దివ్యాంగ బాలుడి కష్టాలపై స్పందించిన సీఎం

తక్షణం సాయం అందించాలని ఆదేశం

పాయకరావుపేట, తుని పట్టణం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌కు తన గోడు వినిపించాలని వచ్చిన ఓ తల్లి సమస్య అక్కడికక్కడే పరిష్కారమైంది. గురువారం అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో వివాహ వేడుకకు సీఎం హాజరవుతున్నారన్న సమాచారంతో కాకినాడ జిల్లా శంఖవరం మండలం మండపం గ్రామానికి చెందిన నక్కా తనూజ.. మానసిక వైకల్యంతో బాధపడుతున్న కుమారుడు ధర్మతేజను తీసుకుని వచ్చారు. కల్యాణవేదికకు వెళ్లే మార్గంలో శ్రీచైతన్య పాఠశాల వద్ద రోడ్డు పక్కన కుమారుడితో వేచి ఉన్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌ దగ్గరకు రాగానే ముఖ్యమంత్రికి కనిపించేలా కుమారుడిని చేతులతో పైకెత్తారు. స్పందించిన సీఎం వెంటనే బస్సు ఆపి కిందికి దిగి వచ్చారు. దగ్గరకు పిలిచి సమస్యను ఆరా తీశారు. ఆమె ఇచ్చిన వినతిని పరిశీలించారు. మానసిక దివ్యాంగుడైన తన కుమారుడికి పింఛను రావడం లేదని, అనారోగ్య సమస్యలకు ఆర్థికసాయం అందించాలని ఆమె వేడుకున్నారు. దీంతో బస్సులో ఉన్న కాకినాడ జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లాను పిలిచి తక్షణమే సాయం అందించాలని ఆదేశించారు. ఆమె వెంటనే పింఛను మంజూరుపత్రాన్ని తయారుచేయించి అందజేశారు. బాలుడి సమస్య, కుటుంబ కష్టాలపై ఈ నెల 1న అన్నవరంలో జరిగిన ‘స్పందన’లో జిల్లా కలెక్టర్‌కు బాలుడి తల్లి అర్జీ కూడా ఇచ్చారు. దీనిపై ‘తాత్కాలిక వైకల్యమంటారా’.. అనే శీర్షికన ఈ నెల 2న ‘ఈనాడు’ కాకినాడ జిల్లా సంచికలో చిత్ర కథనం ప్రచురితమైంది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని