
బిజినెస్
దిల్లీ: ఉక్కు తయారీకి వినియోగించే కోకింగ్ కోల్, ఫెర్రోనికెల్, పీసీఐ కోల్, కోక్, సెమీ కోక్ వంటి ముడి పదార్థాలపై కస్టమ్స్ సుంకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఇందువల్ల దేశీయంగా ఉక్కు తయారీ వ్యయం తగ్గి, ధరలు అదుపులోకి వచ్చే అవకాశముంది. దీంతోపాటు దేశీయ పరిశ్రమలకు ఇనుప ఖనిజం అందుబాటులో ఉండేలా చూసేందుకు, వీటి ఎగుమతిపై సుంకాన్ని 30 శాతం నుంచి 50 శాతానికి పెంచారు. ఐరన్ పెల్లెట్ల ఎగుమతిపై 45 శాతం, మరికొన్ని స్టీల్ ఇంటర్మీడియరీస్పై 15 శాతం పెంచారు. నేటి నుంచే ఇవి అమల్లోకి రానున్నాయి.
ప్లాస్టిక్ పరిశ్రమకూ: ప్లాస్టిక్ తయారీ పరిశ్రమల్లో వినియోగించే ముడి పదార్థాల పైనా దిగుమతి సుంకాన్ని తగ్గించారు. నాఫ్తాపై 2.5 శాతం నుంచి 1 శాతానికి, ప్రొపిలీన్ ఆక్సైడ్పై 5 నుంచి 2.5 శాతానికి, పాలిమర్స్ ఆఫ్ వినైల్ క్లోరైడ్పై 10 నుంచి 7.5 శాతానికి తగ్గించారు.