
బిజినెస్
ముంబయి: భారత్‌లో ఓటీటీలకు ఆదరణ రోజురోజుకీ పెరుగుతోంది. దీంతో వీక్షకులను ఆకట్టుకునేందుకు వీడియో స్ట్రీమింగ్ సంస్థలు పోటీ పడుతున్నాయి. కొత్తతరం కంటెంట్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో అమెజాన్, నెట్‌ఫ్లిక్స్.. ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మకు చెందిన ‘క్లీన్ స్లేట్ ఫిల్జ్మ్ ప్రవేట్ లిమిటెడ్’తో చేతులు కలిపాయి. ఈ ఒప్పందం విలువ దాదాపు రూ.400 కోట్లని సమాచారం!
ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న క్లీన్‌స్లేట్ ఈ ఒప్పందంలో భాగంగా మొత్తం ఎనిమిది సినిమాలు, వెబ్ సిరీస్‌లను విడుదల చేయాల్సి ఉంటుంది. తర్వాత మరో 18 నెలల్లో మరికొన్ని చిత్రాలు, సిరీస్‌లు విడుదల చేయాల్సి ఉంటుందని సంస్థ సహవ్యవస్థాపకుడు, అనుష్క సోదరుడు కర్నేశ్ శర్మ బ్లూమ్‌బర్గ్‌తో చెప్పారు. ఈ ఒప్పందాన్ని నెట్‌ఫ్లిక్స్ ధ్రువీకరించింది. అమెజాన్ ఇంకా స్పందించలేదు. ఇరు సంస్థల నుంచి అధికారికంగా ప్రకటన వెలువడే వరకు మరిన్ని వివరాలను వెల్లడించబోమని కర్నేశ్ తెలిపారు.