
బిజినెస్
ముంబయి: ఈరోజు స్టాక్ మార్కెట్లకు మరో బ్లాక్ ఫ్రైడేగా మిగిలిపోయింది. ఐరోపాలో పెరుగుతున్న కరోనా కేసులు, దక్షిణాఫ్రికాలో పుట్టుకొచ్చిన కొత్త వేరియంట్ మదుపర్లను నిండా ముంచాయి. మార్కెట్లకు ఎరుపు రంగు పులిమాయి. ఉదయం సెన్సెక్స్ 58,254.79 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 56,993.89 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 1687.94 పాయింట్ల భారీ నష్టంతో 57,107.15 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 16,985.70 వద్ద కనిష్ఠాన్ని తాకి చివరకు 509.80 పాయింట్లు నష్టపోయి 17,026.45 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.87 వద్ద నిలిచింది. సెన్సెక్స్ 30 సూచీలో డాక్టర్ రెడ్డీస్(3.35%), నెస్లే ఇండియా(0.35%) మాత్రమే లాభపడ్డాయి. అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఇండస్ఇండ్ బ్యాంక్(6.21%), మారుతీ(5.48%), టాటా స్టీల్(5.36%), బజాజ్ ఫినాన్స్(4.93%), ఎన్టీపీసీ(4.59%), టైటన్(4.33%), ఎంఅండ్ఎం(4.23%), ఎస్బీఐ(4.20%), హెచ్డీఎఫ్సీ(4.14%) షేర్లు ఉన్నాయి.
మార్కెట్ల పతనానికి ప్రధాన కారణాలు..
కొత్త వేరియంట్..
దక్షిణాఫ్రికాలో పుట్టుకొచ్చిన కరోనా కొత్త వేరియంట్ మార్కెట్ల పతనానికి ప్రధాన కారణం. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన వేరియంట్ల కంటే దీనికి వేగంగా వ్యాపించే గుణం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దీనిపై చర్చించేందుకు డబ్ల్యూహెచ్ఓ నేడు అత్యవసరంగా సమావేశం కానుంది. భారత్‌లోనూ కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాలకు తగు మార్గదర్శకాలు జారీ చేసింది.
ఆసియా సూచీల పతనం..
దక్షిణాఫ్రికా వేరియంట్ భయాలతో ఆసియా సూచీలన్నీ నష్టాలు మూటగట్టుకున్నాయి. మరోసారి లాక్డౌన్లు తప్పవన్న అంచనాలు మదుపర్లను తీవ్ర నిరాశలోకి నెట్టాయి. ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు మూడో వేవ్ మరింత ముప్పు తెచ్చిపెట్టే అవకాశం ఉండడంతో సూచీలు కుంగాయి. మరోవైపు ఉద్దీపనల ఉపసంహరణలో భాగంగా అమెరికా వడ్డీరేట్లను వేగంగా పెంచే అవకాశం ఉందన్న సంకేతాలు సైతం సూచీల సెంటిమెంటును దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో జపాన్ నిక్కీ 2.53%, హాంగ్‌సెంగ్ 2.67%, జకార్తా కాంపోజిట్ 2.06% నష్టపోయాయి.
ద్రవ్యోల్బణ ఆందోళనలు..
ఇటీవలి ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా భారత్‌లో కూరగాయల ధరలు భారీగా ఎగబాకాయి. మరోవైపు ఇటీవల కురిసిన విస్తారమైన వర్షాలు, వరదలతో పంట ఉత్పత్తులు దెబ్బతిన్నాయి. దీంతో ద్రవ్యోల్బణం దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఇక ముడిపదార్థాల ధరల పెరుగుదల తయారీ కంపెనీలను ఇబ్బంది పెడుతోంది. దీంతో ఆ భారాన్ని వినియోగదారులపై మోపే అవకాశం ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇది కూడా సూచీల సెంటిమెంటును దెబ్బతీసింది.
అధిక విలువల నుంచి వెనక్కి...
కరోనా సంక్షోభం ముగిసిందన్న అంచనాల నేపథ్యంలో గత ఏడాది కాలంగా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ సూచీలు భారీ ఎత్తున పుంజుకున్నాయి. దీంతో అక్టోబరులో మార్కెట్ సూచీలు జీవితకాల గరిష్ఠాలకు చేరాయి. దీంతో భారత మార్కెట్ల అధిక విలువలపై మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్‌మన్ శాక్స్ సహా ఇతర అంతర్జాతీయ ఏజెన్సీలు హెచ్చరించాయి. పైగా ఫలితాల సీజన్ కూడా ముగియడంతో మార్కెట్ సూచీలు స్థిరీకరణ దిశగా సాగాయి. సరిగ్గా ఈ తరుణంలో కరోనా భయాలు వెలుగులోకి రావడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లైంది.
రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరి...
సూచీలు పతనమవ్వడంతో, మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ.5 లక్షల కోట్లు తగ్గి రూ.261 లక్షల కోట్లకు పరిమితమైంది.
ఇతర కారణాలు...
* రిలయన్స్, హెచ్డీఎఫ్సీ జంట షేర్లు, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫినాన్స్, ఇండస్ఇండ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, స్టేట్ బ్యాంక్ వంటి దిగ్గజ షేర్లు నష్టాలు చవిచూశాయి.
* అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఐరోపా మార్కెట్లు సైతం భారీ నష్టాల్ని చవిచూస్తున్నాయి.
* ఒక్క హెల్త్‌కేర్ మినహా దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టాలు మూటగట్టుకున్నాయి. స్థిరాస్తి, లోహ, ఆటో, ఇన్ఫ్రా, ఆయిల్‌అండ్‌గ్యాస్, పీఎస్‌యూ, బ్యాంకింగ్ రంగ షేర్లు భారీ నష్టాల్లో స్థిరపడ్డాయి.
* మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ 2.72 శాతం కుంగగా.. బీఎస్ఈ స్మాల్ క్యాప్ 2 శాతం దిగజారింది.
* బీఎస్ఈలో 2,192 షేర్లు నష్టాల్లో ట్రేడవగా.. 896 షేర్లు మాత్రమే లాభాల్లో పయనించాయి.
► Read latest Business News and Telugu News
మరిన్ని
దేశంలో పేదరికం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలివే.. ఏపీ, తెలంగాణ ఏ స్థానంలో ఉన్నాయంటే?
Gold Bonds: 29 నుంచి మరో విడత గోల్డ్ బాండ్ స్కీమ్.. గ్రాము ధరెంతంటే?
5G Trails: 5జీ ట్రయల్స్‌లో వొడాఫోన్ మరో మైలురాయి.. 4Gbpsతో డేటా బదిలీ!
Tega Industries IPO: డిసెంబరు 1న టెగా ఇండస్ట్రీస్ ఐపీఓ.. ధర ఎంతంటే?
Tata Group: సెమీకండెక్టర్ల పరిశ్రమ ఏర్పాటుపై మూడురాష్ట్రాలతో చర్చలు?