సర్దుపోటు రూ.2,910 కోట్లు

విద్యుత్‌ వినియోగదారులపై సర్దుబాటు భారం

2014-19 ఐదేళ్ల సగటు వాడకాన్ని బట్టి లెక్కింపు

జులై బిల్లు నుంచే డిస్కంల వసూలు

మొత్తంగా 36 నెలలు కట్టాల్సిందే

ఈనాడు, అమరావతి: గతంలో కంటే కరెంటు వాడకంలో పెద్దగా మార్పు లేకున్నా.. జులై నెల ఛార్జీలు పెరిగాయి. బిల్లు రసీదులో ట్రూఅప్‌(1/36) అనే కాలమ్‌కు ఎదురుగా చూపిన మొత్తం గత నెలలో వాడిన విద్యుత్‌కు సంబంధించింది కాదు. అది సర్దుబాటు ఛార్జీ (ట్రూఅప్‌). మూడో నియంత్రణ వ్యవధి (2014-15 నుంచి 2018-19) ఐదేళ్లలో విద్యుత్‌ సరఫరా వ్యయం, వాస్తవ వ్యయానికి మధ్య వ్యత్యాసాన్ని ట్రూఅప్‌ కింద వసూలు చేసేందుకు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) డిస్కంలకు గతంలో అనుమతించింది. ఈ రూపేణా రూ.2,910.74 కోట్లను వసూలు చేయడాన్ని పంపిణీ సంస్థలు ప్రారంభించాయి. రాష్ట్రంలోని 1.47 కోట్ల గృహ, 14.65 లక్షల వాణిజ్య, 1.63 లక్షల పారిశ్రామిక కనెక్షన్లుండగా, అన్నింటిపైనా సర్దుబాటు భారం పడనుంది. మొత్తం 36 నెలల పాటు ట్రూఅప్‌ వసూలు చేయనుండగా, జులై వాయిదా మొదటిది కావడంతో రసీదులో 1/36గా పేర్కొన్నారు.

సర్దుబాటు భారం ఇలా
ప్రతి కనెక్షన్‌ కింద 2014 నుంచి 2019 వరకు వినియోగించిన మొత్తం విద్యుత్‌ను లెక్కించిన డిస్కంలు.. దాని ఆధారంగా నెలకు వాడిన సగటు యూనిట్లను లెక్క తేల్చాయి. ఒక్కో యూనిట్‌పై దక్షిణ ప్రాంత విద్యుత్‌ మండలి (ఎస్‌పీడీసీఎల్‌) పరిధిలో 23, కేంద్ర విద్యుత్‌ పంపిణీ మండలి (సీపీడీసీఎల్‌) పరిధిలో 22, తూర్పు విద్యుత్‌ పంపిణీ మండలి (ఈపీడీసీఎల్‌) పరిధిలో 7 పైసల చొప్పున సర్దుబాటు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. 2022 జులై బిల్లులో ట్రూఅప్‌ కింద చూపిన మొత్తం ఎలాంటి మార్పు లేకుండా 36 నెలలపాటు చెల్లించాలి. ఎస్‌పీడీసీఎల్‌, సీపీడీసీఎల్‌ పరిధిలోని వారు 2025 జులై వరకు చెల్లించాలి. ఈపీడీసీఎల్‌ పరిధిలో 18 నెలలు (2024 జనవరి వరకు) చెల్లిస్తే సరిపోతుంది.

కిరాయిదారులూ.. జాగ్రత్త!
ఇల్లు అద్దెకు తీసుకునే వేళ.. నెలవారీ కిరాయి ఎంత అన్నదే తెలుసుకుంటే సరిపోదు. ఇకపై విద్యుత్‌ బిల్లులో ట్రూఅప్‌ ఎంత? అనీ అడగాల్సి ఉంటుందేమో! ఆ ఇంట్లో గతంలో అద్దెకు ఉన్నవారు ఎడాపెడా కరెంటు వాడి ఉంటే దానికయ్యే ట్రూఅప్‌ భారాన్ని ప్రస్తుతం ఆ ఇంట్లో అద్దెకు ఉండే వారు భరించాలి. ట్రూఅప్‌ లెక్కింపు కోసం పరిగణించిన ఐదేళ్లలో సగటు విద్యుత్‌ వినియోగం 300 యూనిట్లుగా ఉంటే.. ఇకపై ప్రతి నెలా బిల్లులో సర్దుబాటు కింద రూ.66 కలిపి వస్తుంది.


మరిన్ని

ap-districts
ts-districts