ఆదివార అనుబంధం

Facebook Share Twitter Share Comments Telegram Share

మనం వాడినవి.. వారికి ఇవ్వచ్చు!

మనకు ఉపయోగపడని వస్తువును అవసరమైనవారికి ఇచ్చే పెద్ద మనసు కొందరికే ఉంటుంది. అలాంటివాళ్లనుంచీ ఆ వస్తువుల్ని సేకరించి కావాల్సిన వాళ్లకు ఇస్తున్నాయి ఈ సంస్థలు. అలా ఇచ్చే వాటిల్లో దుస్తులూ, సైకిళ్లూ, పుస్తకాలూ... వంటివి ఉండటం విశేషం.


ఈ క్లాత్స్‌బ్యాంక్‌... పేదవాళ్ల షోరూం

కోవిడ్‌ కారణంగా చిన్నాచితకా ఉద్యోగాలు చేసేవాళ్లలో చాలామంది నిరాధారమయ్యారు. అలాంటివాళ్లకు తోచిన సాయం చేయాలనుకున్న వినోద్‌ బృందం  క్లాత్స్‌బ్యాంక్‌ని అందుబాటులోకి తెచ్చింది. అంటే... తెలిసినవాళ్ల నుంచి దుస్తుల్ని సేకరించి వాటిని పేదవాళ్లకు ఒక్క రూపాయికే అమ్ముతారు. అలా వచ్చే డబ్బును కూడా పేదల వైద్యం, విద్యకు ఉపయోగిస్తారు. అసలు వాళ్లకీ ఆలోచన ఎలా వచ్చిందంటే... ‘కాలేజీలో చదువుతున్నప్పుడు నేను, నితిన్‌, విఘ్నేష్‌, మెలిషా నొరోన్హా కలిసి... పాత దుస్తుల్ని సేకరించి పంచేవాళ్లం. ఆ తరువాత చదువుల్లో పడటం, క్రమంగా ఉద్యోగాలు రావడంతో అన్నింటినీ మానేశాం. కొంతకాలం క్రితం ఏదైనా సేవా కార్యక్రమం చేయాలనే ఆలోచన మళ్లీ మా మధ్య చర్చకు రావడంతో అంతా కలిసి బెంగళూరులో ఇమాజిన్‌ పేరుతో
ఓ ట్రస్టును ప్రారంభించి... ఈ క్లాత్స్‌బ్యాంక్‌ను ఏర్పాటు చేశా’ మని వివరిస్తాడు ఐటీ ప్రొఫెషనల్‌గా పనిచేస్తున్న వినోద్‌. ఈ బృందం బాగున్న దుస్తుల్ని మాత్రమే సేకరించి, వయసులవారీగా వేరుచేసి అన్నింటినీ ఓ అపార్ట్‌మెంట్‌లో భద్రపరుస్తుంది. ప్రతి ఆదివారం పేదవాళ్లు ఎవరైనా సరే అక్కడికి వెళ్లి... డ్రెస్‌కు ఓ రూపాయి ఇచ్చి నచ్చినదాన్ని కొనుక్కోవచ్చు. పేదవారి షోరూంగా పిలుస్తున్న ఈ క్లాత్స్‌ బ్యాంక్‌లో చీరలూ, కుర్తాలూ, బ్లాంకెట్లూ, ప్యాంట్లూ, పిల్లల దుస్తులూ... ఇలా అన్నిరకాలూ ఉంటాయి.


పుస్తకాలు సేకరిస్తారు

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద పిల్లలకు కథలూ, ప్రాపంచిక విషయాలకు సంబంధించిన ఇతర పుస్తకాలు దాదాపుగా అందుబాటులో ఉండవు. దిల్లీకి చెందిన గుజారిష్‌ అనే ఎన్జీఓ దీన్ని గుర్తించడంతో ‘బుక్స్‌ ఫర్‌ ఆల్‌’ పేరుతో ఓ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాతల నుంచి అన్నిరకాల పుస్తకాలనూ సేకరించి వాటిని ప్రభుత్వ పాఠశాలలూ, ఎన్జీఓలలో ఉండే పిల్లలకు పంచడమే ఈ కార్యక్రమం ప్రధానోద్దేశం. ‘మేం ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా పదిహేను రాష్ట్రాల్లోని పిల్లలకు లక్షకు పైగా పుస్తకాలను పంచాం. మా దగ్గర పంచతంత్ర కథలూ, జీవిత చరిత్రలూ, సైన్స్‌కు సంబంధించినవీ, పోటీపరీక్షలకు ఉపయోగపడేవీ, పాఠ్యపుస్తకాలూ... ఇలా అన్నిరకాలూ ఉంటాయి. దాతల నుంచీ వాటిని సేకరించి, విభాగాలవారీగా వేరుచేసి ఆ తరువాత ప్రభుత్వ పాఠశాలలూ, ఎన్జీఓలలో పంచుతాం...’ అని చెబుతారు గుజారిష్‌ను ప్రారంభించిన అంకిత్‌ మన్‌చందా. కొన్ని పుస్తకాలను డిజిటల్‌ రూపంలో భద్రపరుస్తున్న బుక్స్‌ ఫర్‌ ఆల్‌ ఆన్‌లైన్‌ ద్వారా చదివే అవకాశాన్నీ కల్పిస్తోంది. అయితే... ఆన్‌లైన్‌ద్వారా చదువుకోవాలనుకునేవారు పుస్తకానికి పది రూపాయల చొప్పున  చెల్లించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమానికి  దాతలే కాదు... వివిధ కార్పొరేట్‌ సంస్థలూ అవసరమైన సాయం చేయడం విశేషం.


ఆ సైకిళ్లు వాళ్లకోసమే..

పిల్లలకు సైకిళ్లు కొనివ్వడం... వాళ్లు పెద్దయ్యేకొద్దీ దాన్ని పక్కన పెట్టేయడం మామూలే. అలా పనికిరాకుండా పడిఉన్న వాటిని అవసరమైన వాళ్లకు ఇవ్వాలనుకున్న ‘హ్యాపీ హైదరాబాద్‌’ అనే సంస్థ ‘ప్రాజెక్ట్‌ దియా’ పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇళ్లల్లో వృథాగా పడి ఉన్న సైకిళ్లను సేకరించి, వాటికి అవసరమైన మరమ్మతులు చేయించి ఆ తరువాత పేపర్లు వేసేవాళ్లకూ, ఇళ్లల్లో పనిచేసే సిబ్బందికీ,  కూలీలకూ, విద్యార్థులకూ పంచడం మొదలుపెట్టింది. ‘పాత పడి ఉన్న సైకిల్‌ను ఎవరైనా పేదవారికి ఇచ్చి ఉపయోగించుకోమంటే... వాళ్లకు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. పైగా దానివల్ల వాళ్లకు ప్రయాణ ఖర్చులు కూడా మిగులుతాయి. ఇలాంటి లాభాలన్నీ ఆలోచించే ఈ ప్రాజెక్ట్‌ దియాను ప్రారంభించాం. సైకిలు ఏ స్థితిలో ఉన్నా సరే.... దానికి మేం అన్నిరకాల రిపేర్లు చేయించి అవసరమైన వారికి పంచుతాం..’ అని చెబుతారు ప్రాజెక్ట్‌ దియా నిర్వాహకులు సంతాన సెల్వన్‌, విష్ణు.


 


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.