
బిజినెస్
బలంగా పుంజుకున్న మార్కెట్లు
సమీక్ష
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరుకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో మార్కెట్లు ప్రారంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్నాయి. గ్యాసిఫికేషన్ విభాగాన్ని పూర్తి స్థాయి అనుబంధ సంస్థకు బదిలీ చేసే పథకాన్ని అమల్లోకి తేవాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు నిర్ణయించడం, గత నాలుగు సెషన్లలో షేరు నష్టపోవడమూ ఇందుకు నేపథ్యం. గురువారం 6.10 శాతం (రూ.143.50) పెరిగిన షేరు రూ.2494.40 వద్ద ముగిసింది. ఫలితంగా సంస్థ మార్కెట్ విలువ రూ.15.82 లక్షల కోట్లకు చేరింది. బుధవారం నాటి రూ.14.91 లక్షల కోట్లతో పోలిస్తే, ఒక్కరోజులో రూ.91,000 కోట్లు పెరిగింది. నవంబరు డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో సూచీలకు ఒడుదొడుకులు తప్పలేదు. డాలర్‌తో పోలిస్తే రూపాయి 12 పైసలు తగ్గి 74.52 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, ఐరోపా సూచీలు నష్టాల్లో కదలాడాయి.
సెన్సెక్స్ ఉదయం 58,363.93 పాయింట్ల వద్ద స్తబ్దుగా ప్రారంభమైంది. కొద్దిసేపటికే నష్టాల్లోకి వెళ్లిన సూచీ.. 58,143.86 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరింది. అక్కడ నుంచి బలంగా పుంజుకున్న సూచీ.. ఇంట్రాడేలో 58,901.58 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని నమోదుచేసింది. చివరకు 454.10 పాయింట్ల లాభంతో 58,795.09 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 121.20 పాయింట్లు పెరిగి 17,536.25 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో సూచీ 17,351.70- 17,564.35 పాయింట్ల మధ్య కదలాడింది.
* ప్రతికూల మార్కెట్ పరిస్థితులతో బజాజ్ ఆటో షేరు 0.71% నష్టపోయి రూ.3390.40 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో షేరు 2021 కనిష్ఠ స్థాయి అయిన రూ.3378 తాకింది. ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ రూ.లక్ష కోట్ల మార్కు దిగువకు చేరి, రూ.98,106.99 కోట్లుగా నమోదైంది. డిసెంబరు 20 నుంచి సెన్సెక్స్-30 షేర్ల నుంచి బజాజ్ ఆటోను తొలగించనున్నారు. ఈ స్థానంలో విప్రో చేరనుంది.
* బ్లాక్‌రాక్, కెనడా పెన్షన్ వంటి యాంకర్ మదుపర్ల కొనుగోళ్లతో పేటీఎం షేరు మూడో రోజూ పెరిగింది. 2.48 శాతం లాభంతో రూ.1796.55 వద్ద ముగిసింది. అయితే ఐపీఓ ఇష్యూ ధర రూ.2150కు ఇంకా దూరంగానే ఉంది.
* సెన్సెక్స్ 30 షేర్లలో 14 రాణించాయి. ఐటీసీ 1.49%, ఇన్ఫోసిస్ 1.47%, టెక్ మహీంద్రా 1.24%, కోటక్ బ్యాంక్ 1.14%, టైటన్ 0.92%, భారతీ ఎయిర్టెల్ 0.82% లాభపడ్డాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ 1.27%, మారుతీ 1.23%, ఐసీఐసీఐ బ్యాంక్ 1.23%, హెచ్‌యూఎల్ 1.12%, యాక్సిస్ బ్యాంక్ 0.75% చొప్పున డీలాపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో ఇంధన, స్థిరాస్తి, ఆరోగ్య సంరక్షణ, టెలికాం, యుటిలిటీస్, చమురు- గ్యాస్ 4.47% వరకు పెరిగాయి. యంత్ర పరికరాలు, వాహన, బ్యాంకింగ్, ఫైనాన్స్ మాత్రం పడ్డాయి. బీఎస్ఈలో 2082 షేర్లు లాభాల్లో ముగియగా, 1215 స్క్రిప్‌లు నష్టపోయాయి. 114 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
మరిన్ని
దేశంలో పేదరికం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలివే.. ఏపీ, తెలంగాణ ఏ స్థానంలో ఉన్నాయంటే?
Gold Bonds: 29 నుంచి మరో విడత గోల్డ్ బాండ్ స్కీమ్.. గ్రాము ధరెంతంటే?
5G Trails: 5జీ ట్రయల్స్‌లో వొడాఫోన్ మరో మైలురాయి.. 4Gbpsతో డేటా బదిలీ!
Tega Industries IPO: డిసెంబరు 1న టెగా ఇండస్ట్రీస్ ఐపీఓ.. ధర ఎంతంటే?
Tata Group: సెమీకండెక్టర్ల పరిశ్రమ ఏర్పాటుపై మూడురాష్ట్రాలతో చర్చలు?