
బిజినెస్
కోల్ ఇండియా డైరెక్టర్‌గా వీరారెడ్డి
ఈనాడు, దిల్లీ: కోల్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్ (టెక్నికల్)గా బి.వీరారెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్‌లో టెక్నికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన్ను కోల్ ఇండియాకు బదిలీచేయాలని కేంద్ర నియామక వ్యవహారాల మంత్రివర్గ సంఘం నిర్ణయించినట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ గురువారం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. 2024 ఆగస్టు 31వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
ఈఎస్ఐసీ పథకంలోకి సెప్టెంబరులో 13.37 లక్షల మంది
దిల్లీ: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ) నిర్వహిస్తున్న సామాజిక భద్రతా పథకంలోకి సెప్టెంబరులో కొత్తగా 13.37 లక్షల మంది సభ్యులు చేరారు. ఆగస్టులో 13.42 లక్షల మంది చేరినట్లు జాతీయ గణాంక కార్యాలయం(ఎన్ఎస్ఓ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2020-21 మొత్తంమీద కొత్త ఖాతాదార్లు 1.15 కోట్లు మాత్రమే నమోదయ్యారు. 2019-20లో 1.51 కోట్లు; 2018-19లో 1.49 కోట్ల మందితో పోలిస్తే ఈ సంఖ్య తక్కువే. మరో వైపు, ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ)లో సెప్టెంబరులో 15.41 లక్షల మంది చేరారు. ఆగస్టులో నమోదైన 13.6 లక్షలతో పోలిస్తే ఇది ఎక్కువే.
డిసెంబరులో ‘స్పుత్నిక్ లైట్’ టీకా
ఈనాడు, హైదరాబాద్: కొవిడ్‌కు ఒకేడోసు టీకా ‘స్పుత్నిక్ లైట్’ మనదేశంలో వచ్చే నెలలో అందుబాటులోకి రానుంది. ‘డిసెంబరులో భారత విపణిలో స్పుత్నిక్ లైట్ టీకా విడుదల చేస్తాం’ అని రష్యా సంస్థ ఆర్డీఐఎఫ్ (రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్’ సీఈఓ కిరిల్ డిమిట్రివ్ తెలిపారు. ఈ టీకాకు స్థానిక ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ లేబోరేటరీస్ పంపిణీదారుగా వ్యవహరిస్తుంది. వచ్చే నెలలో స్పుత్నిక్ లైట్ టీకాను విడుదల చేయడానికి సంబంధిత అధికార యంత్రాంగంతో సంప్రదింపులు సాగిస్తున్నట్లు డిమిట్రివ్ వివరించారు. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) ఈ టీకాను ఉత్పత్తి చేస్తుందని అన్నారు.
క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తే చట్టవిరుద్ధ వినియోగం పెరగొచ్చు: బీఏసీసీ
దిల్లీ: దేశంలో క్రిప్టో కరెన్సీలను పూర్తిగా నిషేధిస్తే చట్టవిరుద్ధంగా వినియోగం అధికం కావడంతో పాటు, జవాబుదారీతనం ఉండదని, అవి ఎక్కడ రూపొందిస్తున్నారో, వినియోగిస్తున్నారో తెలుసుకోవడం కష్టమవుతుందని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో (ఐఏఎంఏఐ) భాగమైన ది బ్లాక్ చెయిన్ అండ్ క్రిప్టో అసెట్స్ కౌన్సిల్ (బీఏసీసీ) పేర్కొంది. కొన్ని మినహాయింపులతో ప్రైవేటు క్రిప్టో కరెన్సీలను నిషేధిస్తూ శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో బీఏసీసీ ఈ వ్యాఖ్యలు చేసింది. వీటిపై లాభాలు ఆర్జించినా పన్ను చెల్లించడమే ఉండదని పేర్కొంది. పైగా రిటైల్ మదుపర్లపై తీవ్ర ప్రభావం పడుతుందని అభిప్రాయపడింది. ప్రైవేటు క్రిప్టో కరెన్సీలను దేశంలో కరెన్సీలా వాడకుండా నిషేధించి, కేవలం అసెట్ క్లాస్‌గా చూసేలా చర్యలు తీసుకోవాలని బీఏసీసీ సూచించింది. క్రిప్టో అసెట్ వ్యాపారాన్ని అనుమతిస్తే, కొనుగోలుదార్లు-విక్రయదార్లను గమనించడంతో పాటు పన్ను వసూలు సాధ్యపడుతుందని వివరించింది.
మరిన్ని
దేశంలో పేదరికం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలివే.. ఏపీ, తెలంగాణ ఏ స్థానంలో ఉన్నాయంటే?
Gold Bonds: 29 నుంచి మరో విడత గోల్డ్ బాండ్ స్కీమ్.. గ్రాము ధరెంతంటే?
5G Trails: 5జీ ట్రయల్స్‌లో వొడాఫోన్ మరో మైలురాయి.. 4Gbpsతో డేటా బదిలీ!
Tega Industries IPO: డిసెంబరు 1న టెగా ఇండస్ట్రీస్ ఐపీఓ.. ధర ఎంతంటే?
Tata Group: సెమీకండెక్టర్ల పరిశ్రమ ఏర్పాటుపై మూడురాష్ట్రాలతో చర్చలు?