CM Jagan: కుప్పంను నా నియోజకవర్గంగానే చూస్తా

175 సీట్ల గెలుపు అక్కడనుంచే మొదలవ్వాలి

భరత్‌ను గెలిపిస్తే ఆయన్ను మంత్రిని చేస్తా

కుప్పం వైకాపా కార్యకర్తలతో భేటీలో సీఎం

ఈనాడు, అమరావతి: ‘కుప్పంను నా నియోజకవర్గంగానే చూస్తా. అన్ని రకాలుగా మద్దతునిస్తా. కుప్పం మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు రెండు రోజుల్లో రూ.65 కోట్లు విడుదల చేస్తా. పనులనూ వెంటనే ప్రారంభించుకోవచ్చు’ అని కుప్పం వైకాపా కార్యకర్తలతో ప్రత్యేక భేటీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. ‘మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ గెలవడం కుప్పం నుంచే మొదలవ్వాలి. అందుకే కార్యకర్తల సమావేశాలను అక్కడ నుంచే ప్రారంభించా’ అని చెప్పారు. నియోజకవర్గానికి 50 మంది చొప్పున పార్టీ కీలక కార్యకర్తలతో సమావేశాల్లో భాగంగా మొదటగా కుప్పం కార్యకర్తలతో ఆయన గురువారం తన క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కంటే ఇప్పుడు కుప్పంలో ఎక్కువ అభివృద్ధి జరుగుతోంది. కాబట్టే అక్కడి ప్రజల ఆశీస్సులు మనపై ఉన్నాయి, అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో ఘనవిజయాలు నమోదు చేశాం. ప్రజల ఆశీస్సులను ఓట్ల రూపంలోకి మార్చే బాధ్యత మీపైనే ఉంది. మీకు నేను అండగా ఉంటా. భరత్‌ను మీరు గెలిపిస్తే ఆయన్ను మంత్రిని చేస్తా. గతంలో కుప్పంలో గెలుస్తామా అనేది ప్రశ్నార్థకంగా ఉండేది.

ఇప్పుడు అక్కడ స్థానికసంస్థల ఎన్నికల్లో ఘన విజయాలు నమోదుచేశాం’ అని కార్యకర్తలకు ఆయన చెప్పారు. కుప్పంలో భరత్‌ను గెలిపిస్తే.. మీకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని కుప్పం రెస్కో ఛైర్మన్‌ సెంథిల్‌కుమార్‌కు సీఎం చెప్పినట్లు తెలిసింది.
సీఎం రమేష్‌కు కాంట్రాక్టు రద్దు చేసి.. ఏడాదిలో కెనాల్‌ పూర్తి: కుప్పం వైకాపా బాధ్యుడు, ఎమ్మెల్సీ భరత్‌ మాట్లాడుతూ.. ‘కుప్పం ప్రజల చిరకాల వాంఛ హంద్రీనీవా బ్రాంచి కెనాల్‌. ఆ కాలువ పూర్తయితే వైకాపాకు మైలేజీ వస్తుందని కావాలనే ఆ పనులను సీఎం రమేష్‌ అనే కాంట్రాక్టరు మూడేళ్లుగా చేయలేదు. ఆ కాంట్రాక్టును రద్దు చేసి, వేరొకరికి కాంట్రాక్టునిచ్చి ఏడాదిలోపు కాలువను పూర్తిచేస్తామని సీఎం చెప్పారు. 35ఏళ్లుగా ఒక మనిషికి కంచుకోటగా కుప్పం ఉంది.. ఇప్పుడా కోటను స్థానికసంస్థల ఎన్నికల్లో బద్దలుకొట్టాం, సాధారణ ఎన్నికల్లోనూ వైకాపాను గెలిపించి సీఎంకు ఇస్తాం’ అని వ్యాఖ్యానించారు.

ఇలాగైతే 75 సీట్లు కూడా గెలవలేం: మురళి
కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: కుప్పంలో వైకాపా వెంట ఉండి కష్టపడిన తమకు అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా పదవులు ఇవ్వలేదని వైకాపా నాయకుడు, మాజీ సర్పంచి మురళి ఆవేదన వ్యక్తం చేశారు. కుప్పంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కుప్పంలో వైకాపా మొదటి సర్పంచిగా గెలుపొంది తెదేపా ఒత్తిళ్లు ఎదుర్కొన్నా. సీఎం జగన్‌ కార్యకర్తలను పంపాలని చెబితే.. కుప్పం నుంచి ఛైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లను పంపారు. ఇలా ఉంటే కార్యకర్తలకు న్యాయం ఎలా జరుగుతుంది? ఇలాగైతే 175 కాదు.. 75 స్థానాలు కూడా గెలవలేం. ఒకే కుటుంబానికి ఏడు, మూడు చొప్పున పదవులిచ్చారు. కష్టపడిన కార్యకర్తలను సీఎం గుర్తించాలి. వారికి సముచిత స్థానం ఇవ్వాలి’ అని మురళి కోరారు. ఆయనతో వైకాపా నాయకుడు మోహన్‌ ఉన్నారు.


రేపు దిల్లీ వెళ్లనున్న సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ శనివారం బయల్దేరి దిల్లీ వెళ్లనున్నారు. 7న ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4:30 వరకూ రాష్ట్రపతిభవన్‌లో జరిగే నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశంలో పాల్గొంటారు. శనివారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి విశాఖపట్నం వెళ్తారు. అక్కడి నుంచి శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వెళ్లి అక్కడ శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాం కుమారుడి పెళ్లిలో పాల్గొంటారు. తర్వాత విశాఖకు తిరిగి వచ్చి, అక్కడి నుంచి దిల్లీకి వెళ్తారు. శనివారం రాత్రి దిల్లీలోని 1-జన్‌పథ్‌లో బస చేస్తారు. ఆదివారం నీతి ఆయోగ్‌ సమావేశం ముగిశాక తిరిగి విజయవాడకు వస్తారు.మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని