ఆదివార అనుబంధం

Facebook Share Twitter Share Comments Telegram Share

ఉద్యోగులు.. నన్ను ఎండీ సీట్లో కూర్చోనివ్వలా!

‘ఇల్లన్నాక వంటగది లేకుండా ఎలా ఉండదో.. వంటిల్లన్నాక ‘ప్రెస్టీజ్‌’ వస్తువు ఒక్కటైనా లేకుండా ఉండదు!’ - ఇదేదో ప్రకటన కాదు. ప్రెస్టీజ్‌ సంస్థ అంతగా మన జీవితంతో పెనవేసుకుపోయింది. ఒకప్పుడు ఉన్నతాదాయ వర్గాలకే పరిమితమైన ప్రెషర్‌ కుకర్‌ని సామాన్య గృహిణుల చెంతకి చేర్చిన ఘనత ఆ సంస్థది! ఇంతటికీ కారణం... టీటీకే గ్రూప్‌ ఛైర్మన్‌ జగన్నాథన్‌ పట్టుదలే! నష్టాల కడలిలో మునిగిపోయిన సంస్థని.. వంట సామగ్రి తయారీలో నంబర్‌ వన్‌గా నిలిపిన ఆయన ఉత్కంఠభరిత ప్రయాణం ఇది..

ఇతకా...న్యూయార్క్‌ రాష్ట్రంలోని ఓ చిన్న టౌన్‌. అక్కడి కార్నెల్‌ వర్సిటీలో నేను పీహెచ్‌డీ చేస్తుండేవాణ్ణి. డాక్టరేట్‌ అయ్యాక వర్సిటీలోనే లెక్చరర్‌గా చేరదామని కలల్లో తేలిపోతూ ఉన్నాను. అప్పుడే అమ్మానాన్నా అమెరికా వచ్చారు. ‘ఊరికే వారం రోజులు సెలవులకని వచ్చాం!’ అని వాళ్లు అంటున్నా... ‘కాదు. ఇంకేదో ఉంది!’ అని నా లోపలేదో చెబుతూ ఉంది. మరో రెండ్రోజుల్లో తిరుగు ప్రయాణం అనగా అమ్మానాన్నా విమానాశ్రయానికి దగ్గర్లో ఉన్న ఓ రెస్టరంట్‌కి నన్ను రమ్మన్నారు. వెళ్లాక... నాన్న నావైపు చూస్తూ ‘నువ్వు అర్జెంటుగా ఇండియా రావాలిరా. వచ్చి మన బిజినెస్‌ని చూసుకోవాలి!’ అన్నారు. ఆ మాట నాకో షాక్‌లా తగిలింది. ఇక అమెరికాలోనే నా జీవితం అని ఊహించుకుంటున్న నా కలలన్నీ కూలిపోతున్నట్టు అనిపించి... ససేమిరా అన్నాను. చివరికి అమ్మ ‘నీకు మేం చెప్పలేదుకానీ మీ అన్నయ్య ‘పప్పూ’(మా అన్నయ్య) పరిస్థితి బాగాలేదురా. పూర్తిగా తాగుడికి బానిసైపోయాడు. తమ్ముడేమో మరీ చిన్నవాడు... నాన్నకా అరవైయేళ్లు వస్తున్నాయ్‌, ఒత్తిడిని భరించలేకపోతున్నారు. అన్నింటికన్నా- కంపెనీ పెద్ద నష్టాల్లో ఉంది’ అని వివరించింది. ‘నాకు బిజినెస్‌ అసలు తెలియదమ్మా..!’ అన్నాన్నేను నిస్సహాయంగా. అమ్మ నా చేతులు పట్టుకుని ‘నువ్వు చేయగలవురా..! కనీసం మనల్ని నమ్ముకున్న ఉద్యోగులూ, వాళ్ల కుటుంబాల గురించైనా ఆలోచించు!’ అంది. ఆరోజే కాదు జీవితంలో ఎప్పుడూ అమ్మ మాట కాదన్నవాణ్ణి కాదు నేను. తన సంతృప్తి కోసం కొంతకాలమైనా అక్కడ ఉండి వద్దామనుకున్నాను. అలా 1972లో నేను భారత్‌కి వస్తుంటే ‘ఫ్రెండ్‌..! నీ బట్టలూ పుస్తకాలూ వదిలేసి వెళుతున్నావేమిటీ?’ అని అడిగారు మా హాస్టల్‌ ఇన్‌ఛార్జ్‌. ‘వాటిని ఉండనివ్వండి. మరో రెండుమూడు నెలల్లో మళ్లీ వచ్చేస్తాను!’ అని చెప్పాను. మూణ్ణెల్లు కాదుకదా... ముప్పైయేళ్లదాకా వెళ్లలేకపోయాను...

మా తాతయ్య టీటీ కృష్ణమాచారి... నెహ్రూ పాలనలో రెండుసార్లు ఆర్థికమంత్రిగా చేశారు. ఆయన స్వాతంత్య్రానికి పూర్వం మద్రాసులో స్థాపించిందే మా ‘టీటీకే అండ్‌ కంపెనీ’. అది పలు విదేశీ సంస్థలకి చెందిన లైఫ్‌బాయ్‌, హార్లిక్స్‌, క్యాడ్‌బరీస్‌ చాక్లెట్లు వంటివాటిని మనదేశంలో అమ్ముతుండేది. ఆ తర్వాత దాని బాధ్యతలు మా నాన్న నరసింహన్‌కి వచ్చాయి. ఆయన విదేశీ సంస్థల భాగస్వామ్యంతో ఇక్కడే ప్రెస్టీజ్‌ ప్రెషర్‌ కుకర్‌లూ, ఫౌంటెయిన్‌ పెన్నుల్లాంటివి ఉత్పత్తి చేస్తుండేవారు. కాకపోతే, కాస్త అతివిశ్వాసానికి పోయి ఇబ్బడిముబ్బడిగా ఫ్యాక్టరీలని పెట్టారు. నష్టాల్లో కూరుకుపోయినా సరే 40 శాతం వడ్డీలకి తెచ్చి మరీ దాదాపు 20 కంపెనీలు నడుపుతుండేవారు. అలా నేను బాధ్యతలు చేపట్టేనాటికి 14 కోట్ల అప్పుంది!


అమ్మకానికి పెట్టాను!

ఆఫీసుకు వెళ్తే- మొదలూ తుదీ ఏమిటో తెలియనంతగా సమస్యల చిక్కుముళ్లు కనిపించాయి నాకు మా గ్రూప్‌ కంపెనీల్లో. పరిస్థితుల్ని నేను చక్కదిద్దలేననే నిర్ణయానికొచ్చి బొంబాయిలో ఏదైనా పెద్ద కంపెనీకి అమ్మేద్దామని ప్రయత్నించాను. ఖాయిలా పడుతున్న కంపెనీలు కదా, ఎవరూ తీసుకోలేదు. దాంతో వీటన్నింటినీ ఎలాగైనా పరిష్కరించాలనే పట్టుదల పెరిగింది. ముందు మా గ్రూప్‌కి చెందిన ‘మ్యాప్స్‌ అండ్‌ అట్లాసెస్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌’పైన నా దృష్టిపడింది. మాకు ఈ సంస్థతో ఏడాదికి రూ.60 లక్షల నష్టం వస్తుండేది. కారణమేంటో చూద్దామని ఆ సంస్థ ప్రింటింగ్‌ ప్రెస్‌కి వెళ్లాను. అప్పట్లోనే అందులో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మెషీన్‌లుండేవి. ఇంతాచేసి... వీటిని ప్రజల్లో అసలు డిమాండులేని మ్యాప్‌ల ప్రింటింగ్‌ కోసం వాడేవారు. ఆ మ్యాప్‌ ఆర్డర్‌లు లేకపోవడంతో మెషీన్‌లతోపాటూ ఉద్యోగులూ నెలల తరబడి ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి! దాన్ని మార్చేద్దామనుకున్నాను. కేవలం మా మ్యాపులే కాకుండా మిగతావాళ్లకి కావాల్సిన ప్రింటింగ్‌ సేవలు అందించడం మొదలుపెట్టాను. సినిమా పోస్టర్‌లూ, పార్టీల కరపత్రాలూ, పాఠ్యపుస్తకాలూ... ఇలా ఏది దొరికితే అది ముద్రించడంతో నష్టాలు తగ్గాయి. ఆ తర్వాత ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పుస్తకాలని భారత్‌లో ముద్రించే అవకాశాన్ని చేజిక్కించుకోవడంతో మా మ్యాప్‌ల సంస్థ లాభాల బాటపట్టింది. నా తొలి విజయం అది! ఈలోపు నాకు లతతో పెళ్ళైంది. హనీమూన్‌కి వెళ్లి చెన్నై విమానాశ్రయంలో దిగగానే... నాన్న హడావుడిగా నా వద్దకొచ్చి చేతిలో బెంగళూరు విమానం టికెట్‌ పెట్టారు. ‘నువ్వు అర్జెంటుగా బెంగళూరు వెళ్లాలి అక్కడున్న ప్రెస్టీజ్‌ కంపెనీ బాధ్యతలు తీసుకోవాలి’ అన్నారు. నేనేదో కీడుశంకిస్తూ ‘ఆ సంస్థ ఎండీ ఉన్నాడుగా!’ అన్నాను. ‘అతణ్ణి తొలగించాల్సి వచ్చింది... ఆలోపే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది!’ అన్నాడు.


కంపెనీలోకి నన్ను వెళ్లనివ్వలేదు!

మాకున్న ఇరవై కంపెనీల్లో ప్రెస్టీజ్‌ కుకర్‌ల సంస్థలోనే కాస్తోకూస్తో లాభాలు వచ్చేవి. ఆ లాభాలని మిగతా నష్టజాతక కంపెనీలకి మళ్ళించి... దీన్ని నాశనం చేస్తున్నామని కంపెనీ పాత ఎండీ కార్మికుల్ని రెచ్చగొట్టాడు. సమ్మెకి దిగేలా చేశాడు. అక్కడికి వెళ్లిన నన్ను కార్మికులు ఫ్యాక్టరీ బయటే నిలిపేశారు. చేసేది లేక పోలీసుల సాయం తీసుకుని లోపలికెళ్లాను. వెళ్లాక కూడా ‘నువ్వు ఛైర్మన్‌ కొడుకువి కావొచ్చుకానీ... మాకు ఎండీవి కాలేవు. నువ్వు ఆ సీట్లో కూర్చుంటే మేం పనిచేయం’ అన్నారు. నేను కోపంతో ఊగిపోతానని అనుకున్నారేమో కానీ... నాకు మాత్రం వాళ్ల అభిప్రాయాన్ని గౌరవించాలనిపించింది. దాంతో ఫ్యాక్టరీ మూలన ఓ టేబుల్‌ వేసుకుని పనిచేయడం మొదలుపెట్టాను. అయినా సరే రెండునెలలు నాతో ఎవ్వరూ మాట్లాడలేదు. అయితే అనుకోకుండా వచ్చిన ఓ సంక్షోభం... వాళ్లకీ నాకూ సంధి కుదిర్చింది. ప్రెషర్‌ కుకర్‌ తయారీకి అల్యూమినియమే ముడిసరకు. దాన్ని కేంద్రప్రభుత్వం కంపెనీలకి కేటాయిస్తుండేది. పాత ఎండీ తప్పుడు నిర్ణయం కారణంగా మాకు చాలా తక్కువ అల్యూమినియం వాటానే దక్కింది. దాంతో మా ముడిసరకు నిండుకుని... పనులు ఆగిపోయాయి. వెంటనే నేను దిల్లీ వెళ్లాను. మా తాతయ్య మాజీ కేంద్రమంత్రయినా సరే... మాకు అల్యూమినియం మోతాదు పెంచడానికి మూడునెలలు వెయిట్‌ చేయించారు. ఆ మూడు నెలలూ కంపెనీ మూతపడినా... సిబ్బంది మొత్తానికీ జీతం ఇచ్చాను. ఇదే మొదటిసారి నాపైన వాళ్లకి నమ్మకాన్నిచ్చింది. ఉత్పత్తులు ప్రారంభమైన రెండేళ్ల తర్వాత... యూనియన్‌ లీడర్‌ నా దగ్గరికొచ్చి ‘మీరు ఎండీ సీట్లోనే కూర్చోండి సార్‌. ఇలా బాగాలేదు...’ అన్నాడు. ఆ ఏడాది నుంచే- దక్షిణాదికే పరిమితమైన మేము... ఉత్తర భారతదేశంవైపు వెళ్లాం.


‘కుకర్‌లు పేలిపోతున్నాయ్‌!’

మా ప్రెషర్‌ కుకర్‌లని ఉత్తరాదిలో పరిచయం చేసిన ఏడాది తర్వాత ‘మీ కుకర్‌లు పేలిపోతున్నాయి’ అంటూ డీలర్‌ల నుంచి ఫిర్యాదులొచ్చాయి. వెళ్లిచూస్తే... నాకు ఓ సమస్య అర్థమైంది. సాధారణంగా- కుకర్‌లోని ప్రెషర్‌ పెరిగి అది ఒక్కసారిగా బయటకొచ్చి పేలిపోకుండా విజిల్‌తో కూడిన వెయిట్‌ వాల్వు, సేఫ్టీ ప్లగ్‌లూ ఉంటాయి. అవి రెండూ పాడైపోతే కొత్తవి కొని వాడాలి. కానీ ఉత్తరాదిలో వాటి నకిలీలు ఎక్కువగా తయారుచేయడం మొదలుపెట్టారు. చౌకగా వస్తున్నాయని ఆ  నకిలీలు వాడిన కుక్కర్లే పేలిపోయాయి! నేనెలాగూ నకిలీలని నియంత్రించలేను కాబట్టి, అటు వెయిట్‌ వాల్వు, సేఫ్టీప్లగ్‌లు పాడైనా ప్రెషర్‌కుకర్‌ పేలకుండా ఏదైనా చేయాలనుకున్నాను. నా ఐఐటీ పరిజ్ఞానాన్నంతా వాడి... ఓ ఉపాయం కనిపెట్టాను. కుకర్‌ మూతలో గ్యాస్కెట్‌ ఉంటుంది కదా... అది కుకర్‌ పొయ్యిమీద ఉన్నంతసేపూ మూతని టైట్‌గా ఉంచుతుంది. అది లేకుంటే ప్రెషర్‌ పెరగదు. కానీ ప్రెషర్‌ బాగా ఎక్కువై పేలడానికి సిద్దమవుతున్న సమయంలో... ఆ గ్యాస్కెట్‌ కాస్త వదులై ఆవిరిపోయే మేరకు మూతకూడా లూజైతే ప్రమాదాన్ని ఆపొచ్చు! ఆపత్కర సమయంలో అలా గ్యాస్కెట్‌ లూజ్‌ కావడానికని మూతలో ఓ చోట చిన్న రంధ్రం పెట్టాను. దానికి గ్యాస్కెట్‌ రిలీజ్‌ సిస్టమ్‌(జీఆర్‌ఎస్‌) అని పేరుపెట్టాను. నకిలీ విడిభాగాలు ఎన్ని వాడినా కుకర్‌ పేలకుండా ఇది కాచుకుంది. అలా ఖాయిలాకి చేరువగా ఉన్న మా గ్రూపు సంస్థల నష్టాలన్నింటినీ జీఆర్‌ఎస్‌ అన్న ఆ చిన్న రంధ్రమే పూడ్చింది! ఆ ఊపులో మేం వేపుళ్లకీ పనికొచ్చే ప్రెషర్‌ ప్యాన్‌నీ, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ కుకర్లనీ పరిచయం చేస్తే పెద్ద హిట్టయ్యాయి. 1991లో టీటీకే ప్రెస్టీజ్‌ని పబ్లిక్‌ ఇష్యూకి తీసుకెళ్తే మదుపర్లు బ్రహ్మరథం పట్టారు. 2000 నాటికల్లా ప్రపంచంలోనే ప్రెషర్‌కుక్కర్‌ల ఉత్పత్తిలో నంబర్‌వన్‌గా నిలిచాం! అంతా బాగుందని అనుకుంటూండగానే...


మళ్లీ దివాలా వైపు!

2001లో నాటి కేంద్ర ప్రభుత్వం ప్రెషర్‌ కుకర్‌లని విలాసవస్తువు కింద చేర్చి 10 శాతంగా ఉన్న పన్నుల్ని 50 శాతానికి పెంచింది. ఆ మేరకు మేమూ ధరలు పెంచాల్సి వచ్చింది. దాంతో అమ్మకాలు పడిపోయాయి. ఇది చాలదన్నట్టు మేమూ ఓ పెద్ద తప్పు చేశాం. ప్రయోగాత్మకంగా స్మార్ట్‌ కుకర్‌లని తెచ్చాం. ఇందులో ఒకేసారి మూడు విభిన్న కూరల్ని ఉడికించొచ్చు. ఆటోమేటిక్‌ లాక్‌ కూడా ఉంటుంది! దీన్ని భారీఎత్తున మార్కెట్‌లోకి తీసుకెళ్లాం కానీ... ఆ స్మార్ట్‌ కుకర్‌లలో ఉండాల్సిన ‘ప్రెషర్‌’ లోపించింది. దాంతో గృహిణులు నిర్దాక్షిణ్యంగా తిప్పికొట్టారు. ధరల పెరుగుదలతో అప్పటికే నష్టాల్లో ఉన్న మా పరిస్థితి మూలిగేనక్కపైన తాటిపండు పడిన చందమైంది. టీటీకే గ్రూపులో ప్రధానమైన ప్రెస్టీజ్‌ దివాలాకి దగ్గరైంది. అది మమ్మల్ని మేం ఆత్మవిమర్శ చేసుకోవడానికీ ఉపయోగపడింది. మొదట్నుంచీ మా సంస్థ ఉత్పత్తుల ధర ఎక్కువ. ప్రతి ఉత్పత్తిపైనా 40 శాతం లాభం చూసుకోవడం ఇందుకు కారణం. ఒకప్పుడు అది సరైన నిర్ణయమే కానీ ఇప్పుడది సరికాదు అనిపించి మార్జిన్‌ని 20 శాతం తగ్గించాం! ఆ చిన్న మార్పు అద్భుతాలే చేసింది. అంతేకాదు, కేవలం ప్రెషర్‌ కుకర్‌కే పరిమితం కాకుండా... ఇతర వంటింటి పరికరాలూ అమ్మడం ప్రారంభించాం. మూడేళ్లకే మా సంస్థ టర్నోవర్‌ వందకోట్ల నుంచి 1300 కోట్ల రూపాయలకి ఎగబాకింది! అలా మొదలై ఇప్పుడు సుమారు రెండువేల కోట్లుంది. ఏడాదికి 20 శాతం అభివృద్ధి అందుకుంటున్నాం. వంటసామగ్రి తయారీలో అతిపెద్ద సంస్థ మాదే! ఒకప్పుడు దివాలా తీసిన మా మార్కెట్‌ క్యాపిటల్‌ 10 వేల కోట్లతో రికార్డు సృష్టిస్తోంది!


అమ్మకి అధికారాన్నిచ్చాను!

నేను ఐఐటీ-మద్రాసులో చదువుకున్నాను. మొదట అక్కడ చేరినప్పుడు ఆ ఒత్తిడి భరించలేక మానేస్తానని మొండికేస్తే... అమ్మే ‘నువ్వు గొప్పగా సాధిస్తావ్‌!’ అని ధైర్యాన్నిచ్చింది. ఆ ధైర్యంతోనే గోల్డ్‌మెడలిస్ట్‌గా బయటకొచ్చాను. అమ్మమాట మీదున్న ఆ గురితోనే 1972లో కంపెనీ బాధ్యతలు తీసుకున్నానని చెప్పాలి. ప్రెస్టీజ్‌ కోసం నేను బెంగళూరుకి మకాం మారేటప్పుడు చెన్నై కంపెనీ బాధ్యతలు అమ్మకే అప్పగించాను. 13 ఏళ్ల వయసులో పెళ్ళై గృహిణిగా ఉండిపోయిన అమ్మకిలా బాధ్యతని అప్పగించడం నాన్నని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. అయితేనేం, అమ్మ తానేమిటో నిరూపించుకుంది. వైస్‌ ఛైర్మన్‌గా సంస్థని 2011దాకా చక్కగా నడిపింది. అమ్మకి ఒకే లక్ష్యం ఉండేది... రూ.14 కోట్ల మేరకున్న మా అప్పుల్ని జీరోకి తేవాలి అని. చాలావరకూ ఆ లక్ష్యాన్ని నేను చేరుకున్నా. చివరిగా, ఓ బ్యాంకుకి ఇవ్వాల్సిన పాతికలక్షలు మిగిలి ఉన్నప్పుడు... మూణ్ణెల్లలో అది తీర్చి అమ్మ చేత శభాష్‌ అనిపించుకుందామని ఉవ్విళ్లూరుతున్నప్పుడు... అమ్మ అకస్మాత్తుగా మాకు దూరమైంది. ఆ రోజు యూరప్‌లో ఉన్నాన్నేను. కుటుంబ సంప్రదాయం మేరకు అదేరోజు అంత్యక్రియలూ జరపడంతో... నాకు చివరి చూపూ దక్కలేదు!


 


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.