సీడ్స్‌ దుర్ఘటనపై క్షుణ్నంగా విశ్లేషణ

పీసీబీ కార్యదర్శి విజయ్‌కుమార్‌

ఈనాడు డిజిటల్‌, అనకాపల్లి, అచ్యుతాపురం, న్యూస్‌టుడే: అచ్యుతాపురం సెజ్‌లోని సీడ్స్‌ వస్త్రపరిశ్రమ దుర్ఘటనపై సాంకేతిక బృందంతో క్షుణ్నంగా విశ్లేషణ చేస్తామని రాష్ట్ర హైపవర్‌ కమిటీ ప్రతినిధి, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శి విజయ్‌కుమార్‌ తెలిపారు. అచ్యుతాపురం సెజ్‌లో గురువారం ఆయన కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టితో కలిసి పర్యటించారు. చెదల నివారణకు ఎలాంటి రసాయనాలు వినియోగిస్తున్నారు, మహిళల రక్త నమూనాల్లో వేటిని గుర్తించారని కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. చెదల నివారణ మందులను రాత్రి 10 తర్వాతే పిచికారీ చేస్తామని బ్రాండిక్స్‌ ప్రతినిధులు వివరించారు. రసాయన వాయువులు విడుదలైతే గుర్తించే పరికరాలు ఏర్పాటుచేశామంటూ వాటిని చూపించారు.

500 మంది దాటిన ప్రతి పరిశ్రమలో భద్రతా ఆడిట్‌: సీడ్స్‌లో మహిళలు అస్వస్థతకు గురికావడం అంతుపట్టడంలేదని విజయకుమార్‌ తెలిపారు. కంపెనీలో పరిశీలన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 500 మంది కార్మికులు దాటిన ప్రతి పరిశ్రమలోనూ భద్రతా ఆడిట్‌ చేస్తామని చెప్పారు. ‘ప్రమాదానికి కారణం తెలిస్తే తప్ప దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి,  పునరావృతం కాకుండా తీసుకునే చర్యలపై నిర్ధారణకు వచ్చే అవకాశం ఉండదు. పరిశ్రమల్లో ఉపాధి, కార్మికుల ఆరోగ్యం రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం ముందుకెళ్తుంది. జూన్‌ 3నాటి ప్రమాదంపై విశ్లేషణ చేస్తుండగా, మరో ప్రమాదం జరగడం ఇబ్బందిగా మారింది. కార్మికుల ఉపాధికి ఇబ్బంది లేకుండా త్వరగా నివేదిక రప్పించి పరిశ్రమను తెరిపించడానికి చర్యలు తీసుకుంటాం’ అని ఆయన తెలిపారు. బ్రాండిక్స్‌ భారతీయ భాగస్వామి దొరస్వామి, పీసీబీ ఈఈ సుదర్శణం, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని