ప్రైవేటు బడుల్లో పేదలకు కోటా

25శాతం ప్రవేశాలకు ప్రకటన విడుదల 10న

ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తుల స్వీకరణ

ప్రైవేటు బడులకు రూ.15,538 ఫీజు చెల్లింపు

ఈనాడు, అమరావతి: విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో 25శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించేందుకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ షెడ్యూల్‌ విడుదల చేశారు. ఈ మేరకు ప్రవేశాల కోసం ఆగస్టు 10న ప్రకటన విడుదల చేయనున్నారు. ఒకటో తరగతిలో ఆయా విద్యా సంస్థల్లోని ప్రవేశాల్లో 25శాతం సీట్లను అర్హులైన విద్యార్థులకు కేటాయిస్తారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌ పోర్టల్‌లో ఆగస్టు 16 నుంచి 26 వరకు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రవేశాలకు ప్రభుత్వమే బోధన రుసుములు చెల్లిస్తుంది. ఆవాసానికి కిలోమీటరులోపు దూరంలోని ప్రైవేటు పాఠశాలలను విద్యార్థుల తల్లిదండ్రులు ఆన్‌లైన్‌ పోర్టల్‌లో ఎంపిక చేసుకోవాలి. సీట్లు ఖాళీగా ఉంటే మూడు, ఐదు కిలోమీటర్ల దూరంలోని విద్యా సంస్థల్లోనూ ప్రవేశాలు కల్పిస్తారు. ఇప్పటికే సీబీఎస్‌ఈ ప్రవేశాలు ముగిసినందున ఈ ఏడాదికి వీటికి మినహాయింపునిచ్చారు. రాష్ట్ర బోర్డు అనుబంధంగా గుర్తింపు ఉన్న అన్ని పాఠశాలల్లోనూ విద్యాహక్కు చట్టం కింద ప్రవేశాలు కల్పిస్తారు. ప్రైవేటు పాఠశాలలు చేస్తున్న వ్యయం ఆధారంగా రూ.15,538 వార్షిక ఫీజుగా నిర్ణయించారు. ఈ మొత్తాన్ని పాఠశాలలకు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆన్‌లైన్‌ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసిన తర్వాత లాటరీ విధానంలో సీట్లు కేటాయిస్తారు.

అనాథ పిల్లలు, హెచ్‌ఐవి బాధితుల పిల్లలు, దివ్యాంగులకు 5శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 4శాతం, బీసీ, మైనారిటీ, ఓసీ పిల్లలకు 6శాతం సీట్లను కేటాయిస్తారు.

* ప్రవేశాలకు ఆగస్టు 10న ప్రకటన విడుదల
* ఆన్‌లైన్‌ పోర్టల్‌ 16వ తేదీన అందుబాటులోకి వస్తుంది.

* దరఖాస్తుల స్వీకరణ: ఆగస్టు16 నుంచి 26 వరకు
* లాటరీ విధానంలో ఎంపిక: 30వ తేదీన

* మొదటి ఎంపిక జాబితా విడుదల: సెప్టెంబరు 2న
* విద్యార్థుల ప్రవేశాలు: సెప్టెంబరు 2-9

* మిగిలిన సీట్లకు రెండో జాబితా: సెప్టెంబర్‌ 12-30

ప్రవేశాల్లో ఆలస్యం..
విద్యాహక్కు చట్టం(ఆర్టీఈ) కింద 25శాతం కోటాలో ప్రవేశాలు పొందే విద్యార్థులు రెండు నెలలు చదువును కోల్పోనున్నారు. ఈ ఏడాది అమలు చేయాలనుకున్న అధికారులు ఇందుకు తగినట్లు సకాలంలో ప్రణాళిక రూపొందించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జులై 5న పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఆర్టీఈ ప్రవేశాల ప్రక్రియ పూర్తయి విద్యార్థులు బడికి వెళ్లేందుకు సెప్టెంబరు రెండో తేదీ వస్తుంది. ఈ లెక్కన పిల్లలు రెండు నెలల పాఠాలను కోల్పోతారు. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు ప్రవేశాలు పొంది, తరగతులకు హాజరవుతున్నారు.  ఇప్పుడు 25శాతం కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఒకవేళ ప్రైవేటులో చేరిన వారు తమ సీట్లను రద్దు చేసుకోవాలనుకుంటే మొదటి విడతగా చెల్లించిన ఫీజును నష్టపోవాల్సి ఉంటుంది. ప్రధాన పట్టణాల్లో సీబీఎస్‌ఈ బడుల్లో ప్రవేశాలకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. ఈ ఏడాది ఈ పాఠశాలల్లో ఆర్టీఈ ప్రవేశాలు కల్పించడం లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని