Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu

ఆదివార అనుబంధం

Facebook Share Twitter Share Comments Telegram Share

స్కార్ఫ్‌... నులి వెచ్చని ఫ్యాషన్‌..!

చలి కాలంలో స్వెట్టరో స్వెట్టర్‌ డ్రెస్సో వేసు కోవడం మామూలే... అయితే దానికన్నా భిన్నంగా మరింత ట్రెండీగా ఉండాలంటే... మెడలో స్కార్ఫ్‌ లేదా స్టోల్‌ ఉంటే చాలు, నులివెచ్చదనంతోనూ స్టైలిష్‌ లుక్‌తోనూ చలికాలాన్ని హాయిగా గడిపేయొచ్చు అంటారు ఫ్యాషన్‌ డిజైనర్లు. అందుకే వాటిల్లోనూ బోలెడు వెరైటీలను రూపొందిస్తూ ఈతరాన్ని అలరిస్తున్నారు..!

పాతకాలంనాటి సినిమాల్లో సిమ్లానో కాశ్మీరో సీన్లోకి వచ్చిదంటే చాలు, హీరో హీరోయిన్లు రంగురంగుల చలికోట్లూ స్కార్ఫ్‌లతో కనిపించేవారు. ఇక, పాశ్చాత్య దేశాల్లో అయితే కాలంతో పనే లేదు, నిత్యం మెడలో స్కార్ఫ్‌ ఉండాల్సిందే. వాళ్లకది తప్పనిసరి యాక్సెసరీ. కానీ ఇప్పుడు మనదగ్గరా అది సర్వసాధారణమైపోయింది. చలీ, ఎండలతోపాటు కాలుష్యం నుంచీ కాపాడే రక్షణ కవచంగా స్కార్ఫ్‌ కొత్త అవతారమెత్తి చాలా కాలమైంది. ఈ లిస్టులోకి సరికొత్తగా కరోనా కూడా చేరింది. హడావుడిలో మాస్క్‌ పెట్టుకోవడం మర్చిపోయినా స్కార్ఫ్‌నే ముక్కు వస్త్రంగానూ కట్టేసుకోవచ్చు. ఇవన్నీ పక్కన పెడితే, అది ఈతరం అమ్మాయిల ఫ్యాషన్‌ ఐకాన్‌ అన్నది మాత్రం నిజం.

ఎన్ని రకాల ముడులో!

సంప్రదాయ చుడీదార్‌, అనార్కలీల స్థానంలో ఇప్పుడు కుర్తీలూ లాంగ్‌ఫ్రాక్‌లు వచ్చి చేరాయి. దాంతో చున్నీలు కాస్త పక్కకు వెళ్లాయి. వాటికి బదులుగా పాతకాలంనాటి స్కార్ఫ్‌కి ఎక్కువా చున్నీకి తక్కువా అన్నట్లు రకరకాల స్కార్ఫ్‌లూ లేదా స్టోల్సూ అమ్మాయిల మెడలో షికార్లు చేస్తున్నాయి. అయితే మెడలో స్కార్ఫ్‌ కట్టేటప్పుడు వేసే ముడిలోగానీ వదులుగా వేలాడదీయడంలోగానీ ఈతరం ఒలకబోసే స్టైల్స్‌ కోకొల్లలు. రెండుమూడు ముడులతో కనిపించే ఫ్రెంచ్‌ నాట్‌ని కొందరు ఇష్టపడితే, వదులుగా తమకు నచ్చినట్లుగా ముడి వేయడమే మాకిష్టం అంటారు మరికొందరు. అసలు ముడీగిడీ ఏమీ వద్దు... హాయిగా మెడ చుట్టూ ఓ చుట్టు తిప్పీ వేసేవాళ్లూ ఉంటారు. అవసరార్థం తలమీద నుంచీ లేదా భుజాలమీదుగా షాల్‌ మాదిరిగానూ కప్పుతారు ఇంకొందరు. ఒక అంచు ముందుకీ మరొక అంచు మెడ చుట్టూ కప్పుతూ వెనక్కీ వేసేవాళ్లూ ఉన్నారు. అందుకే స్కార్ఫ్‌ అంటే ఏదో చిన్నా చితకా వస్త్రం మాత్రమే అనుకుంటే పొరబాటు. అది అనేక ఫ్యాషన్లకు తెర లేపే అందమైన సింబల్‌. అందుకే ఇందులో లినెన్‌, సిల్క్‌, కాటన్‌, ఊలు... ఇలా రక
రకాల ఫ్యాబ్రిక్కులూ వాటితో చేసే వేలకొద్దీ డిజైన్లూ వస్తున్నాయి. పైగా చీర, కుర్తీ, టీషర్టు... ఇలా అన్ని రకాల డ్రెస్సులకీ మ్యాచింగ్‌ స్కార్ఫ్‌లూ ఉంటున్నాయి. దాంతో అమ్మాయిలు రోజువారీ వేసుకునే డ్రెస్సులో భాగంగా స్కార్ఫ్‌కీ అంతే ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఎలా వచ్చిందీ స్కార్ఫ్‌?

వేసవిలో మెడకి పట్టిన చెమటల్ని శుభ్రం చేసుకునేందుకు స్కార్ఫ్‌ లేదా స్టోల్‌ని మెడలోగానీ నడుం దగ్గర బెల్టుకిగానీ ఐరోపావాసులు కట్టుకునేవారట. మనదగ్గర రైతులూ మెడలో తుండుగుడ్డు వేసుకున్నా తలచుట్టూ పాగాలా కట్టినా అందుకే మరి. కచ్‌ తీరంలో మెడలో రంగుల బట్టను ముడివేయడం ఇప్పటికీ ఉంది. బాందినీ ప్రింట్స్‌తో వచ్చే స్కార్ఫ్‌లు ఇప్పటికీ అక్కడ ఎంతో పాపులర్‌. మగవాళ్లనే కాదు, స్త్రీలు సైతం ఎండకి జుట్టు పాడవకుండా బంధన పేరుతో వెడల్పాటి కర్ఛీఫ్‌నో లేదా చిన్నపాటి తుండునో తలకి చుట్టడం అనేక ప్రాంతాల్లో వాడుకలో ఉంది. ముఖ్యంగా దుమ్మూధూళీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో స్కార్ఫ్‌ వాడకం కనిపిస్తుంటుంది. ఇక, ప్రార్థన లేదా పూజా సమయంలో అన్ని మతాలవారూ తలమీదుగా కప్పుకోవడం గమనిస్తుంటాం. కొన్నిచోట్ల స్కార్ఫ్‌ యూనిఫామ్‌లో భాగం కూడా. లండన్‌ కాలేజీల్లో స్కౌటు గ్రూపుల్లో విభాగాల వారీగా వివిధ రంగుల స్కార్ఫ్‌లు వాడుతుంటారు. ఒకప్పుడు చైనాలో సైనిక దళాల్లోని అధికారులు మెడలో సిల్కు స్కార్ఫ్‌ల్నీ సైనికులు కాటన్‌ స్కార్ఫ్‌ల్నీ ధరించేవారట. అదే మెల్లగా టైగా మారిందనీ చెబుతారు. అయితే అప్పట్లో చతురస్రా కారంలో ఉండేదాన్ని స్కార్ఫ్‌ అనీ దీర్ఘచతురస్రంగా ఉండే దాన్ని స్టోల్‌ అనీ పిలిచేవారు. స్కార్ఫ్‌ని త్రిభుజాకారం వచ్చేలా ముడి వేసేవారు. పొడవుగా ఉండే స్టోల్‌ని మెడలో  వేలాడదీసేవారు. క్రమంగా ఈ రెండింటికీ పెద్ద తేడా లేకుండా పోయింది. అది స్కార్ఫ్‌లా కట్టినా స్టోల్‌లా వేసినా మెడ చుట్టూ కట్టడం వల్ల ఆ వేడికి మనం పీల్చిన చల్లగాలి నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరకుండా ఉంటుంది. దాంతో రక్తనాళాలు సంకోచించకుండా వ్యాకోచం చెందుతాయి. ఫలితంగా నరాల్లో రక్తప్రసరణ మెరుగై కండరాలకు సరిపడా ఆక్సిజన్‌, పోషకాలూ అందుతాయి. దాంతో కండరాలు దగ్గరగా నొక్కుకోవడం జరగదన్నమాట. అంటే- స్కార్ఫ్‌ చలికాలపు నొప్పుల్ని తగ్గిస్తుందన్నమాట. ముఖ్యంగా వయసు పెరిగేకొద్దీ మెడ దగ్గర ఉండే నరాలు సంకోచిస్తూ ఒత్తిడికి లోనవుతుంటాయి. అందుకే ఆ వయసులో మెడ చుట్టూ స్కార్ఫ్‌ ఉంటే చల్లటి గాలి నేరుగా మెడ నరాలకు తాకి, మరింత ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. మెడలో స్కార్ఫ్‌ కట్టడం వల్ల సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ నుంచీ ఉపశమనం ఉంటుంది. అంతేకాదు, వేసవిలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఒక్కసారిగా వేడిగాలి లోపలకు చేరకుండా ఉండేందుకు పలుచని కాటన్‌ వస్త్రాన్ని మెడలోగానీ లేదా తలమీద నుంచి ముక్కూచెవుల్ని కప్పుతూగానీ కడుతుంటారు. దీనివల్ల చలీ ఎండల నుంచి మరింత రక్షణ ఉంటుంది. ఒక రకంగా ఎయిర్‌ కండిషన్డ్‌గానూ పనిచేస్తూ మెడ భాగాన్నీ తద్వారా మొత్తంగా ఆరోగ్యాన్నీ కాపాడుతుందన్నమాట. అందుకే స్కార్ఫ్‌ కేవలం ఫ్యాషన్‌ యాక్సెసరీ కాదు, వాతావరణ మార్పుల నుంచి శరీరాన్ని కాపాడే అందమైన వస్త్ర కవచం. మధ్యలో కొన్నాళ్లపాటు ఫ్యాషన్‌ యాక్సెసరీగానూ తెరమీదకెక్కినా, కరోనా పుణ్యమా అని మళ్లీ పెద్దా చిన్నా అందరినీ మెడనీ ముఖాన్నీ కప్పుతూ అందమైన రక్షణగా నిలవడం చెప్పుకోదగ్గ విశేషం.


మరిన్ని

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.