రూ.6 వేల కోట్లు ఏమయ్యాయి?

ఏపీఎస్‌డీసీ అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి

జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ డిమాండ్‌

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌(ఏపీఎస్‌డీసీ)ను ఏర్పాటు చేసి తీసుకొచ్చిన రూ.23 వేల కోట్లలో రూ.6వేల కోట్లు ఏమయ్యాయో ప్రభుత్వం వెల్లడించాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ డిమాండ్‌ చేశారు. అది రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ కాదని రాష్ట్ర అప్పుల అభివృద్ధి కార్పొరేషన్‌ అని విమర్శించారు. ఈ కార్పొరేషన్‌ పేరుతో తెచ్చిన రుణాలలో రూ.16,899 కోట్లే ఖర్చు చేసినట్లు లెక్కలు చూపిస్తున్నారని పేర్కొన్నారు. ఏపీఎస్‌డీసీ అప్పులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్పొరేషన్‌ స్ఫూర్తి ఏమిటి? ప్రభుత్వం చెప్పిందేమిటి? చేస్తున్నదేమిటి? అని ప్రశ్నించారు. ఈ విషయాలపై ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడరని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వంలో ఏ సమాచారమూ బయటకు వెల్లడించడం లేదని ఆరోపించారు. కౌలు రైతుల ఆత్మహత్యల వివరాలను కూడా ఈ ప్రభుత్వం క్రైం రీసెర్చ్‌ బ్యూరోకు సమర్పించడం లేదన్నారు. మద్యం ద్వారా రూ.25వేల కోట్లను ప్రభుత్వం పొందుతోందని, ఈ ఏడాది ఇప్పటికే రూ.41 వేల కోట్ల అప్పులు చేసిందని.. ఈ సొమ్ములన్నింటినీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి పనులు లేవన్నారు. 2024 వరకు ఈ ప్రభుత్వానికి ప్రజలు అధికారం ఇస్తే 2025 ఆగస్టు వరకు బార్ల ఏర్పాటుకు లైసెన్సులు ఎలా జారీ చేసిందని నాదెండ్ల మనోహర్‌ ప్రశ్నించారు. కాంట్రాక్టు ఉద్యోగుల తల్లిదండ్రులకు పెన్షన్లు ఆపేశారని మండిపడ్డారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని