పథకాలు అందాలంటే లంచం ఇవ్వాల్సిందేనా?

మంత్రి అంబటిని ప్రశ్నించిన మహిళ

చాగంటివారిపాలెం (ముప్పాళ్ల), న్యూస్‌టుడే: సంక్షేమ పథకాలు అందాలంటే లంచాలు ఇవ్వాల్సిందేనా అని పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం ఎస్సీ కాలనీకి చెందిన రుద్రపాటి అంజమ్మ రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబును ప్రశ్నించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గురువారం ఆయన కాలనీకిరాగా...  అమ్మఒడి పథకం కోసం వాలంటీరు లంచం తీసుకున్నారని, డ్వాక్రా రుణానికి రూ.2వేలు లంచం ఇచ్చానని ఆమె తెలిపారు. కాగితంపై రాసిస్తే వారిపై చర్యలు తీసుకుంటానని మంత్రి చెప్పడంతో అంజమ్మ ఫిర్యాదు పత్రం అందజేశారు. ‘మీరొస్తున్నారని ఈరోజే బ్లీచింగ్‌ చల్లారు.. రహదారులు, డ్రైనేజీలను శుభ్రం చేయడం లేదంటూ స్థానికులు కొందరు ఫిర్యాదు చేశారు. రోజూ బ్లీచింగ్‌ చల్లాలా అని ఎంపీపీ భర్త రామలింగారెడ్డి గట్టిగా మాట్లాడబోగా, నువ్వు ఆగవయ్యా అంటూ మంత్రి రాంబాబు నిలువరించారు. గ్రామానికి చెందిన ఎం.లలిత తమకు రైతుభరోసా లబ్ధి అందుతూ ఆగిపోయిందని.. తాము పొలం సాగు చేస్తున్నా ఎందుకు నిలిపేశారని ప్రశ్నించారు. ఆమె భర్త విద్యుత్తుశాఖలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి కావడంతో రైతుభరోసా నిధులు నిలిచిపోయాయని సచివాలయ ఉద్యోగి తెలిపారు. ఎంపీపీ మారూరి పద్మ, జడ్పీటీసీ సభ్యురాలు శిరిగిరి చంద్రకళ, సర్పంచి పీలా గాయత్రి, ఎంపీడీవో సుధాకర్‌, డిప్యూటీ తహసీల్దార్‌ ప్రసాద్‌, వైకాపా నాయకులు పాల్గొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని