ఆదివార అనుబంధం

Facebook Share Twitter Share Comments Telegram Share

అరిచే దీపం.. అమ్మతో ఆటాపాటా


నిద్ర తగ్గితే..!

నిద్ర లేకపోతే కళ్ల కింద నల్ల చారలు వస్తాయనో లేదా నీరసం వస్తుందనో మాత్రమే అనుకునేరు... ఇటీవల కాలంలో నిద్రపోయే సమయానికీ ఆరోగ్య సమస్యలకీ సంబంధం ఉందని అనేక పరిశోధనలు వస్తున్నాయి. రోజూ ఒకేసమయానికి - అదీ రాత్రి పదీ లేదా పదకొండు గంటలకి నిద్రపోయేవాళ్లలో హృద్రోగ సమస్యలు తక్కువ అంటున్నారు ఎక్సెటర్‌ పరిశోధకులు. ఇందుకోసం వీళ్లు షిఫ్టులవారీగా పనిచేసేవాళ్లనీ పగలు పనిచేసి రాత్రివేళ సమయానికి నిద్రపోయేవాళ్లనీ ఎంపికచేసి ట్రాకర్ల ద్వారా వాళ్ల నిద్రావేళల్ని లెక్కించారట. ఆ తరవాత వాళ్ల ఆహారపుటలవాట్లనీ జీవనశైలినీ క్షుణ్ణంగా పరిశీలించారట. ఇలా దాదాపు ఆరేళ్లపాటు వాళ్లని గమనిస్తూ వచ్చారట. అందులో రాత్రిపూట పదీ పదకొండు మధ్యలో నిద్రపోయేవాళ్లతో పోలిస్తే అర్ధరాత్రి వేళ నిద్రలోకి జారుకునే వాళ్లలో 25 శాతం మందికి గుండెజబ్బు వచ్చే ప్రమాదాన్ని గుర్తించారట. మెనోపాజ్‌ తరవాత మహిళల్లో ఎక్కువమందికి గుండె సమస్యలు రావడానికి నిద్రవేళలు తగ్గడం కూడా కారణం కావచ్చు అనీ అభిప్రాయపడుతున్నారు పరిశోధకులు.


అమ్మతో ఆటాపాటా!

ఒడిలో కూర్చోబెట్టుకుని అమ్మ గోరుముద్దలు తినిపించినా పక్కనే పడుకుని కథలు చెప్పినా పిల్లలకి ఎంతో ఆనందం అనేది తెలిసిందే. అయితే తల్లీపిల్లలు కలిసి గడిపే ప్రతి క్షణమూ వాళ్లిద్దరూ ఆడుకునే ఆటలు ఎంతో విలువైనవనీ అవి పిల్లల మానసిక ఆరోగ్యాన్నీ ప్రవర్తననీ ఎంతో ప్రభావితం చేస్తాయనీ అంటున్నారు ఇలినాయ్‌ యూనివర్సిటీ నిపుణులు. ముఖ్యంగా తల్లి పిల్లలతో ఆడుకోవడం వల్ల ఇద్దరి మధ్యా చక్కని సమన్వయం ఏర్పడుతుందట. ఎదిగే క్రమంలో తల్లీ పిల్లలు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి ఈ ఆటలు ఎంతో అవసరమని పేర్కొంటున్నారు. ఇందుకోసం వీళ్లు మూడు నుంచి ఐదేళ్ల వయసున్న వందమంది పిల్లల్నీ వాళ్ల తల్లుల్నీ ఎంపికచేసి ఆడుకునే సమయంలో వాళ్ల నరాల్లో కలిగే మార్పుల్ని వైర్‌లెస్‌ ట్రాకర్ల ద్వారా గమనించారట. నవ్వుతూ తుళ్లుతూ ఆనందంగా వాళ్లిద్దరూ ఆడుకునేటప్పుడు గుండె రేటులోని మార్పుల ద్వారా నాడుల స్పందనని గుర్తించారట. అవన్నీ కూడా నాడీవ్యవస్థను ఆరోగ్యకరంగా ఉంచుతున్నాయనీ ఒత్తిడిని తగ్గించి ఇద్దరిమధ్యా బంధాన్ని మరింత బలపరిచేలా ఒకరికి అనువుగా మరొకరివి ప్రతిస్పందిస్తున్నాయనీ గుర్తించారు. ముఖ్యంగా ఈ ఆటలు భవిష్యత్తులో పిల్లల భావోద్వేగాలూ ప్రవర్తనా సరైన దిశలో ఉండేలా చేస్తాయట. మొత్తానికి ఎదిగే వయసులో ఉన్న పిల్లలతో తల్లులు వీలైనంత ఎక్కువ సమయం ఆటలాడుతూ గడపాలనేది ఈ పరిశోధన సారాంశం.


ఈ ట్యాబ్లెట్‌తో స్వచ్ఛమైన నీరు!

మంచినీళ్లు... అనేవి ప్రస్తుతం ఎక్కడైనాగానీ కాచి లేదా ఫిల్టర్‌ చేసినవైతేనే తాగగలం. కాలుష్యం వల్ల కావచ్చు, సూక్ష్మజీవుల కారణంగా కావచ్చు... బావిలో తోడినవిగానీ నదిలోవిగానీ నేరుగా తాగే పరిస్థితి లేదు. అందుకే ఆస్టిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌కు చెందిన పరిశోధకులు ఓ కొత్త రకం హైడ్రోజెల్‌ ట్యాబ్లెట్‌ను రూపొందించారు. దీన్ని నీటిలో వేయగానే అందులోని సూక్ష్మజీవుల్నీ క్రిముల్నీ నూటికి నూరు శాతం నాశనం చేస్తుందట. అదేసమయంలో వాటి తాలూకు అవశేషాలు కూడా లేకుండా చేయగలదట. అదెలా అంటే- దీన్ని నీటిలో వేయగానే అది నీటి అణువులతో చర్యపొంది హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ను విడుదలచేస్తుంది. అది కాస్తా కర్బన రేణువులతో కలిసి బ్యాక్టీరియా జీవక్రియని దెబ్బతినేలా చేయడం ద్వారా దాన్ని నిర్వీర్యం చేస్తుందట. ఈ పద్ధతిలో నీటి అడుగున వృథా అవశేషాల్లాంటివేమీ ఉండవు. కాబట్టి సోలార్‌ డిస్టిలేషన్‌ వంటి భారీ వడబోత విధానాల్లోనూ దీన్ని వాడవచ్చని చెబుతున్నారు. ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న గ్రాఫీన్‌ ఫిల్టర్లూ, క్లోరినేషన్‌... వంటి ప్రక్రియలతో పోలిస్తే దీనికయ్యే ఖర్చూ తక్కువేనట.


అరిచే దీపం!

పనిలో అలసిపోయి ఇంటికి చేరినవాళ్లకి కాసేపు ప్రశాంతంగా ఉంటే బాగుణ్ణు అనిపిస్తుంది. అయితే ఇంట్లో మనుషులు ఎక్కువగా ఉన్నప్పుడో పిల్లలు ఉన్నప్పుడో ఏదో ఒక శబ్దాలు చేస్తూనే ఉంటారు. నెమ్మదిగా అని ఎన్నిసార్లు చెప్పినా ఓ పట్టాన వినరు. అలాంటి సమయంలో శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకు ఓ దీపాన్ని తయారుచేసింది జర్మనీకి చెందిన ఫ్రానోఫర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఫొటానిక్‌ మైక్రో సిస్టమ్స్‌ అనే సంస్థ. ఈ ఎల్‌ఈడీ ల్యాంపు శబ్దాన్ని బట్టి రంగులు మారుస్తుందట. ఉదాహరణకు గదిలో నిశ్శబ్దంగా ఉంది అనుకుందాం... అప్పుడు ఈ దీపం ఆకుపచ్చ రంగులో మెరుస్తుంది. శబ్దం ఎక్కువవుతూ ఉంటే అది నారింజ వర్ణంలోకి మారుతుంది. ఇంకా పెరిగితే అది ఎరుపు రంగులో ఫ్లాష్‌ కొడుతుంది. అప్పటికీ పిల్లలుగానీ పెద్దవాళ్లుగానీ  స్వరం తగ్గించకపోతే ఆ తరవాతి ఐదు సెకన్లకే అది అలారంలా భరించలేని శబ్దంతో మోగుతుందట. దాంతో ఎక్కడివాళ్లు అక్కడ గప్‌చుప్‌. అయితే శబ్దంతో సంబంధం లేకుండా రంగులవరకూ ఈ దీపాన్ని సెట్‌ చేసుకుని వాడుకునే వీలూ ఉంది అంటున్నారు సంస్థ నిపుణులు.మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.