పాస్‌ పుస్తకాలున్నా పరిహారం సున్నా

కనీస విచారణ లేకుండానే అధికారుల తిరస్కరణ

మానవ హక్కుల వేదిక, రైతు స్వరాజ్య వేదిక

ఈనాడు-అమరావతి

సొంత భూమి ఉన్న రైతులు ఆత్మహత్య చేసుకున్నా.. కనీస విచారణ చేయకుండానే అధికారులు పరిహారం తిరస్కరిస్తున్నారని మానవహక్కుల వేదిక, రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ వాస్తవాలను తెలుసుకోకుండా పట్టాదారు పాసు పుస్తకం ఉన్న రైతులు ఆత్మహత్య చేసుకుంటే పరిహారం ఇవ్వలేదని నిరూపిస్తారా? అంటూ సవాల్‌ విసురుతున్నారని వారు విమర్శించారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని ఆరు గ్రామాల్లో ఆత్మహత్య చేసుకున్న 8 మంది రైతుల కుటుంబాలను కలిసి వాస్తవాలు తెలుసుకున్నామని వేదికల ప్రతినిధులు బి.కొండల్‌, కె.మదనశేఖర్‌, వీఎస్‌ కృష్ణ తెలిపారు. ఆ విషయాలను వారు వెల్లడించారు. పరిశీలించిన 8 కుటుంబాల్లో.. ఒక మహిళా రైతుకు మాత్రమే పరిహారం దక్కింది. మిగిలిన కుటుంబాలను త్రిసభ్య కమిటీ విచారణ చేయలేదు. రైతుల ఆత్మహత్య వెనక బోర్లు వేసి.. నీరు పడక అప్పుల పాలైన ఘటనలే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.

మీ నాన్న ఒక్కరికే నష్టం వచ్చిందా?
చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలం కర్లపూడిలో టి.వెంకటేశ్వరరెడ్డి అనే రైతుకు 2020 సంవత్సరంలో వేరుసెనగ పంట పూర్తిగా దెబ్బతింది. రూ. 3 లక్షల అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నారు. తర్వాత ఆయన భార్య సుబ్బులమ్మ అనారోగ్యంతో చనిపోయింది. తల్లిదండ్రులిద్దరిని కోల్పోయిన వారి కుమార్తె 22 ఏళ్ల అనిత.. తమకు న్యాయం చేయమని అధికారుల్ని కలిశారు. ‘బోర్లు వేస్తే అంత ఖర్చవుతుందా? అయినా ఆ ఏడాది వర్షాలు కురిశాయి కదా? మీ నాన్న ఒక్కరికే నష్టం వచ్చిందా?’ అంటూ ప్రశ్నించారు. రైతు ఆత్మహత్య కిందకు రాదంటూ పరిహారం తిరస్కరించారు’ అని అనిత ఆవేదన వ్యక్తం చేశారు.

రెండేళ్లయినా పరిహారమే అందలేదు
* విజయపురం మండలం కాలికాపురంలో రఘుపతి అనే రైతు ఆత్మహత్య చేసుకుంటే.. స్థానిక ఎమ్మెల్యే రోజా ఆ కుటుంబాన్ని పరామర్శించారు. రెండేళ్లయినా అధికారుల విచారణ పూర్తికాలేదు. పరిహారం అందలేదు.

* కేవీబీ పురం మండలం శ్రీనివాసపురంలో ఆరెకరాల భూమి ఉన్న ఏలుమలై అనే రైతు ఎనిమిది బోర్లు వేస్తే రెండు బోర్లలోనే కొంతమేర నీరు పడింది. రూ.8 లక్షల అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు వారం తర్వాత అధికారులను కలిశారు. 24 గంటల లోపే రావాలని.. ఇప్పుడు విచారణ సాధ్యం కాదంటూ వెనక్కు పంపారని ఏలుమలై తమ్ముడు ఈశ్వరయ్య వివరించారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని