ఆదివార అనుబంధం

Facebook Share Twitter Share Comments Telegram Share

ఐరాస మెచ్చిన మన పోచంపల్లి!

ఒకప్పుడు అది గాజుల పోచంపల్లి... తర్వాత ఇకత్‌ పట్టుచీరల ఊరు.. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో దాతృత్వానికి దారి చూపి భూదాన్‌ పోచంపల్లి అయింది.. పడుగూపేకలే జీవితంగా గడిపే ఈ చేనేత కళాకారుల పల్లె తాజాగా ‘ఉత్తమ పర్యటక గ్రామం’గా ప్రపంచపటంపై నిలిచింది! ఐక్యరాజ్యసమితి అవార్డు గెలుచుకున్న పోచంపల్లి ప్రత్యేకతలను చూసొద్దామా మరి..! 

దాదాపు నూట ఇరవైఏళ్ల క్రితం సంగతి.హైదరాబాద్‌ నవాబ్‌ మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ ఇల్లు పెళ్లిసందడితో కళకళ లాడుతోంది. మరికొద్దిరోజుల్లో జరగనున్న నవాబు కుమార్తె వివాహ ఏర్పాట్లలో అందరూ తలమునకలుగా ఉన్నారు. అంతఃపుర స్త్రీలలో మాత్రం కొంచెం ఆందోళన.. ఇంకా వధువుకి గాజులు తయారవలేదు. బంధువర్గంలోని స్త్రీలంతా చార్మినార్‌ దగ్గర లాడ్‌ బజార్‌లో తమకు ఎలా కావాలో చెప్పి చేయించుకుంటున్నారు. కానీ, వధువు అలా బయటకు వెళ్లకూడదు. అందుకే వారి ఆందోళన..

అంతలో అటుగా వచ్చిన మంత్రి వారి సందేహాన్ని తీర్చాడు. ‘గాజులు తయారు చేసేవాళ్లు బయల్దేరారు. సాయంత్రానికల్లా ఇక్కడికి చేరుకుంటారు. వారం రోజులు వాళ్లు పూర్తిగా అదే పనిలో ఉంటారు, కంగారుపడకండి’ అని చెప్పి వెళ్లిపోయాడాయన. అంతఃపుర స్త్రీల ఆనందానికి అవధుల్లేవు. ఆ కళాకారులు... పోచంపల్లి నుంచి వస్తున్నారు మరి. లాడ్‌బజార్‌లో తయారుచేసేలాంటి లక్క గాజుల్నే ఇంకా అందంగా, నాణ్యంగా మహిళలు మెచ్చేలా చేసిపెట్టగల కళాకారులు పోచంపల్లిలో ఉండేవారట. పెళ్లికూతుళ్ల కోసం ప్రత్యేకంగా గాజులు తయారుచేయడంలో వాళ్లకి వాళ్లే సాటి అని ఆరోజుల్లో పెద్ద పేరట. అందుకే, అప్పుడది... గాజుల పోచంపల్లి.   

ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ కాలంలోనూ ఆ వారసత్వం కొనసాగింది. పోచంపల్లిలో తయారైన గాజులూ, మృదువైన పలుచని తేలియా రుమాళ్లూ, రంగురంగుల పూసల గొలుసులూ విదేశాలకు కూడా ఎగుమతి అయ్యేవట.

ఆ నవాబుల దగ్గర మంత్రిగా ఉన్న సాలార్‌జంగ్‌ ఈ గ్రామస్థుల నైపుణ్యాలను గుర్తించాడు. వారు ఏ కళలోనైనా రాణించగలరనే ఉద్దేశంతోనే వస్త్రాలకు రంగులద్దే పరిశ్రమను ఇక్కడ ప్రారంభించారని పెద్దలు చెబుతారు. స్థానికులు దాన్ని ‘చిటికి’ పరిశ్రమ అనేవారు. హైదరాబాద్‌ నగరానికి దగ్గరగా ఉండడమూ మూసీ నది పరివాహక ప్రాంతం కావడమూ పోచంపల్లికి బాగా కలిసొచ్చింది. తన ప్రత్యేకతలతో మొదటి నుంచీ ఈ ఊరు పాలకుల ఆదరణ చూరగొంటూనే ఉందంటారు స్థానికులు. 

వందేళ్లు తిరిగేసరికల్లా... గాజుల పోచంపల్లి పట్టుచీరల పోచంపల్లి అయిపోయింది. భాగ్యనగరానికి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న ఈ ఊరు ఇప్పుడు పట్టుచీరలకు మారుపేరు. అందుకే దానికి ‘సిల్క్‌ సిటీ ఆఫ్‌ ఇండియా’ అన్న పేరొచ్చింది. కంచి, ధర్మవరం... ఇలా ఎన్నో పట్టణాలు పట్టుచీరలకు పేరొందినా వాటికి వేటికీ రాని పేరు ఈ ఊరికే రావడానికి కారణం ఉంది. ఇక్కడ దొరికేవి ‘ఇకత్‌’ చీరలు. చీరలమీద పువ్వులూ లతలూ కాకుండా వైవిధ్యంగా ఉండే జియోగ్రాఫిక్‌ డిజైన్లను నేయడం, రంగుల్లో అవి కొట్టొచ్చినట్లు కనపడుతూనే అంచులు మాత్రం మసక మసగ్గా అలా వస్త్రంలో కలిసిపోతూ ఒకలాంటి వింత అందాన్నివ్వడం... ఆ ఇకత్‌ నేత ప్రత్యేకత. పెళ్లిలో వధువు కట్టుకుంటే అందంగానూ, బోర్డ్‌రూమ్‌లో మీటింగ్‌కి హాజరయ్యే వనిత కట్టుకుంటే హుందాగానూ కన్పించే చీర... పోచంపల్లి చీర. అందుకే వాటికి అంతపేరు. అదొక్కటే కాదు, చారిత్రకంగానూ ఈ ఊరికి సంబంధించి మరో విశేషం ఉంది. కాబట్టే మిగతా వాటిని తోసిరాజని ప్రపంచ పర్యటక గ్రామంగా మరో నాలుగు రోజుల్లో స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో అవార్డు అందుకోబోతున్న వేళ... నాటి, నేటి పోచంపల్లి విశేషాలు.

అలా మొదలైంది!

‘ఇకత్‌’ అనగానే మనకి ఇప్పుడు పోచంపల్లి గుర్తొస్తుంది కానీ నిజానికి ఇది ఇండొనేషియా నుంచి వచ్చిన కళ. సాధారణంగా వస్త్రాన్ని నేసిన తర్వాత రంగులద్ది డిజైన్లు వచ్చేలా చేస్తారు. అలా కాకుండా ‘టై అండ్‌ డై’ విధానం ద్వారా దారాలకే రంగులద్ది వాటితో డిజైన్‌ వచ్చేలా నేయడమే ఇకత్‌ శైలి. ఇలా నేయడానికి ఎంతో నైపుణ్యం కావాలి. వస్త్రం మీద డిజైన్‌ ఎక్కడ రావాలో ఊహించుకుని దానికి తగినట్లుగా దారానికి రంగులద్దడం అనుభవంతోనే సాధ్యం. వస్త్రం నేతలో వాడే పడుగూ పేకల్లో ఏదో ఒక దానికి మాత్రమే వేర్వేరు రంగులద్దుతారు. ఇంకొకదానికి పూర్తిగా ఒకే రంగు ఉంటుంది. అందుకే ఇకత్‌లో మొదట రెండు మూడు రంగులే కన్పించేవి. ఇప్పుడిప్పుడు ఎక్కువ రంగులతో డిజైన్లు వచ్చేలా నేస్తున్నారు. మనదేశంలో పోచంపల్లిలోనూ ఒడిశాలోనూ గుజరాత్‌లోనూ మాత్రమే ఇకత్‌ విధానంలో రంగులద్ది వస్త్రాలను నేస్తారు. పోచంపల్లి, ఒడిశాలలో కనిపించేది మామూలు ఇకత్‌. అంటే అవసరాన్ని బట్టి పొడవులోనో, వెడల్పులోనో మాత్రమే రంగులద్దిన దారాలను వాడతారు. అదే గుజరాత్‌లో నేసే పటోలా చీరల్ని ‘డబుల్‌ ఇకత్‌’ విధానంలో నేస్తారు. పడుగూ పేకా రెండిటికీ రంగులద్ది నేసే విధానాన్ని ‘డబుల్‌ ఇకత్‌’ అంటారు.

ఇండొనేషియా నుంచి ఈ కళ ఎప్పుడు మన దేశానికి వచ్చిందో తెలియదు కానీ దీనికి ఇక్కడి నేతగాళ్ల పనితనం తోడవడంతో బంగారానికి తావి అబ్బినట్లయింది. కాంతులీనే మేలిమి పట్టు వస్త్రంపై ఇకత్‌ రంగుల నేత అద్భుతమైన అందాలను సంతరించుకుంది. అంత అపురూపంగా ఉండేది కాబట్టే ‘సిల్క్‌ రూట్‌’ వ్యాపారం ఒక వెలుగు వెలిగిన కాలంలో ఇకత్‌ వస్త్రాన్నే కరెన్సీగా ఉపయోగించేవారట. మనదేశంలో తయారైన ఇకత్‌ వస్త్రం క్రీస్తు పూర్వం నాటి ఫారో రాజుల సమాధులపై కన్పించినట్లు చరిత్ర చెబుతోంది. అంత పురాతనమైన ఈ కళ పోచంపల్లి ఎలా చేరిందో ఎన్ని తరాలుగా వాడుకలో ఉందో ఎవరికీ తెలియదు. నిజాం నవాబుల కాలంలో ఇది విదేశీయుల దృష్టిలో పడింది. దేశ విదేశాలనుంచి వచ్చిన ప్రముఖులకు బహుమతులుగా ఇకత్‌ పట్టు వస్త్రాలు విశేష ప్రాధాన్యం సంతరించుకుని క్రమేణా ఎగుమతుల్లోనూ స్థానం పొందాయి. కేవలం పట్టుచీరలనే కాక ఇకత్‌ నేతతో నూలు వస్త్రాన్నీ నేసి దాన్ని దుస్తుల నుంచి ఫర్నిషింగ్‌ వరకూ రకరకాల ప్రయోజనాలకు వినియోగించడంతో అది ఇప్పుడు సాధారణ ప్రజలకూ చేరువైంది.

జీఐ గుర్తింపు

ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ పోచంపల్లి పట్టుచీరలకూ ఇతర వస్త్రాలకూ ప్రత్యేక గుర్తింపూ ఆదరణా ఉన్నాయని గుర్తించిన ప్రభుత్వాలు గత పాతికేళ్లుగా ఇక్కడి నేత పరిశ్రమను అభివృద్ధి చేసి కార్మికులకు ఉపాధి భద్రత కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. కార్మికుల పిల్లలు కార్మికులుగానే మిగిలిపోకుండా వారికి నచ్చిన రంగాల్లో శిక్షణ పొందేందుకు వీలు కల్పిస్తూ నాటి ప్రధాని పీవీ నరసింహారావు స్వామి రామానందతీర్థ పేరుతో 1996లో ఇక్కడ గ్రామీణ శిక్షణ సంస్థను ఏర్పాటుచేశారు. దేశంలో తొలిసారిగా వంద ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏర్పాటైన ఈ సంస్థ దాదాపు 25 అంశాల్లో శిక్షణ ఇస్తూ గ్రామీణ నిరుద్యోగాన్ని రూపుమాపడానికి కృషి చేస్తోంది. 2003లో పోచంపల్లి డిజైన్లకు పేటెంట్‌ కూడా లభించాక ఇక్కడి కార్మికులకు మరింత హుషారు వచ్చింది. ఆ తర్వాత రెండేళ్లకే పోచంపల్లి ఇకత్‌ కళకు జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌(జిఐ) గుర్తింపు సైతం లభించింది.

హైదరాబాద్‌ సందర్శించడానికి వచ్చే పర్యటకులకు పొరుగునే ఉన్న పోచంపల్లి కూడా సందర్శనీయ స్థలమైంది. దాంతో పర్యటక శాఖ ఆధ్వర్యంలో 2008లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రెండెకరాల స్థలంలో గ్రామీణ పర్యటక కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసింది. ఇందులో దశలవారీగా చేనేత వస్త్రాల తయారీని తెలిపేలా మగ్గాలనూ, వస్త్రాలను విక్రయించేందుకు దుకాణ సముదాయాన్నీ, గ్రామీణ కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఆంఫీ థియేటర్‌నూ ఏర్పాటు చేశారు.

ఒకప్పుడు ఎయిర్‌ ఇండియాలో పనిచేసే ఎయిర్‌ హోస్టెస్‌లకు పోచంపల్లి చీరలే యూనిఫామ్‌గా ఉండేవి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, పట్టుచీరలంటే ప్రాణం పెట్టే దక్షిణాది మహిళలకు ఎన్ని పట్టుచీరలున్నా వాటిల్లో ఒక పోచంపల్లి చీరకీ స్థానం తప్పకుండా ఉంటుంది. 

పోచంపల్లి, దాని చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో దాదాపు పదివేల కుటుంబాలు చేనేత వృత్తినే నమ్ముకుని జీవిస్తున్నాయి. కుటుంబంలోని నలుగురు వ్యక్తులు నిరంతరాయంగా 64 గంటలు పనిచేస్తేగానీ ఒక చీర తయారీ పూర్తి కాదు. దారాల కండెలకు ముడులు వేసి రంగులు అద్దడంతో మొదలుపెట్టి చీర పూర్తి అయ్యేవరకూ ప్రతి దశలోనూ కుటుంబసభ్యులందరూ కలిసి పనిచేస్తారు.

ఒక దశలో చేనేతకు సరైన ఆదరణలేక కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడంతో వారికి ఉపాధి భద్రత కల్పించడానికి ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో ఇక్కడ హ్యాండ్లూమ్‌ పార్కును ఏర్పాటుచేసింది. కార్మికులు నేసిన వస్త్రాలను ప్రభుత్వమే విక్రయించేది. క్రమంగా చేనేతలకు ఆదరణ పెరగడంతో ఇప్పుడు నేత కార్మికులు సైతం కొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు. సహకార సంఘాలుగా కొందరూ, వ్యక్తిగతంగా కొందరూ దుకాణాలు ఏర్పాటుచేసుకుని స్థానికంగా విక్రయిస్తున్నారు. దేశ విదేశాలకు ఎగుమతులూ చేస్తున్నారు. పలువురు ఆన్‌లైన్‌లోనూ ఈ విక్రయాలు జరుపుతున్నారు. మారుతున్న వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా డిజైన్లలోనూ మార్పులు తెస్తున్నారు. ఇంటివద్దే పనిచేసుకుంటూ నెలకు రూ.40 వేలకు తక్కువ కాకుండా ఆదాయాన్ని పొందగలుగుతున్నారు. అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, ఆస్త్ల్రేలియా, సింగపూర్‌ వంటి దేశాలకు పోచంపల్లి వస్త్రాలు ఎగుమతి అవుతున్నాయి. ఇక్కడ జరిగే నేత పనిని కళ్లారా చూసి కార్మికుల నుంచీ నేరుగా చీరలను కొనుక్కోవాలనుకునే పర్యటకులకు తోడు ఈ పరిశ్రమపై అధ్యయనం చేయడానికి వివిధ విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులు కూడా తరచూ పోచంపల్లిని సందర్శిస్తుంటారు. 

భూదానానికి శ్రీకారం 

ఇక, చరిత్ర విషయానికి వస్తే- బ్రిటిష్‌ పాలకులు తెచ్చిన భూ సంస్కరణలూ, మోపిన పన్నులూ కలిసి దేశంలో ఎందరో బడుగు రైతులను భూములు కోల్పోయేలా చేశాయి. దాంతో భూస్వాములూ జమీందార్ల వద్ద వందలూ వేల ఎకరాల భూములు పడి ఉండేవి. పనిచేసే రైతుల దగ్గరేమో సెంటు భూమి కూడా ఉండేది కాదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో పరిస్థితి ఇది..! దాంతో దేశ నాయకులంతా ఆలోచనలో పడ్డారు. జమీందారీల రద్దు గురించి చర్చలు జరుగుతున్నాయి. తాము సాగు చేయని భూమిని భూస్వాములు చిన్న చిన్న కమతాలుగా పేదలకు పంచాలనీ, వారు దాని మీద యాజమాన్య హక్కులు ఆశించకుండా సాగు మాత్రం చేసుకుని బతకడానికి కావలసిన ధాన్యం పండించుకోవచ్చనీ చెబుతూ కొన్ని రాష్ట్రాలు భూదాన చట్టాలను తెచ్చాయి. భూదానానికి భూస్వాములను ఒప్పించడానికి వినోబా భావే లాంటి నాయకులు దేశవ్యాప్తంగా పర్యటించడం మొదలెట్టారు కానీ ఫలితం లేకపోయింది. ఆ పర్యటనలో భాగంగానే 1951 ఏప్రిల్‌ 18న వినోబా పోచంపల్లి చేరుకున్నారు. ఊళ్లో దాదాపు 700 కుటుంబాలుంటే అందులో మూడింట రెండొంతులు భూమిలేనివారే. ఊరంతా తిరుగుతూ మధ్యాహ్నానికి హరిజన కాలనీకి చేరిన భావేని అక్కడివారు చుట్టుముట్టారు. ఎనభై ఎకరాలు ప్రభుత్వ భూమి ఇప్పించగలిగితే తలా రెండెకరాలూ సాగు చేసుకుని తమ నలభై కుటుంబాలూ బతికి బట్టకడతాయని ఆయనకు విన్నవించుకున్నారు. ‘ఆ మాత్రం భూమిని ఇవ్వగల పెద్ద మనసున్న భూస్వాములే ఇక్కడ లేరా’ అని ప్రశ్నించారు వినోబా. అన్నిచోట్లా లాగానే ఇక్కడా అందరూ తల వంచుకుని ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోతారేమోనని మనసులో ఆందోళన చెందుతూనే చుట్టూ పరికించి చూశారు. అప్పుడు గ్రామానికి చెందిన వెదిరె రామచంద్రారెడ్డి ‘నేనున్నా’నంటూ ముందుకొచ్చారు. అప్పటికప్పుడు తనకున్న మూడున్నర వేల ఎకరాల నుంచి వంద ఎకరాలను దానమిస్తున్నట్లు కాగితం రాసిచ్చారు. ఆ తర్వాత మరో 800 ఎకరాలనూ ఇచ్చేశారు. వినోబా ఆనందానికి అవధుల్లేవు. ఆ సంఘటనతో దేశవ్యాప్తంగా భూదాన ఉద్యమం ఊపందుకుంది. ఏకంగా 40 లక్షలకు పైగా ఎకరాలను భూమిలేని పేదలకు పంచి చరిత్ర సృష్టించింది. అలా భూదాన ఉద్యమానికి తొలి దానాన్ని ఇచ్చిన ఈ నేల భూదాన్‌ పోచంపల్లి అయింది. 

అదండీ... పోచంపల్లి కథ 

స్వతంత్ర దేశంలో ఒక మంచి సంఘటనకి శ్రీకారం చుట్టి అటు చారిత్రకంగానూ... అందమైన పట్టుచీరలను అందిస్తూ ఇటు సాంస్కృతికంగానూ తనదైన ప్రత్యేకతని కలిగివున్న పోచంపల్లిని చూసొద్దాం పదండి మరి..!  


ఆ రెండూ కూడా ప్రత్యేకమే!

ప్రపంచ ఉత్తమ పర్యటక గ్రామం పోటీకి మనదేశం మొత్తం మూడు గ్రామాలను నామినేట్‌ చేయగా పోచంపల్లి విజేతగా నిలిచింది. దాంతో పోటీపడిన రెండు గ్రామాలూ... లాడ్‌పురా ఖాస్‌, కాంగ్‌తాంగ్‌. మధ్యప్రదేశ్‌లోని టీకంగఢ్‌ జిల్లాలో ఉన్న పర్యటక పట్టణం ఓర్చాకి దగ్గరగా ఉంటుంది లాడ్‌పురా ఖాస్‌. చుట్టూ పచ్చని పొలాలున్న ఈ ఊరు హోమ్‌ స్టేస్‌(స్థానికుల ఇళ్లలో పర్యటకులకు ఆతిథ్యం ఇస్తారు)కి పేరొందింది. ప్రశాంత వాతావరణంలో బుందేల్‌ఖండ్‌ కొండ ప్రాంతపు జీవనశైలిని, ఆహారాన్నీ రుచి చూడవచ్చు. గ్రామీణ పర్యటకాన్ని పెంచేందుకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం గత ఏడాదే ప్రత్యేక పథకాన్ని ప్రారంభించి మొత్తం 100 గ్రామాలను పర్యటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతోంది. వాటిల్లో లాడ్‌పురా ఖాస్‌ ఒకటి. మేఘాలయ తూర్పు ఖాసీ కొండల్లోని కాంగ్‌తాంగ్‌ గ్రామాన్ని ‘విజిలింగ్‌ విలేజ్‌(ఈలలు వేసే గ్రామం)’ అంటారు. ప్రపంచంలో ఎక్కడైనా పాపాయి పుట్టగానే అందమైన పేరు పెట్టుకుంటారు అమ్మానాన్నలు. ఈ గ్రామంలో మాత్రం తల్లి తన బిడ్డకు సంగీత స్వరాల కూర్పులా ధ్వనించే ఒక శబ్దాన్ని పేరుగా పెడుతుంది. ఈల వేసినట్లు ధ్వనించే ఆ శబ్దాన్నే అందరూ నేర్చుకుని పిల్లల్ని అలాగే పిలుస్తారు. వాళ్ల మాటలు కూడా చాలావరకూ ఆ ఈల భాషలోనే సాగుతాయి. అందుకే దానికి ‘విజిలింగ్‌ విలేజ్‌’ అన్న పేరు వచ్చింది.


అవార్డు ఎందుకంటే...!

అభివృద్ధి అనేది నగరాలకీ పట్టణాలకే పరిమితం కాకుండా పల్లెలనీ కలుపుకుపోవాలనే లక్ష్యంతో ఏర్పాటుచేసిందే ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యటక సంస్థ వారి ఉత్తమ పర్యటక గ్రామం అవార్డు. ఆధునిక వసతులకు దూరంగా ఉండే పల్లెలకు పర్యటకులు వెళ్లాలంటే ఆయా ప్రాంతాలకు ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. తమ సహజ, చారిత్రక, సాంస్కృతిక, వారసత్వ సంపదని కాపాడే పల్లెలకు అవార్డు ద్వారా గుర్తింపునిచ్చి పర్యటకపరంగా అభివృద్ధి చేస్తే- అటు ఆయా ప్రత్యేకతలను కాపాడి ముందుతరాల వారికి అందించేందుకు అవసరమైన ప్రోత్సాహమూ లభిస్తుంది, ఇటు ప్రజలకు జీవనోపాధీ మెరుగవుతుందన్నది ఈ సంస్థ ఆశయం. పర్యటకం అభివృద్ధి చెందితే సహజంగానే ఆ ప్రాంతం పలురంగాల్లో ప్రగతి సాధిస్తుంది. రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి. స్థానికులకు కొత్త ఉద్యోగాలు దొరుకుతాయి. చిన్న వ్యాపారాలు రాణిస్తాయి. కళాకారులకూ వృత్తి పనివారికీ ఉపాధి లభిస్తుంది.


- జీడిపల్లి దత్తురెడ్డి, ఈనాడు, నల్గొండ, శ్రవణ్‌కుమార్‌, న్యూస్‌టుడే, పోచంపల్లి

ఫోటోలు: కాసోళ్ల శ్రీనివాస్‌


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.