Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu

ఆదివార అనుబంధం

Facebook Share Twitter Share Comments Telegram Share

ఆరు రూపాయల కూలీని...అపర కుబేరుడినయ్యాను!

మనదేశం నుంచి అమెరికా వెళ్లి కోట్లు గడించినవాళ్లు లక్షల్లో ఉంటారు. వాళ్లలో నం.1 సంపన్నుడు... జయ్‌ చౌధరి! ముకేశ్‌ అంబానీ, అదానీల సరసన టాప్‌-10 భారతీయ కుబేరుల్లో ఆయనా ఒకరు. భారతీయులనే కాదు... ప్రపంచ సంపన్నుల జాబితాలోనూ చౌధరి పేరు కనిపిస్తుంటుంది. ప్రస్తుతం ఆయన సంపద విలువ 14 లక్షల కోట్ల రూపాయలైతే... రోజువారీ సంపాదన 157 కోట్లన్నది లెక్క! సుమారు 45 ఏళ్లకిందట... పంట పొలంలో పనిచేస్తే ఆయనకొచ్చిన కూలీ వారానికి ఆరురూపాయలు! అలాంటివాడు అపరకుబేరుడైన ఆ కథ... జయ్‌ మాటల్లోనే...

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌... కరోనా తర్వాత ఇంటింటా వినిపిస్తున్న పదం ఇది! బ్యాంకులూ, ఇతర ఆర్థిక సంస్థలూ కోట్ల రూపాయల లావాదేవీలకి సంబంధించిన ఫైల్స్‌ని తమ ఉద్యోగుల ఇంటికి పంపి పనిచేయించుకుంటున్నాయి. కానీ, ఈ ఫైల్స్‌ని ‘హ్యాక్‌’ చేసి వాటిలోని సమాచారాన్ని దొంగిలించి వాటితో కుబేరులైపోవాలని చూసే సైబర్‌ నేరగాళ్లు ఎక్కడికక్కడ పొంచి ఉంటారు. ఒక్కోసారి కొందరు ఉద్యోగులూ ఇలాంటి నేరాలకి పాల్పడొచ్చు... పోటీ సంస్థలూ వాటి కోసం వల వేయొచ్చు. అలాంటివాళ్ల నుంచి ఈ ఫైల్స్‌ని కాపాడి కంపెనీకి సైబర్‌ భద్రతనివ్వడమే మా కంపెనీ ‘జెడ్‌ స్కేలర్‌’ పని! కోకాకోలా, సీమెన్స్‌, జెన్‌పాక్ట్‌, జీఈ, పెంగ్విన్‌ ర్యాండమ్‌ హౌస్‌... వంటి బహుళజాతి సంస్థలన్నీ మా కస్టమర్లే. ఫార్చ్యూన్‌ సంస్థ ఏటా అమెరికాలోని ది బెస్ట్‌ 500 సంస్థల జాబితా విడుదలచేస్తే... వాటిల్లో 35 శాతం కంపెనీలు మా వినియోగదారులే. మనదేశంలోని హెచ్‌డీఎఫ్‌సీ వంటి బ్యాంకులూ మా సేవల్ని అందుకుంటున్నాయి. గత ఏడాది కరోనాతో వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ విధానం పెరగడంతో... మేమందించే సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌కి గిరాకీ పెరిగింది. ఒక్కసారిగా మా సేవలు 185 దేశాల్లోని ఐదువేల కంపెనీలకి విస్తరించాయి. కేవలం ఏడాదిలోనే మా సంస్థ సంపద ఐదు రెట్లు పెరిగి 38 లక్షల కోట్లకి చేరింది. అందులో ప్రధాన వాటాదారుణ్ణి కాబట్టి నా సంపద 14 లక్షల కోట్లని లెక్క తేల్చారు. దాని ప్రకారం అమెరికాలోని భారతీయుల్లోనే కాదు అక్కడున్న దక్షిణాసియావాళ్లలోనే అత్యంత సంపన్నుడిని నేనేనని ప్రకటించారు. ఆ మధ్య ‘హురూన్‌’ సంస్థ ప్రపంచ కుబేరుల జాబితాలోనూ నాకు చోటిచ్చింది. నిజానికి, వాళ్లేవో ప్రకటనలు చేయడం, పత్రికలొచ్చి వరసగా ఇంటర్వ్యూలు అడగడం తప్ప... ఈ లెక్కల వల్ల నాలో పెద్ద మార్పేమీ రాలేదు. ఇప్పటికీ ఓ మామూలు కంపెనీ సీఈఓ వాడే కారే వాడుతున్నాను... సాదాసీదా ఇంట్లోనే ఉంటున్నాను. ఇంకా చెప్పాలంటే... నేను అమెరికాకి వచ్చి 40 ఏళ్లవుతున్నా ఇప్పటికీ నన్ను నేను ఓ రైతుబిడ్డగానే ఊహించుకుంటున్నాను. మా కస్టమర్లు ఎవరైనా వచ్చి ‘మీ సాఫ్ట్‌వేర్‌ భద్రత అద్భుతమండీ!’ అని అంటూ ఉంటే... చిన్నప్పుడు విరగపండిన చేల మధ్య నిల్చుని గింజల కోసం వాలుతున్న పక్షులపైన ‘ఇస్సో’ అంటూ వడిసెల విసరిన రోజుల్నే గుర్తుచేసుకుంటున్నాను. అప్పట్లో మొక్కజొన్న కంకులకి కాపలాకాస్తే... ఇప్పుడు కంపెనీ సమాచారాన్ని దొంగల నుంచి కాస్తున్నాను అంతే తేడా. ఆ చేల నుంచి ఇక్కడి దాకా ఎలా నడిచివచ్చానో చెబుతాను...

చుట్టూ మంచు దుప్పటి కప్పుకున్న హిమాలయాలు... వాటి కింద పుత్తడి విరబూసినట్టుండే మొక్కజొన్న పంట చేలూ... మా ఊరు అనగానే నాకు ఈ దృశ్యమే గుర్తుకొస్తుంటుంది. మూడువందల గడపలున్న ఓ చిన్నపల్లెటూరు అది. పానో అని పేరు. హిమాచల్‌ప్రదేశ్‌ లోని ఉనా జిల్లాలో ఉంటుంది. ఆ చిన్నపల్లెటూరులో మాకో రెండెకరాల పొలం ఉండేది. మా నాన్న పగలూరాత్రీ అందులోనే కాయకష్టం చేస్తుండేవాడు. పగటిపూట ఆయనతోపాటూ మేమూ కష్టపడేవాళ్లం. ఆ రెండున్నర ఎకరాల చేనుతోపాటూ అప్పుడప్పుడూ ఊళ్ళోని పెద్ద రైతుల కమతాల్లోనూ పనిచేసేవాళ్లం. అలా పనిచేసినందుకు వారానికి ఆరు రూపాయలిస్తే... ఎంత సంబరపడిపోయేవాణ్ణో. అమ్మానాన్నలకి మేం ఐదుగురం పిల్లలం. అన్నయ్యా, ముగ్గురు అక్కల తర్వాత నేను. అమ్మానాన్నలు అక్షరాలు నేర్చినవాళ్లు కాకున్నా... మమ్మల్ని బాగా చదివించాలని బలంగా కోరుకున్నారు. మొదట మా ఊళ్లోనే ఐదో తరగతి వరకూ చదువుకున్నాను. తర్వాత మాకు దగ్గర్లోని జిల్లాకేంద్రం ‘ఉనా’లో ఆరో తరగతిలో చేరాను. అక్కడి నుంచి మా ఊరికి ఎనిమిది కిలోమీటర్లయితే... రోజూ అంతదూరాన్నీ నడిచే వెళ్తుండేవాణ్ణి. ఇక్కడ ఎనిమిదోతరగతి పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో మూడోర్యాంకు సాధించాను! పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకి కొద్దిరోజుల ముందుదాకా బడికెళ్లి చదువుతూ ఉన్న నన్ను మా హెడ్‌మాస్టర్‌ పిలిచి ‘ఇలా స్కూల్‌కీ- ఇంటికీ రోజూ 16 కిలోమీటర్లు వస్తూ వెళుతూ టైమ్‌ వేస్ట్‌ చేసుకోవద్దు. మీ ఊళ్లో కరెంటు ఉండదు కదా! ఇకపైన రాత్రుళ్లు మా ఇంట్లోనే ఉండి చదువుకో!’ అని చెప్పారు. అలాగే చేశాను. ఆయన చూపిన ఆదరణ వృథాకాలేదు... పదో తరగతిలో రాష్ట్రంలోనే సెకండ్‌ ర్యాంకు సాధించాను! ఇంటర్‌లో మొదటిర్యాంకు వచ్చింది. దాంతో ప్రతిష్ఠాత్మక బెనారస్‌ హిందూ వర్సిటీలో సీటూ వచ్చింది.

అమెరికా వైపు...
అప్పటిదాకా కేవలం పల్లెటూరి కుర్రాడిగానే ఉన్న నాకు ఆ సంస్థలో చేరడం పెద్ద కల్చరల్‌ షాక్‌లా మారింది. పంచెకట్టు తప్ప ప్యాంటుషర్ట్‌లే అంతగా తెలియని నన్ను అక్కడి ఫ్యాషన్‌లు కలవరపెట్టాయి. అప్పటిదాకా పంజాబీ, హిమాచలీ భాషలు తప్ప హిందీ కూడా సరిగ్గా రాదు నాకు... ఇక ఇంగ్లిషు గురించి చెప్పాలా?! దాంతో తిరునాళ్లలో తప్పిపోయిన చిన్నారిలా అయిపోయాను. కానీ ఆ కుంగుబాటుని అధిగమించడానికి ప్రాణంపెట్టి చదివాను. లెక్చరర్ల మెప్పుపొందాను. నేటి ఐఐటీల్లోలాగే నాటి బీహెచ్‌యూలో చదువుతున్నవాళ్లందరూ అమెరికాకి వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. నేనూ దానికి మినహాయింపు కాదు. బీటెక్‌ మూడో ఏడాది నుంచే అమెరికన్‌ వర్సిటీలకి దరఖాస్తు చేయడం మొదలుపెట్టాను. సిన్సనాటీ యూనివర్సిటీ స్కాలర్‌షిప్‌ ఇవ్వడంతో అమెరికాకి ప్రయాణమయ్యాను. కానీ ఫ్లైటు ఛార్జీలు ఎలా- అన్న సమస్య వచ్చింది. మాకున్న రెండెకరాల కమతాన్ని అమ్మినా అంత డబ్బు రాదు! అప్పుడే టాటా సంస్థ అమెరికా వెళ్లాలనుకునే పేదవిద్యార్థుల కోసం ఫ్లైటు ఖర్చులిస్తుందని తెలిసి... అప్లై చేసుకున్నాను. అది దక్కడంతోనే అమెరికాలో అడుగుపెట్టగలిగాను. అక్కడి సిన్సనాటి వర్సిటీలో జ్యోతి పరిచయం కావడంతో నా జీవితం ఓ అందమైన మలుపు తిరిగింది. తనూ నాతోపాటే ఎమ్మెస్‌ చదువుకుంది. పరిచయం ప్రేమగా మారాక పెద్దల్ని ఒప్పించి పెళ్ళిచేసుకున్నాం. ఈలోపు ఇద్దరి ఎమ్మెస్‌ పూర్తయి నాకు యునిసెస్‌ సంస్థలోనూ తనకి ఓ టెలీకమ్యూనికేషన్‌ కంపెనీలోనూ ఉద్యోగాలు వచ్చాయి. కొన్నాళ్ల తర్వాత నేను ప్రముఖ కంప్యూటర్‌ తయారీ కంపెనీ ఐబీఎంలోకి మారాను. అక్కడ చేరింది ఇంజినీర్‌గానే కానీ ఆ సంస్థకి నా మాటతీరూ, కమ్యూనికేషన్‌ విధానం నచ్చి మార్కెటింగ్‌ బాధ్యతలు అప్పగించింది. అప్పటికి ఆ రంగం నాకు కొత్తదైనా... ధైర్యంగానే గోదాలోకి దిగాను. ఐబీఎం సేల్స్‌ లక్ష్యాల్ని రాకెట్‌ వేగంతో అందుకోవడం మొదలుపెట్టాను. జగ్తార్‌సింగ్‌ చౌధరీ అన్న నా పేరు జయ్‌ చౌధరీగా మారింది అప్పుడే. చూస్తుండగానే అలా పదమూడేళ్లు గిర్రున తిరిగిపోయాయి... మాకు ముగ్గురు పిల్లలు పుట్టారు. జీవితం ఒడుదొడుకులేవీ లేకుండా సంతోషంగానే గడుస్తూ ఉన్నవేళలోనే... ‘ఇంటర్నెట్‌’ దానికో కుదుపునిచ్చింది!

దాచినవన్నీ పెట్టేశాం!
‘ఇంటింటా ఉన్న కంప్యూటర్‌లన్నింటినీ కలిపి... ప్రపంచం మొత్తాన్నీ ఒకే నెట్‌వర్క్‌ కిందకి తెస్తారట, దాని పేరు ఇంటర్నెట్‌ అట!’ - అని అప్పట్లో ప్రపంచం వింతగా అనుకుంటూ ఉండేది. అలాంటి ఇంటర్నెట్‌ కోసం 1993లో తొలిసారి వెబ్‌బ్రౌజర్‌ని సృష్టించింది నెట్‌స్కేప్‌ అనే సంస్థ. దాన్ని చూశాక నాకో ఆలోచన వచ్చింది. ఇంటర్నెట్‌ అన్నది మన ఇంటికి వేసిన రోడ్డులాంటిది. మన ఇంటిని ప్రధాన రోడ్డుతోనూ అట్నుంచటు హైవేతోనూ కలుపుతుంది. ‘మరి అదే రోడ్డు ద్వారా దొంగలూ వచ్చే అవకాశం ఉంది కదా... నెట్‌లో వచ్చే అలాంటి దొంగల నుంచి ఎలా భద్రత కల్పించాలి?’ అనుకున్నాను. చుట్టూ చూస్తే అలాంటి సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ సంస్థలేవీ కనిపించలేదు. నేనే అలాంటి కంపెనీ ఒకటి పెట్టాలన్న ఆలోచన వచ్చింది. చకచకా ప్లాన్‌లు తయారుచేశాను. పేపర్‌పైన అంతా చక్కగా అనిపించాయి కానీ పెట్టుబడి ఎవరు పెడతారు? ఇప్పట్లా వెంచర్‌ క్యాపిటలిస్టు సంస్థలు పెట్టుబడులు పెట్టే రోజులు కావు అవి! వెళ్లిన ప్రతిచోటా మొండిచెయ్యే ఎదురయింది. దాంతో నేనూ నా భార్యా ఓ పెద్ద నిర్ణయం తీసుకున్నాం. ఇద్దరం ఉద్యోగాలకి రాజీనామా ఇచ్చి, అలా వచ్చిన డబ్బూ పదిహేనేళ్లపాటు మా ఇద్దరి ఉద్యోగంతో దాచిన పొదుపు సొమ్మూ... అంతా కలిపి కంపెనీలో పెట్టేశాం. ఒకవేళ నష్టపోతే ఏమయ్యేవాళ్లమో తెలియదుకానీ... ఆ సాహసం మాకు మంచే చేసింది!

ఉద్యోగులు కోటీశ్వరులయ్యారు!
మా తొలి సంస్థ పేరు ‘సెక్యూరిటీ ఐటీ’. ఐదుగురు వ్యక్తులతో మొదలుపెట్టి ఏడాదిలోనే వందమందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి చేరుకున్నాం. మా కంపెనీ ఆలోచనా, తీరుతెన్నులూ నచ్చి ‘వెరి సైన్‌’ అనే బడా కంపెనీ కొనుక్కోవడానికి ముందుకొచ్చింది. వాళ్లు ఎన్నిసార్లు అడిగినా అమ్మడం కుదరదు అనే చెప్పాను. మా ఆవిడే ఒకరోజు ‘కనీసం వాళ్లు ఏం చెబుతారో వినొచ్చు కదా!’ అని సలహా ఇచ్చింది. విన్నాను. ఆ డీల్‌ నచ్చింది! నా కంపెనీలోని ఎక్కువ వాటాలు అమ్ముతూ సైన్‌ చేస్తుంటే నేనేమీ బాధపడలేదు. ఎందుకంటే, ఆ ఒక్క సంతకంతో మా సంస్థలో వాటాలున్న 70 మంది ఉద్యోగులు కోటీశ్వరులైపోయారు! కేవలం ఏడాదిలో అంతమంది కోటీశ్వరుల్ని సృష్టించడం... మేమూ నిలదొక్కుకోవడం మాకు చాలా సంతృప్తినిచ్చింది. ఆ తర్వాతి పదేళ్లలో ‘కోర్‌ హార్బర్‌’ అనీ, ‘సైఫర్‌ట్రస్ట్‌’ అనీ, ‘ఎయిర్‌ డిఫెన్స్‌’ అనీ... మూడు కంపెనీలని ఏర్పాటుచేసి అన్నింటినీ పెద్ద సంస్థలకి అమ్మేశాను. ఎప్పటికపుడు కొత్త ఆలోచనలు చేయడం ఆ ఆలోచనలు సంస్థలుగా మారడం, అలా మారినవాటిని అమ్మడం ద్వారా ఉద్యోగులందరినీ మిలియనీర్లని చేయడం... అందులో ఓ కిక్‌ ఉండేది నాకు అప్పట్లో. కాస్త పరిణతి వచ్చాక... ఓ పెద్దస్థాయిలో శాశ్వతంగా నిలబడే సంస్థని స్థాపించాలనిపించింది. అలా పుట్టిందే ‘జడ్‌ స్కేలర్‌’. ‘క్లౌడ్‌ సాంకేతికత’తో పనిచేసే తొలి సెక్యురిటీ సంస్థ మాది. ఆ సాంకేతికత అంతగా ప్రాచుర్యంలేని 2008లోనే మేం ఈ ఐడియాతో వెళితే... అమెరికన్‌ సంస్థలూ నవ్వాయి. కానీ, మేం చూపించే ఫలితం చూసి ప్రపంచ స్థాయి సంస్థలన్నీ అక్కున చేర్చుకున్నాయి. ప్రస్తుతం మాకు ప్రపంచవ్యాప్తంగా ఐదువేలమంది ఉద్యోగులున్నారు. వారిలో 45 శాతం భారతీయులే. నా ఆలోచనలకి వాళ్ల కృషి తోడైన ఫలితమే మా కంపెనీ సాధించిన ఈ సంపదలూ... ఈ కొత్త రికార్డులూ!

ఇదీ నా బాధ్యతే!
నేను చదువుకునేటప్పుడు- మా ఊళ్లలోని బడుల్లో గుక్కెడు నీళ్లూ దొరికేవి కావు. పిల్లలందరం బావి నుంచి నీళ్లు తెచ్చి బిందెల్లో నింపుతుండేవాళ్లం. నేను అమెరికాలో స్థిరపడ్డ ఇరవైయేళ్లకి కూడా ఆ పరిస్థితిలో ఏ మార్పూ లేదు. అందువల్ల మా తొలి సంస్థ సెక్యూరిటీ ఐటీని అమ్మేశాక... వచ్చిన డబ్బుతో మా జిల్లాలోని బడులన్నింటా సురక్షిత మంచి నీటి ప్లాంట్‌లు ఏర్పాటుచేశాను. అది మొదలు, ప్రతి సంస్థ లాభాల్లో పెద్దవాటాని ఇలాంటి కార్యక్రమాలకి కేటాయిస్తున్నాను.


మరిన్ని

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.