సంజన బంధువులు దారుణంగా చంపినట్లు సాక్ష్యాధారాలు సేకరించారు. పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్ శనివారం విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. సంజన పెదనాన్న కుమారుడు అభినందన్ యాదవ్.. నీరజ్ హత్యకు సూత్రధారిగా వ్యవహరించాడని, ఆమె మేనమామ కుమారుడు విజయ్ యాదవ్, మరో పెదనాన్న కుమారుడు సంజయ్ యాదవ్, అతడి స్నేహితుడు రోహిత్ యాదవ్, మహేశ్ యాదవ్‌తో పాటు ఓ బాలుడు హత్యోదంతంలో పాల్గొన్నారని డీసీపీ వివరించారు. అభినందన్, మహేశ్‌లు పారిపోగా.. నలుగురిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.
కొద్ది రోజులుగా దుకాణానికి వస్తుండడంతో..
బేగంబజార్‌లోని కోల్సావాడీలో నివసిస్తున్న నీరజ్, సంజన షాహినాయత్‌గంజ్‌లోని సాయిబాబా దేవాలయంలో 2014 ఏప్రిల్ 13న ప్రేమ వివాహం చేసుకున్నారు. పోలీసుల సూచన మేరకు నీరజ్, సంజన ఫలక్‌నుమా ఠాణా పరిధిలోని షంషీర్‌గంజ్‌లో నివసిస్తున్నారు. ఏడాదిపాటు సంజన ఇంటి పరిసరాలకు వారు వెళ్లలేదు. కొద్దిరోజులుగా కోల్సావాడీలోని తమ పల్లీల దుకాణానికి వస్తున్నారు. నిందితులు విజయ్, అభినందన్లకు రోజూ నీరజ్ కనిపిస్తుంటే.. కక్షతో నీరజ్‌ను చంపాలని నిర్ణయించుకున్నారు.
మూడు రోజుల నుంచి నీరజ్ వెన్నంటే...
నీరజ్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్న విజయ్, అభినందన్.. తమ స్నేహితులను కూడగట్టారు. జుమ్మేరాత్ బజార్లో మూడు రోజుల కిందట రెండు కత్తులు కొన్నారు. అప్పటి నుంచి నీరజ్ కదలికలను గమనించారు. శుక్రవారం సాయంత్రం మద్యం తాగారు. రాత్రి ఏడు గంటలకు పల్లీల దుకాణానికి వచ్చిన నీరజ్... తన తాతను వెంటబెట్టుకుని ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. వారు బేగంబజార్ నుంచి మచ్చిగల్లీ మీదుగా వెళ్తుండగా నిందితులు ద్విచక్ర వాహనాలపై అనుసరించారు. యాదగిరి గల్లీ వద్దకు చేరుకోగానే.. అభినందన్ ముందుకు వెళ్లి నీరజ్‌ను అడ్డుకుని అతడిని కింద పడేశాడు. మిగిలిన నిందితులు అతడిపై దాడి చేశారు. సంజయ్ బండరాతితో తలపై మోదాడు. ఆరుగురూ కలిసి నీరజ్‌ను కత్తులతో పొడిచి పారిపోయారు. తీవ్రగాయాలతో ఉన్న నీరజ్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా.. అదేరోజు రాత్రి మరణించాడు. నిందితులు కర్ణాటక పారిపోయారు. ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. వారిని అదుపులోకి తీసుకున్నామని డీసీపీ తెలిపారు. ఇది పరువు హత్య కాదని.. ప్రసార మాధ్యమాలు గమనించాలని ఆయన స్పష్టం చేశారు.